ఎవ్వరి మతపరమైన భావాలను మరెవ్వరు కించపరచ రాదు: ఆర్‌ఎస్‌ఎస్

కాళీ దేవతలు సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న సినిమా పోస్టర్ చుట్టూ ఉన్న సమస్యను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రస్తావిస్తూ ఎవ్వరి మతపరమైన భావాలను మరెవ్వరు కించపరచ రాదనీ స్పష్టం చేసింది.  రాజస్థాన్ లోని ఝుంఝునులో జరిగిన  అఖిల భారతీయ ప్రాంత్ ప్రచారకుల సమావేశం సందర్భంగా అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్  మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై వివరణ ఇచ్చారు.

“భారతదేశంలో సృజనాత్మక స్వేచ్ఛ ఒక సంప్రదాయంగా ఉంది. అయితే ఎవరూ ఎవరి మతపరమైన భావాలను దెబ్బతీయకూడదు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి” అని ఆయన హితవు చెప్పారు.   ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ కన్హయ్య లాల్ శిరచ్ఛేదం చేయడాన్ని ఖండిస్తూ,  ఈ సంఘటనను తాము కూడా ఖండించాలని ముస్లింలను ఆర్‌ఎస్‌ఎస్ కోరింది. ఈ క్రూరమైన నేరంపై హిందువులు ఆగ్రహంతో ఉన్నారని ర్కొంది.

“ఉదయ్‌పూర్ హత్యపై ఎంత ఖండించినా తక్కువ. ముస్లిం సమాజం కూడా ముందుకు వచ్చి ఉదయపూర్ హత్యకు వ్యతిరేకంగా మాట్లాడాలి” అని సునీల్ అంబేకర్ సూచించారు. భారత దేశంలోని ఇస్లాంవాదులు నూపుర్ శర్మకు, సోషల్ మీడియాలో ఆమెకు మద్దతు ఇస్తున్న వారికి పదే పదే చంపేస్తామని బెదిరింపులు జారీ చేయడాన్ని ప్రస్తావిస్తూ ‘కొన్ని రోజులుగా ప్రజలకు బెదిరింపులు వస్తున్నాయి. మీరు ఎవరితోనైనా ఏకీభవించకపోతే, శాంతియుతంగా నిరసన తెలిపే మార్గాలు ఉన్నాయి. ఒకరిని చంపే హక్కు మాత్రం ఎవరికీ లేదు” అని తేల్చి చెప్పారు.

లీనా మణిమేకలై దర్శకత్వం వహించిన కాళి అనే డాక్యుమెంటరీ పోస్టర్ కారణంగా చెలరేగిన వివాదం నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఈ వ్యాఖ్యలు చేసింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు దర్శకురాలు లీనా మణిమేకలైపై పలు కేసులు నమోదయ్యాయి. 

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మహువా మొయిత్రా ఈ సినిమా పోస్టర్‌పై వివాదానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ కాళీ మాత గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత పెద్దదైంది.

2025  సంఘ్ శతాబ్ది సంవత్సరంలో లక్ష శాఖలు  

2025లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది సంవత్సరాన్ని జరుపుకోనుంది. వార్షిక ప్రాంత్ ప్రచారక్ సమావేశంలో,  ఆర్‌ఎస్‌ఎస్   2025లో శతాబ్దికి ముందు సంవత్సరాల్లో సంస్థ విస్తరణ  కార్యక్రమాలలో భాగంగా సంఘ్ శాఖలు ఒక లక్షకు చేరుకొనే విధంగా కృషి చేస్తున్నామని సునీల్ అంబేకర్ తెలిపారు. 

 “ఆర్‌ఎస్‌ఎస్ తన 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. దీని శతాబ్ది సంవత్సరం 2025లో జరుపుకోబడుతుంది. ‘శతాబ్ది వర్ష్’కు ముందు మేము  ఆర్‌ఎస్‌ఎస్   విస్తరణకు లక్ష్యాలను నిర్దేశించుకున్నాము” అని వివరించారు. 

అలాగే సామాజిక జాగృతి సందేశాన్ని అందిస్తూ సంఘ్ కృషి సమాజంలోని అన్ని వర్గాలకు చేరాలని కూడా కృషి చేస్తున్నట్లు చెప్పారు. “2024 నాటికి దేశవ్యాప్తంగా లక్ష ప్రాంతాలకు శాఖలను తీసుకెళ్తాము.సంఘ్ కార్యకలాపం అందరికీ చేరువ కావాలని నిర్ణయించాం. సమాజంలోని వర్గాలు.. సామాజిక మేల్కొలుపు లక్ష్యంతో దేశంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. ఈ సమావేశంలో గతేడాది లక్ష్యాలను సమీక్షించి, వచ్చే రెండేళ్లకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందింము” అని వివరించారు.

“‘స్వావలంబి భారత్ అభియాన్’ కింద 22 సంస్థలు 4000 మంది యువకులకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చాయి. ఈ ప్రత్యేక రోజులకు సంబంధించిన అంశాలకు సంబంధించి జూలై 15 నుంచి అంతర్జాతీయ యువజన నైపుణ్యాల దినోత్సవం, పారిశ్రామికవేత్తల దినోత్సవం అయిన ఆగస్టు 21 వరకు కార్యక్రమాలు నిర్వహించబడతాయి” అని ఆయన తెలిపారు.

రెండేళ్ల కరోనా మహమ్మారి తర్వాత సంఘ్ కార్యక్రమాలు తిరిగి ఉపందుకొన్నాయని చెబుతూ ఈ ఏడాది  జరిగిన సంఘశిక్షా వర్గ్‌లో 40 ఏళ్లలోపు విద్యార్థులు 18,981 మంది, 40 ఏళ్లు పైబడిన విద్యార్థులు 2,925 మంది పాల్గొన్నారని అంబేకర్ తెలిపారు. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో 101 విభాగాల్లో మొత్తం 21,906 మంది విద్యార్థులు ఉన్నారు.

ప్రస్తుతం శాఖల సంఖ్య 56,824. సమాజంలోని  వివిధ వర్గాల వారి  సహకారంతో నీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణం, పరిశుభ్రత మొదలైన సామాజిక కార్యక్రమాలలో కార్యకర్తల భాగస్వామ్యం పెరుగుతోందని ఆయన చెప్పారు. అదే విధంగా సామాజిక సంస్థలు, సాధువులు, మఠాలు, దేవాలయాల సహాయంతో స్వచ్ఛంద సేవకులు కుటుంబ సభ్యులలో  జాగరణ, సామజిక రుగ్మతలు తొలగింపు కోసం ఈ పనిని ముందుకు తీసుకువెళుతుమని ఆయన తెలిపారు.

ఈ సమావేషాలలో ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, మన్మోహన్ వైద్య, సర్ కార్యవాహ దత్తాత్రేయ హాసభలే, అరుణ్ కుమార్, డా. క్రిషన్ గోపాల్, సి ఆర్ ముకుంద్ తదితరులు పాల్గొన్నారు.