తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం విద్యావ్యవస్థను తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. కార్పొరేట్ స్కూల్స్‌ను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తోందని సోషల్ మీడియా ద్వారా విమర్శించారు.
రాష్ట్రంలో దాదాపు 20 వేలకు పైగా టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువు చెప్పేందుకు సరిపోను సార్లు లేర, వేల బడుల్లో ఒకరిద్దరు టీచర్లతోనే విద్యాబోధన జరుగుతోందని ఆమె చెప్పారు. ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశ పెట్టడంతో టీచర్ల అవసరం మరింత పెరిగిందంటూ సమస్య తీవ్రత దృష్ట్యా టీచర్ల రిక్రూట్మెంట్ను వేగంగా చేపట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదని ఆమె దుయ్యబట్టారు.
టెట్ ముగిశాక 14 వేల ఉపాధ్యాయ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేస్తమని విద్యాశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి పలుమార్లు ప్రకటించినా ఇప్పటి వరకు ప్రభుత్వం పేర్కొన్న ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే,ఈ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి, నోటిఫికేషన్ విడుదల, పరీక్ష, ఫలితాల ప్రకటన పూర్తయ్యేసరికి ఈ ఏడాది గడుస్తుందని ఆమె పేర్కొన్నారు.
టీచర్లు లేకుండానే విద్యార్థులుపై తరగతులకు ప్రమోట్ కావాల్సి వస్తుందన్న విజయశాంతి రాష్ట్రంలో చివరిసారిగా 2017 జులై 23న ప్రభుత్వం టెట్ నిర్వహించిందని గుర్తు చేసారు. అప్పట్లో సుప్రీం కోర్టు తీర్పుతో 2017 అక్టోబర్ 22న 8,792 టీచర్ పోస్టుల ఖాళీలకు టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయగా… ఆ తర్వాత దాదాపు మళ్లీ ఐదేండ్లకు గత నెల 12న టెట్ నిర్వహించిందని ఆమె వివరించారు.
ఇలా కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటోందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గురుకుల పాఠశాల్లలో 9 వేల ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినా ఆ పోస్టులకు టెట్తో సంబంధం లేదని తెలిపారు.
అయినా కూడా కేసీఆర్ సర్కార్ ఆ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆమె ధ్వజమెత్తారు. దీన్ని బట్టి కేసీఆర్ సర్కార్‌కు విద్యా వ్యవస్థపై ఎంత చిత్త శుద్ధి ఉందో అర్ధమవుతోందని ఆమె తెలిపారు. కేసీఆర్ ఇప్పటికైనా చిల్లర రాజకీయాలను పక్కన పెట్టి టీచర్ల పోస్టులను భర్తీ చేయాలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ సర్కార్‌కు విద్యార్థి లోకం తగిన గుణపాఠం చెబుతుంని విజయశాంతి హెచ్చరించారు.
More Stories
కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమే
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్