ప్రమాదం అంచున కడెం ప్రాజెక్టు.. ప్రాజెక్ట్ పైనుంచి ప్రవహిస్తున్న నీరు 

వరద గోదావరితో తెలంగాణ రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు గోదావరి, ప్రాణహిత ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రమాద స్థాయిని మించి గోదావరి దాని ఉపనదులు వరదలతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాలు వరద నీటితో అల్లాడుతున్నాయి.

మహోగ్రంగా పోటెత్తుతున్న గోదావరి ఉధృతికి నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రమాదం అంచుకు చేరుకొంది.  ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయిఎం బయటకు వెళుతున్న నీళ్ల (ఔట్‌ ఫ్లో) కన్నా ప్రాజెక్టులోకి వచ్చే వరద (ఇన్‌ ఫ్లో) ఒకటిన్నర రెట్లకు మించి పోటెత్తడంతో తన్నుకొస్తున్న ఆ వెల్లువకు మరో మార్గం లేక ప్రాజెక్టు మీద నుంచి పొంగుతోంది. ఎప్పుడేమి జరుగుతుందో తెలియక ఆ ప్రాంత ప్రజలు, అధికారులు ఆందోళనతో ఉన్నారు.

ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 705 అడుగుల మేర నీటి నిల్వ ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠతో రాష్ట్రమంతా కడెంవైపే చూస్తోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకున్న 18 గేట్లన్నీ తెరిచినా బయటకు వెళ్లే నీళ్లు (స్పిల్‌ వే సామర్థ్యం) 3లక్షల క్యూసెక్కులే!  గత 67 ఏళ్లలో ప్రాజెక్టుకు ఈ స్థాయి ఇన్‌ఫ్లో లేదని అధికారులు చెప్పారు.

ప్రాజెక్టు తెగిపోతే దిగువన ఉన్న కడెం, దస్తూరాబాద్‌ మండలాల్లోని 25 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ఇల్లు, ఊరు వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాంటూ ఆ రాత్రే ఆ గ్రామాల్లో చాటింపు వేయించారు.  అనంతరం ఆ 25 గ్రామాల ప్రజలను ఖానాపూర్‌, మంచిర్యాల తదితర ప్రాంతాల్లోని స్కూల్‌ భవనాలు, ఇతర కార్యాలయాల భవనాల్లో  ఆశ్రయం కల్పించారు.

500 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా కడెం నదిపరివాహకంగా ఇంత భారీ వర్షపాతం నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిర్మించాక 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో భారీ వర్షాలు పడుతుండడం తో అన్ని ప్రాజెక్ట్ లు నిండుకుండలా మారిపోయాయి. భారీ వరదలతో అన్ని ప్రాజెక్ట్ ల గేట్లు ఎత్తడం తో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

నదులు పొంగి పొర్లడంతో జనజీవనం అస్థవ్యస్థ మైంది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల జనం భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు.  ఉత్తర తెలంగాణలోని మొత్తం పదకొండు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఆదిలాబాద్, ఖమ్మం, అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, అసిఫాబాద్ తదితర జిల్లాల్లో పట్టణాల్లో సైతం వరద ఉధృతి పరవళ్లు తొక్కుతోంది.

నదీ పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల పుష్కర ఘాట్ల పైనుంచి గోదావరి నీరు ప్రవహిస్తోంది. భద్రాచలంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఉత్తర తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచనలతో అధికారులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది.  ఈ నేపథ్యంలో పల్లపు ప్రాంతాల్లోని జనాలను అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇంచుమించు అన్ని జిల్లాల్లోని సుమారు 5 లక్షల మందిని రెవెన్యూ యంత్రాంగం షెల్టర్లకు తరలించారు.

ప్రస్తుతం అల్ప పీడనం ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ వైపు కదులుతోందన్న వాతావరణ శాఖ అధికారులు దీని ప్రభావంతో గురువారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు వర్షాల నుంచి లభించినప్పటికీ.. మళ్లీ వచ్చే వారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

సోమవారం నుంచి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం కురుస్తున్నట్టుగా వారం మొత్తం వానలు పడవని,ఒకట్రెండు రోజులు మాత్రమే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.