ఆమ్నెస్టీ ఇండియాపై ఈడీ మనీ ల్యాండరింగ్‌ కేసు

బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడంతో భారత దేశంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్యకలాపాలను నిలిపివేసిన రెండేళ్ల తర్వాత ఆమ్నెస్టీ  ఇంటర్నేషనల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏఐఐపీఎల్‌), ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ట్రస్ట్‌ (ఐఏఐటీ) తదితర సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శనివారం మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ మేరకు బెంగళూరులోని ప్రిన్సిపల్‌ సిటీ సివిల్, సెషన్స్‌ జడ్జి కోర్టులో ఫిర్యాదు చేసింది. 

దీనిపై సంబంధిత సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసిందని ఈడీ తెలిపింది. విదేశీ మారక ద్రవ్య చట్టం(ఫెమా)ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమ్నెస్టీ ఇండియా, సంస్థ మాజీ సీఈఓ ఆకార్‌ పటేల్‌లకు శుక్రవారం ఈడీ రూ.61 కోట్లకు పైగా జరిమానా విధించింది.  ఆమ్నెస్టీ ఇండియా ఇప్పటికే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) కింద సిబిఐ దర్యాప్తుతో పాటు ఇడి ద్వారా విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం కింద పరిశీలనను ఎదుర్కొంటోంది.

2011-12లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బ్రిటన్ నుండి విదేశీ సహకారాన్ని స్వీకరించడానికి 2010లో  ఎఫ్‌సిఆర్‌ఎ   ప్రకారం  ఏఐఐపీఎల్‌  కి అనుమతి లభించినట్లు ఈడి విచారణ వెల్లడించింది. అయితే,  “ప్రతికూల సమాచారం” ఆధారంగా ఆ అనుమతిని రద్దు చేశారు.

“తరువాత,  ఎఫ్‌సిఆర్‌ఎ  మార్గం నుండి తప్పించుకోవడానికి 2013-14, 2012-13 సంవత్సరాల్లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఏఐఐపీఎల్‌), ఇండియన్స్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్ట్ (ఐఏఐటీ) అనే రెండు కొత్త సంస్థలు ఏర్పడ్డాయి.  సేవలు అందించే  ముసుగులో ఇవి విదేశీ నిధులు అందుకున్నాయి” అని ఈడి అధికారులు తెలిపారు.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఫౌండేషన్ ట్రస్ట్  ఎఫ్‌సిఆర్‌ఎ   లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత, విదేశాల నుండి డబ్బును స్వీకరించడానికి ఆమ్నెస్టీ సంస్థలు కొత్త పద్ధతిని అనుసరించాయని విచారణలో వెల్లడైంది. బ్రిటన్ లో ఉన్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కు సేవలు అందించినందుకు  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మార్గంలో   ఏఐఐపీఎల్‌  కు రూ 51.72 కోట్ల నిధుల బదిలీ జరిగింది.

ఈడి ప్రకటన ప్రకారం,  ఏఐఐపీఎల్‌   “సివిల్ సొసైటీ పని”ని నిర్వహించడం ద్వారా నేరం చేసింది. కానీ లాభాలను ఆర్జించే కంపెనీలో ఫారెక్స్‌ను స్వీకరిస్తోంది. తద్వారా ఎఫ్డిఐ నిధులను దుర్వినియోగం చేసింది. ఎఐఐపిఎల్ లేదా ట్రస్ట్ ద్వారా అందించిన సేవలకు సంబంధించిన వివరాలు లేదా పత్రాలు లేకపోవడం,  రెమిటెన్స్‌ల పొరలు లేయడం వంటి ఆధారాలతో ఏజెన్సీ ఈ అభియోగాలు చేస్తున్నట్లు పేర్కొన్నది.

“అమ్నెస్టీ ఇంటర్నేషనల్, బ్రిటన్ కు  సేవలను అందించేందుకు పొందిన ఆదాయం లేదా అడ్వాన్స్‌ల కోసం,  ఏఐఐపీఎల్‌,  ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, బ్రిటన్ ల మధ్య ఒప్పందపు ఇన్‌వాయిస్‌లు, కాపీలు వంటి ఆరోపించిన సేవలకు సంబంధించిన డాక్యుమెంటరీ రుజువు లేదు.  పైగా వాటిని ఏఐఐపీఎల్‌ ద్వారా అధీకృత డీలర్ బ్యాంకులకు అందించలేదు” అని ఒక ఈడీ  ప్రకటనలో తెలిపింది.

ఈడీ ఆరోపణలపై ఆమ్నెస్టీ ఇండియా స్పందిస్తూ కఠిన చట్టాలతో విమర్శకులను అణచివేయడం ప్రస్తుత భారత ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆరోపించింది. మనీల్యాండరింగ్‌ ఆరోపణల విషయం కోర్టులోనే తేల్చుకుంటామని తెలిపింది.