కోర్టులలో స్థానిక భాషల్లో వాదనలు, తీర్పులు పెరగాలి 

హైకోర్టు సహా దిగువ కోర్టుల్లో వాదనలు, తీర్పులు స్థానిక భాషల్లో పెరిగేలా ప్రయత్నించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు సూచించారు. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఇంగ్లీషులో కొనసాగించుకోవచ్చని ఆయన చెప్పారు. శనివారం ఆయన ఈ విషయమై మాట్లాడుతూ ఇంగ్లీషులో మాట్లాడితే న్యాయవాద వృత్తికి ఎక్కువ గౌరవం ఉంటుందని, ఎక్కువ కేసులతో పాటు పెద్ద మొత్తంలో ఫీజు వస్తుందనేదానికి తాను సముఖంగా లేనని స్పష్టం చేశారు.
 ఏ మాతృభాషనైనా ఇంగ్లీషు కంటే తక్కువగా పరిగణించకూడదని రిజుజు హితవు చెప్పారు.  శనివారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన ‘18వ అఖిల భారత లీగల్ సర్వీసెస్ అథారిటీ’ అనే కార్యక్రమంలో రిజుజు  ప్రసంగిస్తూ ‘‘ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు మధ్య సత్సంభందాలు ఉండాలి. దాని వల్ల ప్రజలకు సత్వర న్యాయంతో పాటు మరింత ఎక్కువ న్యాయం జరుగుతుంది” అని తెలిపారు.
” ఏ కోర్టు కూడా ప్రత్యేకాధికారుల కోసం మాత్రమే ఉండకూడదు, న్యాయం తలుపులు అందరికీ సమానంగా తెరిచి ఉండాలి. సుప్రీంకోర్టులో వాదనలు, తీర్పులు ఇంగ్లీషులో ఉంటాయి. అయితే హైకోర్టు సహా దిగువ స్థాయి కోర్టుల్లో ప్రాంతీయ, స్థానిక భాషలకు ప్రాధాన్యం ఉండాలి’’ అని పేర్కొన్నారు.
ఈ సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో న్యాయవ్యవస్థలోని సుమారు 70 చట్టాలను రద్దు యనున్నట్లు రిజుజు ప్రకటించారు. దేశంలో పెండింగ్ కేసుల పట్ల కిరణ్ రిజుజు ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ కేసులు ఐదు కోట్లకు పెరగబోతున్నాయని, ఇది న్యాయ వ్యవస్థకు అత్యంత భారంగా మారనుందని తెలిపారు.  ప్రభుత్వంతో సమన్వయం అయితే ఈ కేసుల సంఖ్యను తగ్గించవచ్చని ఆయన సూచించారు
స్థానిక భాషలో కోర్టుల్లో వాదనలు, తీర్పులు జరగాలనేది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ఇది ఆచరణలోకి రాలేదు కానీ, అప్పుడప్పుడు రాష్ట్రాల్లోకి కోర్టులు కొన్ని ప్రత్యేక సందర్భాల్ని పురస్కరించుకుని స్థానిక భాషల్లో తీర్పులు ఇస్తుంటాయి. కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు.
కోర్టు తీర్పులు సమాజంపై విశేష ప్రభావం చూపిస్తాయని, అవి సరళంగా, స్పష్టంగా, సాధారణ భాషలో ఉండాలని మంత్రి చెప్పారు. హైకోర్టుల్లో స్థానిక భాషల అమలుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయన్న ఆయన ఈ సమస్యకు త్వరలో పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
మూడేళ్ల క్రితం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సైతం కోర్టుల్లో స్థానిక భాషలో తీర్పులు, వాదనలు జరగాల్సిన ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. ప్రజలందరూ అర్థం చేసుకునే విధంగా హైకోర్టు తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. చట్టాన్ని అర్థం చేసుకోవడం, దానిని అన్వయించడం అన్నది దశాబ్దాలుగా ఒక సంక్లిష్ట ప్రక్రియగా మారుతూ వస్తోందని పేర్కొన్నారు.
సామాన్య ప్రజలు సైతం అర్థం చేసుకునేలా న్యాయ పరిభాషను పెంపొందించాలని, అలాగే నియమ నిబంధనలను సరళీకరించాలని ఆయన సూచించారు. ప్రజల వద్దకు న్యాయాన్ని తీసుకెళ్లడమే కాకుండా సంబంధిత వాది, ప్రతివాదులకు అర్థమయ్యే రీతిలోనే భాషలోనే తీర్పులు ఉండడం ఎంతో అవసరమని కోవింద్ స్పష్టం చేసారు.