టిఆర్ఎస్ ను ఢీకొట్టే దమ్ము ఒక్క బిజెపికే ఉంది

కేసీఆర్ ను అడ్డుకోవడం ఒక్క బీజేపీకే సాధ్యమని, టీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా ఒక బిజెపికి మాత్రమే ఉందని, మరే ఇతర పార్టీలకు లేదని  మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.  హైదరాబాద్ లో జరిగిన బిజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆదివారం జరిగిన బహిరంగ సభలో బీజేపీలో చేరిన ఆయన మొదటి సారిగా బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంకు వచ్చారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ను అడ్డుకోవడం ఒక్క బీజేపీకే సాధ్యమని, టీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా ఇతర ఏ పార్టీలకు లేదని చెప్పారు. ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందంటే తాను అక్కడే ఉంటానని పేర్కొంటూ  తాను నెలకు ఒక్క నాయకుడిని అయినా బీజేపీకిలోకి తీసుకొస్తానని ప్రకటించారు.

‘టీఆర్ఎస్ లో మూడు విధానాలు నడుస్తున్నాయి. ఒకరు కాళ్లు మొక్కించుకోవడం, మరొకరు డబ్బులు తీసుకోవడం, ఇంకొకరు కేసులతో బెదిరించడం’ అని కొండా పేర్కొన్నారు. తాను బీజేపీలో చేరే విషయం కాంగ్రెస్ నేతలందరికీ ముందుగానే తెలుసనీ చెప్పుకొచ్చారు.

ఇక బిజెపి కార్యాలయానికి వెళ్లిన కొండా అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బండి సంజయ్ సన్మానించారు. ఇన్నాళ్లు తాను ఏ పార్టీకి మద్దతుగా లేనని, అందుకే తనను ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. బీజేపీలో చేరిన తర్వాత చాలా మంది అడుగుతున్నారని తెలిపారు.

తెలంగాణ సమరయోధుడైన కొండా వెంకట రంగా రెడ్డి మనవడే కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వెంకట రంగారెడ్డి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన చేసిన కృషికి గుర్తుగానే ప్రస్తుతం ఆయన పేరిటనే మనం పిలుచు కుంటున్న రంగారెడ్డి జిల్లాకు పేరు పెట్టారు. 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌ను దగ్గరగా చూస్తూ పెరిగారు. కానీ, తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ పిలుపుతో ఆయన టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2014లో చేవెళ్ల నుంచి ఎంపిగా గెలిచారు. ఆ తర్వాత కొన్ని కారణాల రీత్యా టిఆర్‌ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 

ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి, 2019 ఎన్నికలలో లోక్ సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.కాంగ్రెస్ పార్టీకి 2021లో రాజీనామా చేసినప్పటి నుంచి తటస్థంగానే ఉంటున్నారు.