దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా  కాళీ మాత ఆశీర్వాదాలు

దేశంలో కాళీ మాత వివాదం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.  భారత్‌పై కాళీమాత అపరిమితమైన ఆశీస్సులున్నాయని చెబుతూ ఇదే ఆధ్యాత్మిక శక్తితో విశ్వకళ్యాణం కోసం భారత్ ముందడుగు వేస్తోందని తెలిపారు.   కాళీమాతను బెంగాల్‌లోనే కాదు దేశం మొత్తం పూజిస్తుందని పేర్కొన్నారు.

స్వామి ఆత్మస్థానంద శత జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడిన మోదీ రామకృష్ట పరమహంస కూడా కాళీమాతను ఆరాధించేవారని గుర్తు చేశారు.  రామకృష్ణ మఠం 15వ అధ్యక్షుడిగా స్వామి ఆత్మస్థానంద పనిచేశారు. స్వామి రామకృష్ణ పరమహంస ఓ సన్యాసి. స్వయంగా తన కళ్ల ముందు కాళికా అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకున్నారు.

వివేకానందకు ఎంతో గుర్తింపు ఉన్నా, కాళి అమ్మవారి పట్ల భక్తి భావంతో చిన్న పిల్లాడిలా మారిపోయారు. అంతటి అచంచల విశ్వాసమే స్వామి ఆత్మస్థానందలోనూ ఉందని ప్రధాని వివరించారు.   స్వామి ఆత్మస్థానందతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ఆత్మస్థానంద ఆశీస్సులు లభించడం తన భాగ్యమని చెప్పారు.

స్వామి ఆత్మస్థానంద చివరి క్షణాల్లో కూడా తాను ఆయన వద్దే ఉన్నానని మోదీ గుర్తు చేసుకున్నారు. శ్రీరామకృష్ణ పరమహంస శిష్యుడైన స్వామి విజ్ఞానానంద… స్వామి ఆత్మస్థానందకు మంత్ర దీక్ష ఇచ్చారని ప్రధాని తెలిపారు.

భారత్‌లో అనాదిగా సన్యాస మార్గం ఉందని,  ఈ మార్గం ద్వారా సాధు సన్యాసులు లోక కళ్యాణం కోసం పనిచేస్తూ వచ్చారని మోదీ చెప్పారు. ప్రతి ఆత్మలోనూ శివుడిని చూసే సంస్కృతి సాధు సంతులకుందని చెబుతూ ఈ సందర్భంగా ఆయన ఆది శంకరాచార్యను, స్వామి వివేకానందను గుర్తు చేసుకున్నారు.

 ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ అనే పవిత్ర సంప్రదాయాన్ని వారు పాటించారని ప్రధాని గుర్తు చేశారు. ప్రస్తుతం రామకృష్ణ మిషన్ కూడా అదే సంప్రదాయం కోసం పనిచేస్తోందని చెప్పారు. దేశం నలుమూలలా నేడు శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ప్రభావం ఉందని ప్రధాని చెప్పారు.

కాళీమాత తన దృష్టిలో మాంసం తిని మధ్యం తాగే దేవత అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ వివాదాస్పద సినిమా పోస్టర్‌పై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాళీమాతను అవమానించేలా మాట్లాడిన మహువాను టీఎంసీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.

ఆమె మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు. హిందూ ధర్మాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా? కాళీమాతను ఎలా పూజించాలో వాళ్లు చెప్పడమేంటి అని ప్రశ్నించారు. బెంగాల్‌లో సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయన్నారు.  ఈ నేపథ్యంలో కాళీమాత అంశంపై మోదీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఆయన సినిమా పోస్టర్‌పై గాని, టీఎంసీ ఎంపీ పేరును గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, బెంగాలీ ప్రజలు కాళికామాతను ఆరాధించడాన్ని కూడా ప్రధాని ప్రస్తావించడం ద్వారా కాళికామాత పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్న వారికి ప్రధాని పరోక్ష హెచ్చరిక పంపినట్టయింది.

 ‘‘కాళి మాత భక్తి గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. కేవలం బెంగాల్ ప్రజల కోసమే కాదు, మొత్తం భారతావని తరఫున మాట్లాడారు. కానీ, టీఎంసీ ఎంపీ (మొయిత్రా) కాళికామాతను అగౌరవ పరుస్తోంది. మమతా బెనర్జీ ఆమెపై చర్యలు తీసుకోవడానికి బదులు, సమర్థిస్తున్నారు” అంటూ  బిజెపి నేత అమిత్  మాలవీయ ట్వీట్ చేశారు.