శ్రీలంక చైనా ప్రాజెక్ట్ లో పెట్టుబడులు వద్దు… భారతీయులకు హెచ్చరిక 

భారత దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా కల్లోలిత శ్రీలంకలో చైనా చేబడుతున్న ప్రాజెక్ట్ లలో భారత దేశంపై చెందిన పారిశ్రామికవేత్తలు ఎవరు పెట్టుబడులు పెట్టవద్దని భారత ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా  14 బిలియన్ డాలర్ల పెట్టుబడితో చైనా నిర్మించ తలపెట్టిన పోర్ట్ సిటీ కొలంబోకు దూరంగా ఉండాలని వారించింది.
దక్షిణాసియాను తమ వ్యాపార గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో 2014లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ఈ  ప్రాజెక్ట్‌ని ప్రారంభించారు. అయితే చైనా అండతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ విషయంలో దూరం పాటించాలని భారత్ నిర్ణయించింది. భారతీయ ప్రైవేటు భాగస్వాములకు కూడా ఈ విషయాన్ని తెలియజేసింది.
పీసీసీ (పోర్ట్ సిటీ ఆఫ్ కొలంబో) ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం భారత ప్రయోజనాలకు విరుద్ధంగా పరిగణిస్తామని భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు జులై 1న సీనియర్ అధికారులు ఉన్నత స్థాయి సమావేశంలో తేల్చారు. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీ  నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.
శ్రీలంకతో ఆర్థిక సంబంధాల పటిష్టతకు మార్గాలను అన్వేషించాలని సమావేశంలో అధికారులు నిర్ణయించారు. అయితే భారత ప్రయోజనాలకు విరుద్ధంగా పోర్ట్ సిటీ కొలంబోలో పెట్టుబడులు పెట్టే భారతీయ ప్రైవేటు భాగస్వాముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
పీసీసీ పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉండదని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ఓ అధికారి వెల్లడించారు. భారతీయ జలాలకు సమీపంలోనే నిర్మితమయ్యే ఈ ప్రాజెక్ట్‌పై భారత్ ఆందోళన చెందుతోంది. మనీల్యాండరింగ్, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆస్కారం ఉంటుందని భావిస్తోంది.
కాబట్టి ఆ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే భారతీయ కంపెనీలపై సంబంధిత ఏజెన్సీలు దృష్టి సారించనున్నాయి. పీసీసీ ప్రాజెక్ట్ భారత్‌లోని గుజరాత్‌లో నిర్మించతలపెట్టిన గిఫ్ట్ సిటీ (గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్)కు ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉందని భావిస్తోంది.
కాగా గిఫ్టీ సిటీ నిర్మాణం పూర్తయితే భారత తొలి అంతర్జాతీయ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్‌గా నిలుస్తుంది. దేశీయ, అంతర్జాతీయ ఫైనాన్సియల్ సర్వీసులకు స్పెషల్ ఎకనామిక్ జోన్‌గా నిలుస్తుంది. శ్రీలంకతో ఆర్థిక బంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా సమగ్రమైన ఉమ్మడి ప్రణాళికను రూపొందించాలని అధికారులు యోచిస్తున్నారు.
 అవకాశాలను సృష్టించుకోవడం ద్వారా ఇరు దేశాల మధ్య బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. శ్రీలంకలో ట్రింకోమాలీ పోర్ట్, పవర్ ప్రాజెక్టులు, విమాన సర్వీసుల సంఖ్య పెంపు, జలవిహారాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.
దక్షిణాసియాలో ప్రీమియర్ రెసిడెన్సీ, రిటైల్, వ్యాపార గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో 2014లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించారు. హిందూ మహా సముద్రంలో 269 హెక్టార్లలో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ అభివృద్ధికి ఏకంగా 14 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతున్నట్టు జిన్‌పింగ్ చెప్పారు.
చైనాలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధికి అవసరమైన భూమి కోసం చైనా ఇప్పటికే 1.4 బిలియన్ డాలర్లు కూడా చెల్లించింది. కాగా ఈ ప్రాజెక్టులో ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, సెంట్రల్ పార్క్ లివింగ్, ఐలాండ్ లివింగ్, ది మెరీనా, ఇంటర్నేషనల్ ఐలాండ్ పేర్ల 5 ఆవరణలు ఉన్నాయి.