తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు … తెలంగాణాలో రెడ్ అలెర్ట్ 

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, ఆవర్తనాలు, ద్రోణులు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాలలో  శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జూలై 10వ తేదీ వరకు రాష్ట్రానికి ‘రెడ్’ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించారు.
 
డైరెక్టర్ నాగరత్న స్పష్టం చేశారు. ఈ మూడు రోజుల పాటు కనిష్టంగా 7 సెం.మీ. నుంచి గరిష్టంగా 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో తక్కువ సమయంలోనే 7 సెంమీల మేర వర్షం కురవొచ్చని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో ఉత్తర, తూర్పు భాగాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు రానున్న రెండు రోజుల్లో కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
 
తెలంగాణలో బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాలో వానలు పడుతూనే ఉన్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా నల్లగొండ జిల్లా అంతటా విస్తారంగా వర్షం కురుస్తుండడంతో పట్టణంలోని పానల్ బైపాస్ రోడ్డుపై భారీగా వరద నీరు పారుతుండగా పలు మండలాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి.
 
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ రెండు రోజులగా భారీ వర్షం నమోదవుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తోన్న వర్షంతో భూపాలపల్లి కాకతీయ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షం కారణంగా సుమారు 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు అధికారులు తెలిపారు.
 
ఇల్లందులోని సింగరేణి జెకే5 ఓసిలో (ఓబి -ఓవర్ బర్డెన్) 6 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. టేకులపల్లి మండలం కోయగూడెం సింగరేణి ఓసి గనుల్లో సుమారు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని సింగరేణి అధికారులు తెలిపారు. మరోవైపు ఇల్లందు పట్టణంలోని అతిపెద్ద ఇల్లందులపాడు చెరువు అలుగు ప్రవహిస్తోంది.
 
 హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం నగరంలోని బంజారాహిల్స్, అమీర్‌పేట్, నాంపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, బిఎన్‌రెడ్డి నగర్, పెద్దఅంబర్‌పేట, తుర్కయంజాల్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
 
కాగా, ఏపీలో విశాఖపట్నంలో అత్యధికంగా 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతిలో 23 మిల్లీమీటర్లు, నందిగామలో ఎనిమిది, కళింగపట్నం, కడపల్లో ఆరు మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
రాగల మూడు రోజుల వరకూ రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను మాదిరిగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని దేశంలోని పలు రాష్ట్రాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
 
దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపునకు వంగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఉత్తర, దక్షిణ కోస్తాలో ఈ నెల పదో తేదీ వరకూ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల ప్రభావం కొనసాగనున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో రైళ్లకు, రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో పాత భవన నిర్మాణాల్లో ఉండేవారిని జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది.
 
ఇంకా మహారాష్ట్ర నుంచి కేరళ వరకు తీర ద్రోణి, ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాపై నుంచి తూర్పు, పడమర ద్రోణి వేర్వేరుగా విస్తరించాయి. అలాగే గుజరాత్ నుంచి ఒడిశాలోని గోపాల్‌పూర్ మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.