ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ దేశాల్లో మాదిరిగానే గూగుల్, ఫేస్‌బుక్ వంటి టెక్ దిగ్గజాలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చే వార్తల కంటెంట్‌కు నగదు చెల్లించేలా కొత్త చట్టం తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రతిపాదిత చట్టం అమల్లోకి వస్తే ఆల్ఫాబెట్ (గూగుల్, యూట్యూబ్ యజమాని), మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ యజమాని), ట్విట్టర్ , అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ సంస్థలు భారతీయ వార్తాపత్రికలు, డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌లకు తమ ఆదాయంలో వాటా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ వార్తా కేంద్రాల ద్వారా వచ్చే అసలైన కంటెంట్‌ని ఉపయోగించడం ద్వారా మీడియా సంస్థలకు మెరుగైన ఆదాయం దక్కే అవకాశం ఉంటుంది. ఈ టెక్ దిగ్గజాలు మీడియా సంస్థల నుండి వచ్చే వార్తల కంటెంట్‌ను తమ ప్లాట్ఫామ్లలో ఉంచడం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ. మీడియా సంస్థలకు సరైన రీతిలో ఆదాయాన్ని పంచడం లేదనే ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలోనే కొత్త చట్టం ఆవశ్యకత ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. వార్తా ప్రచురణలతో ఈ డిజిటల్ వార్తల మధ్యవర్తులైన టెకీ సంస్థలు అపారమైన ఆదాయ వనరులను పొందుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మీడియా సంస్థలపై పక్షపాతం చూపుతున్నారనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.. ఇంటర్నెట్‌లో ఆధిపత్య స్థానాన్ని బిగ్ టెక్ దుర్వినియోగం చేయడంపై ప్రపంచవ్యాప్త పోరాటం జరిగింది.
అనేక దేశాలలోని వార్తా సంస్థలు బిగ్టెక్ దోపిడీ, గుత్తాధిపత్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు చట్టం ప్రకారం అట్లాంటి ముప్పును పరిష్కరించడానికి కొన్ని దేశాలు మార్గాలను వెతకడం ప్రారంభించాయి. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలు బిగ్ టెక్‌తో టెక్నో-వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపినప్పుడు తమ దేశీయ వార్తా పబ్లిషర్‌లకు మంచి స్థాయిని అందించడానికి నిర్దిష్ట చట్టాలను ప్రవేశపెట్టాయి.
కాగా, కెనడా కూడా ఈ మధ్యనే ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఇది గూగుల్ ఆధిపత్యాన్ని అంతం చేయడంతోపాటు, న్యాయమైన రాబడి గల ఆదాయాలను నిర్ధారించడానికి ప్రతిపాదించినట్లు అవగతమవుతోంది. ఇట్లాంటి ఎత్తుగడలతో కేవలం మీడియా సంస్థల ప్రయోజనాలకే కాకుండా, వినియోగదారులకు కూడా మేలు జరుగుతుంది.
మీడియా హౌస్లకు నిధుల ప్రవాహం పెరిగితే వార్తా సంస్థలు ఎక్కువ మంది జర్నలిస్టులను నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇవ్వడానికీ వీలు కలుగుతుంది. ఇది మెరుగైన, నాణ్యమైన జర్నలిజాన్ని ప్రోత్సహిస్తుంది. కంటెంట్ కోసం వినియోగదారులను నేరుగా చెల్లింపులు చేయడం అనేది ప్రచురణకర్తలకు సహాయపడుతుంది. క్రమంగా, ఇది డిజిటల్ అడ్వర్టైజింగ్ స్ట్రీమ్‌లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
గూగుల్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు తమ అల్గారిథమ్‌ల కారణంగా నకిలీ వార్తల నుండి లాభం పొందుతాయనే ఆరోపణలున్నాయి. ఉదాహరణకు గూగుల్ తన మొత్తం యాడ్ ట్రాఫిక్‌లో 48 శాతాన్ని నకిలీ లేదా తప్పుదారి పట్టించే వార్తల సైట్‌లకు అందజేస్తుందన్న విమర్శలున్నాయి. ఫేస్‌బుక్ కూడా 2016 అమెరికా ఎన్నికలు, కరోనా మహమ్మారి సమయంలో చూసినట్లుగా.. వాస్తవ వార్తలను కాకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వంటి ఆరోపణలున్నాయి.
More Stories
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం
రెండు రైతు సంక్షేమ పథకాలకు రూ.లక్ష కోట్లు