కుంభవృష్టితో అమర్‌నాథ్‌ యాత్రలో ఆకస్మిక వరద ..15 మంది మృతి!

జమ్ముకశ్మీర్‌ అమర్‌నాథ్‌ యాత్రను ఊహించని విపత్తు ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మిక వరద పోటెత్తింది. గుహ పరిసరాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంది. సుమారు 12 వేల మంది భక్తులు వరదలో చిక్కుకుపోయారు.  15 మంది మృతి చెందారని, మరో 40 మంది గల్లంతయ్యారని చెబుతున్నారు. 

ఈ ఘటన పట్ల రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత భక్తులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని భరోసా ఇచ్చారు. ఘటన వివరాలపై మోదీకి జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఫోన్లో వివరించారు.

కాగా ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత వేగవంతంగా సహాయక చర్యలను చేపట్టాలని కేంద్రబలగాలు, జమ్మూ కశ్మీర్‌ యంత్రాంగానికి హోంమంత్రి అమిత్‌ షా అదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై తాను జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో మాట్లాడినట్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌ బలగాలు సహాయక చర్యలకు దిగినట్లు ట్విటర్‌లో అమిత్‌ షా వెల్లడించారు. ‘‘భక్తుల ప్రాణాలు కాపాడటమే మా తొలి ప్రాధాన్యం.భక్తులందరూ క్షేమంగా ఉంటారనే ఆశిస్తున్నాను’’ అని ట్విటర్‌లో ఆయన రాశారు.

వరద ఉధృతికి పలువురు కొట్టుకు పోయినట్లు తెలుస్తోంది.  సాయం‍త్రం 5.30గం. నుంచి కుంభవృష్టి మొదలైంది. భోలేనాథ్‌ గుహ సమీపంలోనే కుంభవృష్టి  మొదలైంది. ఎగువ నుంచి పోటెత్తిన వరద ఉధృతికి భక్తుల కోసం ఏర్పాటు చేసిన 25 టెంట్లు, మూడు సామూహిక వంటగదులు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 15 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు.

పోటెత్తిన వరదలో 40 మంది కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఫలితంగా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.  విపత్తు నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక వాయిదా వేశారు.యాత్రికుల సహాయం కోసం ఆర్మీ హెలికాప్టర్‌లతో సహా ఆరు రెస్క్యూ బృందాలను భారత సైన్యం శుక్రవారం ప్రారంభించింది. 

ఆకాశం బద్ధలైనట్లుగా 2 కిలోమీటర్ల మేర వరద ఒక్కసారిగా కొండపై నుంచి కిందకు పోటెత్తిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పెను విషాదంగా మారే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం తగ్గడంతో.. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు లైట్ల వెలుతురులో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది.

ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి అమర్‌నాథ్‌ గుహ వైపు వరద పోటెత్తిందని ఇండో-టిబెటన్‌ సరిహద్దు దళానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. వర్షం ఇంకా కురుస్తూనే ఉన్నా పరిస్థితి అదుపులో ఉందని, యాత్రను మాత్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. భారీ వర్షం, వరద పోటు మొదలైన 10-15 నిమిషాల్లోనే అధికారులు సహాయక చర్యలకు దిగినట్లు, ఫలితంగా కొందరు భక్తులకు ప్రమాదం తప్పినట్లు చెబుతున్నారు.

 తమవారి ఆచూకీ తెలుసుకునేందుకు హెల్ఫ్‌లైన్‌ నంబర్లు (ఎన్డీఆర్‌ఎఫ్‌: 011-23438252, 011-23438253; కశ్మీర్‌ డివిజనల్‌ హెల్ప్‌లైన్‌: 0194-249640; పుణ్యక్షేత్ర బోర్డు హెల్ఫ్‌లైన్‌: 011-2313149) ఏర్పాటు చేశారు. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30న మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 72 వేల మంది స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. వాతావరణం బాగోలేదని మూడు రోజుల క్రితం యాత్రను నిలిపేశారు. వాతావరణం మెరుగుపడటంతో ఒక రోజులోనే తిరిగి పునః ప్రారంభించారు.

భారీ వర్గాలలో రాజాసింగ్ దైవదర్శనం 

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్  అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ శుక్రవారం దైవ దర్శనం చేసుకున్నారు. కుండపోత వర్షంతో అమర్‌నాథ్‌లో వరదలు రావడంతో వేలాది మంది భక్తులు ఇబ్బందులకు గురవడం చూసారు. కుటుంబంతో కలిసి అమర్‌నాథ్‌ దర్శనం చేసుకుని జమ్మూకశ్మీర్‌ వరకు తరలి వచ్చారు.

హెలికాప్టర్‌ అందుబాటులో లేకపోవడంతో గుర్రాలపై చేరుకున్నారు. వరదలు రావడం కొద్ది దూరం నుంచి కళ్లారా చూశానని, తన కళ్ల ముందే టెంట్లు కొట్టుకుపోయాయని తెలిపారు. దీంతో వెంటనే అక్కడి నుంచి తరలి పోయామని చెప్పారు. కాగా, శనివారం వైష్ణవీదేవి దర్శనానికి వెళ్తున్నట్లు రాజాసింగ్‌ తెలిపారు.