నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ అరెస్ట్

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్ట్ చేసి, ప్రత్యేక సీబీఐ కోర్టులో హాజరుపరచింది. కోర్టు ఆమెను నాలుగు రోజుల ఈడీ కస్టడీకి ఆదేశించింది.
చిత్ర రామకృష్ణ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే, ఎన్ఎస్ఈ మాజీ అధిపతి రవి నారాయణ్‌లపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసును నమోదు చేసింది. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కేసులో సీబీఐ, ఈడీ దృష్టిలో ఓ సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.
 సంజయ్ పాండేకు సంబంధించిన సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టుపైనా, కొందరిపై అక్రమంగా నిఘా పెట్టడంపైనా దర్యాప్తు జరుపుతుండగా సీబీఐ దృష్టిలోకి ఈ జర్నలిస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. సంజయ్ పాండే చట్టవ్యతిరేకంగా కొందరిపై నిఘా పెట్టినట్లు సాక్ష్యాధారాలు లభించాయని సమాచారం.
పాండే మద్దతుగల ఈసీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెల్లించిన సొమ్ముకు సంబంధించిన రశీదులు, రికార్డింగ్స్ వాయిస్ శాంపిల్స్, రికార్డింగ్స్ ఒరిజినల్ ట్రాన్‌స్క్రిప్ట్స్, సర్వర్లు, రెండు ల్యాప్‌టాప్‌లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. నాలుగు ఎంటీఎన్ఎల్ లైన్స్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా సాక్ష్యాధారాలు లభించాయి.