న్యాయమూర్తులకు శిక్షలు ఉండవా?

న్యాయమూర్తులకు శిక్షలు ఉండవా?
–ఎ.ఎస్. సంతోష్

ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చివరి మజిలీగా భావించేది కోర్టులనే. తమ పట్ల ఎంతో విశ్వాసంతో కోర్టులను ఆశ్రయించే ప్రజల సమస్యలను నిస్పక్షపాతంగా విచారించి, సరైన న్యాయం చేయాల్సిన జడ్జిలు, ఆశ్రయించిన వారి పట్ల దుష్ప్రవర్తనకు, పక్షపాతానికి పాల్పడితే న్యాయవ్యవస్థ, ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం తగ్గుతుంది.

కోర్టు కేసుల విచారణ సందర్భంగా కక్షిదారుల పట్ల దుష్ప్రవర్తనకు పాల్పడ్డ జడ్జిలకు సంబంధించిన వార్తలు ఇటీవల తరచూ చూస్తున్నాము. ఇటీవల ముంబై హైకోర్టు మహిళా న్యాయమూర్తి పుష్ప గనెడివాలా, క్రింది కోర్టులో పోక్సో (మైనర్ బాలికపై లైంగిక దాడి) కేసులో క్రింది కోర్టు విధించిన శిక్షను ఎదుర్కొంటున్న వ్యక్తి చేసుకున్న అప్పీలుపై తనవద్దకు విచారణకు వచ్చిన సందర్భంలో “బాలికను ఓ పరిధి దాకా తాకితే నేరం కాదు” అంటూ, మరిన్ని  విపరీత వ్యాఖ్యలు చేయడంతో పాటు, నిందితుడికి పడిన శిక్ష తగ్గించడం పట్ల యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి  గురైంది. బాలికలపై లైంగికదాడులను సమర్ధించేదిగా ఆమె వ్యాఖ్యలు ఉండటంతో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియం ఆమెను తిరిగి జిల్లా కోర్టుకు సాగనంపడం తప్ప ఏమీ జరగలేదు. ఇప్పుడు తాజాగా ఏకంగా సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి నూపుర్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్ మీద విచారణ చేపట్టాల్సింది పోయి ఉదయపూర్ దారుణ ఘటనపై మాట్లాడుతూ, ఆ దారుణానికి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలే కారణం అంటూ ఎలాంటి విచారణా లేకుండా తేల్చేయడం ద్వారా ఉగ్రవాద ఘటనలకు పాల్పడే మతోన్మాదులకు ఊతం ఇచ్చినట్లయింది. తాజా ఘటనతో దేశం యావత్తు న్యాయవాదుల ప్రవర్తనపై విచారం వ్యక్తం చేస్తోంది.

సహజంగానే కోర్టుహాల్లో జడ్జిల దుష్ప్రవర్తనపై ప్రజల్లో ఆగ్రహం, అసహనం వ్యక్తమవుతూ ఉంటుంది. వీటి దృష్ట్యా 2021 నవంబర్ లో జరిగిన రాజ్యాంగ దినోత్సవం నాడు సాక్షాత్తు భారత్ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ “కోర్టులో జడ్జీలు మాట్లాడే అనవసర, సంబద్ధ మాటల విషయంలో కాస్త విచక్షణతో మెలగాలి” అని హితవుపలికే స్థితికి ఇది చేరింది.

న్యాయం చేయాల్సిన జడ్జీలు తప్పు చేస్తే వారిని ఎవరు శిక్షిస్తారు? అనేది సామాన్య ప్రజల ప్రశ్న. భారత రాజ్యాంగంలోని 124(4), 124(5) అధికారణాలతో పాటు న్యాయమూర్తుల విచారణ చట్టం 1968 (The Judges [Inquiry] Act, 1968)ల ద్వారా ‘అభిశంసన’ (Impeachment) ద్వారా దుష్ప్రవర్తన, అసమర్ధతల ఆధారాంగా  న్యాయమూర్తిని తొలగించే అవకాశం ఉన్నప్పటికీ ఇది ఒక సుదీర్ఘ, అత్యంత కష్టసాధ్యమైన ప్రక్రియ అయినందున దాదాపు అసాధ్యం అనే చెప్పవచ్చు.

న్యాయమూర్తిపై అభిశంసన ప్రక్రియ మొదలుపెట్టడానికి లోక్ సభలో కనీసం 100 మంది లేదా 50 మంది రాజ్యసభ సభ్యుల బలం అవసరం ఉంటుంది. వారంతా అభిశంసన కోరుతూ తమ సంతకాలతో రాష్ట్రపతి రాసిన విన్నపాన్ని స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ కు సమర్పించాలి. దీనిపై స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఒక న్యాయ నిపుణుడిటో కూడిన త్రిసభ్య కమిటీ వేసి, అభిశంసన ఎదుర్కునే జడ్జి అవినీతి లేదా అసమర్ధతను ఆ కమిటీ నిర్ధారిస్తూ నివేదిక సమర్పిస్తే ఆ నివేదిక ఆధారంగా ఉభయసభల్లో ‘అభిశంసన తీర్మానం’పై చర్చ ప్రవేశపెడతారు. ఈ చర్చలో అభిశంసన తీర్మానానికి మద్దతుగా మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ మరియు ఆరోజు సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతులకు తక్కువ కాకుండా ఆమోదింపబడితేనే ఆ తీర్మానాన్ని భారత రాష్ట్రపతికి పంపబడుతుంది. పార్లమెంట్ నుండి ఆమోదింపబడిన “అభిశంసన తీర్మానం” అందుకున్న రాష్ట్రపతి, తన ఉత్తర్వులు ద్వారా ఆ జడ్జిని తొలగిస్తారు.

