ముంబై, కర్ణాటకలకు రెడ్ అలెర్ట్ …  భారీ వర్ష సూచన

నైరుతి రుతుపవనాల రాకతో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళలలో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటకలకు రెడ్ అలర్ట్  ప్రకటించింది. గుజరాత్, ఢిల్లీలలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
మహారాష్ట్రలోని ముంబైలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం హెచ్చరించింది. జూలై 11 సోమవారం వరకు కొంకణ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కొంకణ్  ప్రాంతంలోని అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
కర్ణాటకలోని  కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ, రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది ఉడుపి జిల్లాలోని చాలా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నట్లు తెలిపింది. కలబురగిలో పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు.
 వర్షాల ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న 13 జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు, డిప్యూటీ కమిషనర్లతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ శుక్రవారం ఓ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వరద పరిస్థితిని సమీక్షించారు.  కుండపోతగా వర్షం కురుస్తుండడంతో రాష్ట్రంలో నదులు, వంకలు, వాగుల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
 
తుంగభద్ర నదీ తీర గ్రామాలు పూర్థి స్థాయి ప్రమాదంలో చిక్కుకున్నాయి. గ్రామాలకు నాలుగు దిక్కులా నదులు, వంకలు, కాలువలు ఉండడం, నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎలా బయటకు వెళ్లాలో తెలియక భయంతో ఆందోళన చెందుతున్నారు. 
కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో యెల్లో అలర్ట్‌ను  ఐఎండీ  జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో కేరళ, తెలంగాణా, కర్ణాటకలలో చెదురుమదురుగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.  గోవాలో 1 నుంచి 8 తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులకు సెలవు ప్రకటించారు. ఈ రాష్ట్రంలో కూడా ఐఎండీ రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా, మండీ, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో శనివారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. సిమ్లా, బిలాస్‌పూర్, హమీర్‌పూర్, ఉణ జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. శుక్ర, శనివారాల్లో తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
అస్సాంలో, గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద కారణంగా వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వర్షాలు, వరదలకు ఇప్పటివరకు 190 మంది మృతి చెందారు. 
 
రుతుపవనాలు చురుగ్గా కదలడంతో అసోంలోని 11 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 9 లక్షమంది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి. శుక్రవారం కురిసిన వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. 620 గ్రామాలు నీటిలో మగ్గుతున్నాయి.