పోడు భూములు ధ్వంసం చేయవద్దు.. ఐటీడీఏ స్పష్టం

పోడు చేసుకొనే వారికి భూములపై హక్కులు కల్పించాలని, పోడు భూములు సాగు చేస్తున్న పంటలను ధ్వంసం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ శుక్రవారం భద్రాచలం ఐటీడీఏలోని గిరిజన భవన్లో జరిగిన పాలకమండలి సమావేశం తీర్మానం చేసింది.
34 నెలల తర్వాత నిర్వహించిన ఐటీడీఏ పాలకమండలి మీటింగ్లో పోడు భూముల మీదే ప్రధానంగా చర్చ జరిగింది. ఎజెండాలో మొత్తం 12 అంశాలు ఉండగా అటవీహక్కుల చట్టం, విద్య, వైద్యం, గురుకులాల మీద చర్చించి మిగతా ఎజెండాను పక్కన పెట్టేశారు.

మౌలిక సౌకర్యాలు కల్పించడం, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై ఎలాంటి చర్చ జరగలేదు. ఇదిలాఉంటే రూ.1.10 కోట్లతో నిర్మించిన గిరిజన భవన్లో తొలి మీటింగ్ సందర్భంగా భవన నిర్మాణంలోని డొల్లతనం బయటపడింది. భవనం మొత్తం లీకై మీటింగ్ హాలులోకి నీరు వచ్చింది.
ఆ సమయంలో గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్, రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్ దురిశెట్టి, ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు తదితరులు అక్కడనే ఉన్నారు.

భద్రాచలం నియోజకవర్గంపై తొలి నుంచి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోందంటూ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రస్తావించారు. ఏరియా వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరత, ఇతరత్రా సమస్యలను ఆయన ప్రస్తావించారు. ఐదు పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేసేందుకు తీర్మానం చేయాలని కోరారు.

భద్రాద్రికి రూ.100 కోట్లు మంజూరు చేసిన సీఎం రూ.100 కూడా విడుదల చేయలేదని గుర్తు చేశారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో 207 పోస్టులు ఖాళీగా ఉండడంపై నిలదీశారు. చర్లలో 108 మొరాయించడంతో ఆదివాసీ యువతి మరణించిన విషయాన్ని ఇర్ప శాంత సమావేశం దృష్టికి తీసుకురాగా కొత్త అంబులెన్స్  ఇస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

పాలక మండలి సమావేశం నేపథ్యంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఆదివాసీ, కొండరెడ్ల సంఘం, ఆదివాసీ సంక్షేమ పరిషతల ఆధ్వర్యంలో ఐటీడీఏ వద్ద వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయా పార్టీలు, సంఘాల నాయకులు మంత్రులు, ఎంపీల కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని నిలువరించారు.