పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించిన మహారాష్ట్ర ప్రభుత్వం

ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌లపై విలువ ఆధారిత పన్ను (వాట్)ను తగ్గించింది. దీంతో శుక్రవారం నుంచి మహారాష్ట్రలో లీటరు పెట్రోలు  ధర రూ.5 చొప్పున, లీటరు డీజిల్  ధర రూ.3 చొప్పున తగ్గుతుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.6,000 కోట్ల మేరకు భారం పడుతుందని అంచనా.
ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇంధనం ధరలపై వ్యాట్‌ను తగ్గిస్తామని షిండే గత వారం ప్రకటించారు.  షిండే నేతృత్వంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెట్రోలు, డీజిల్‌లపై వాట్ ను  తగ్గించాలని నిర్ణయించింది.
 లీటరు పెట్రోలుపై రూ.5 చొప్పున, లీటరు డీజిల్‌పై రూ.3 చొప్పున తగ్గించాలని నిర్ణయించింది. దీంతో శుక్రవారం నుంచి ముంబైలో లీటరు పెట్రోలు రూ.106కు, లీటరు డీజిల్ రూ.94కు లభిస్తుంది. చమురు కంపెనీలు ప్రకటించే రోజువారీ ధరలనుబట్టి కొంచెం మార్పు ఉండవచ్చు.
వ్యాట్‌ను తగ్గించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.6,000 కోట్లు భారం పడుతుందని, అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందని షిండే చెప్పారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇచ్చిన ట్వీట్లలో కూడా ఈ వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర, మరాఠీ ప్రజలకు ఈ తగ్గింపు వల్ల ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.
సీఎం ఏక్‌నాథ్ రావ్ షిండే నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఈ తగ్గింపును ప్రకటించడం సంతోషకరమని చెప్పారు. సామాన్య ప్రజల లబ్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మే నెలలో పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ తగ్గింపు వల్ల లీటరు పెట్రోలుకు రూ.9.50;  లీటరు డీజిల్‌కు రూ.7 తగ్గుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలను కట్టడి చేసేందుకు చేపడుతున్న చర్యల్లో ఇదొకటని తెలిపారు.