చదువుతుంటే సులువైనది అనిపించినప్పటికీ ఇది చాలా సుదీర్ఘమైన, ఆచరణ విషయంలో కష్టమైన ప్రక్రియ. రాజ్యాంగంలోని అధికరణం 124(5) దుష్ప్రవర్తన లేదా అసమర్ధత కారణంగా న్యాయమూర్తులను అభిశంసన ద్వారా తొలగించవచ్చు అని చెప్పిందే కానీ అసలు ఎలాంటి ప్రవర్తనను దుష్ప్రవర్తనగా పరిగణించాలి, న్యాయమూర్తి అసమర్ధుడు అని ఎప్పుడు భావించాలి అనేవి ఎక్కడా లేవు.

భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు కేవలం నాలుగు సార్లు మాత్రమే న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టగలిగారు. మొట్టమొదటి సారి 1973లో జస్టిస్ వి. రామస్వామి హైకోర్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలో అవకతవకలకు పాల్పడినట్టు ఆడిట్ నివేదికలో తేలడంతో లోక్ సభ విచారణ కమిటీ ఏర్పాటు చేసి, ఆరోపణలు నిజమే అని నిర్ధారించినప్పటికీ, సభలో మూడింట రెండు వంతుల బలం లేక అభిశంసన తీర్మానం వీగిపోయింది.

2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్ ఆర్ధిక అవకతవకలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల కారణంగా అతనిపై రాజ్యసభలో ‘అభిశంసన’ తీర్మానానికి 58 మంది ఎంపీలు నోటీస్ ఇవ్వడంతో ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ ఏర్పడింది. అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమే అని నిర్ధారణ జరగడంతో పాటు రాజ్యసభలో తీర్మానం ఆమోదానికి  కావాల్సిన సంఖ్య కన్నా ఎక్కువగా ఉండటంతో, అది లోక్ సభకు చేరకముందే సౌమిత్ర సేన్ తనకుతానుగా రాజీనామా చేశారు. ‘దుష్ప్రవర్తన కారణంగా రాజ్యసభలో ‘అభిశంసన’ ఎదుర్కొన్న మొదటి జడ్జి ఇతనే.

2014లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.కె. గంగూలీపై అదే రాష్ట్రానికి చెందిన మహిళా న్యాయమూర్తి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రాజీనామా చేయడంతో పాటు ఆ లేఖను అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోదా ఇతర న్యాయమూర్తులకు పంపడంతో ఈ అంశంపై విచారణ కమిటీ ఏర్పాటైంది. కానీ విచారణ కమిటీ నివేదిక ఎస్.కె. గంగూలీకి అనుకూలంగా ఉండటంతో ‘అభిశంసన’ ప్రక్రియ సాధ్యపడలేదు.

ప్రస్తుతం నూపుర్ శర్మ కేసులో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె.బి పరిదివాలా 2015లో గుజరాత్ హైకోర్టు జడ్జిగా ఉన్న సమయంలో రిజర్వేషన్ల అంశంలో కులపరమైన వ్యాఖ్యలు చేయడంతో 56 మంది రాజ్యసభ ఎంపీలు అతనిపై ‘అభిశంసన’ చర్యలు కోరగా, గత్యంతరం లేని పరిస్థితుల్లో తన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించి, బయటపడ్డారు.

2017లో కులపరమైన ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సీవీ నాగార్జున రెడ్డిపై రాజ్యసభ ఎంపీలు ‘అభిశంసన’ ప్రక్రియకు ప్రయత్నించారు. అయితే కావలసిన బలం లేకపోవడం వల్ల ఈ అంశంలో విచారణ కమిటీ కూడా ఏర్పాటు కాలేదు.

2018లో రాజ్యసభలో 71 మంది విపక్ష పార్టీల ఎంపీలు అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై అభిశంసన ప్రక్రియకు ప్రయత్నించారు. సుప్రీంకోర్టుకు వస్తున్న కేసుల విచారణ జడ్జీలకు కేటాయిస్తున్న విధానంతో పాటు మొత్తం 5 అంశాలను ఆధారంగా చేసుకుని అభిశంసనకు ప్రయత్నం చేయడంతో, వీటిలో ఎక్కడా ‘దుష్ప్రవర్తన’ అనేది లేదు అన్న కారణంతో రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు అభిశంసన ప్రక్రియను తోసిపుచ్చడంతో ప్రయత్నాలు వీగిపోయాయి.

ఇదిలా ఉండగా 2011 జులైలో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీడీ దినకరన్ పై అవినీతి, భూముల ఆక్రమణ, అధికార దుర్వినియోగం అంశాల్లో విచారణకై అప్పటి రాజ్యసభ చైర్మన్ కమిటీ ఏర్పాటు చేయగా, ‘అభిశంసన’ ప్రక్రియ మొదలు కాకముందే అతను పదవికి రాజీనామా చేశారు.

దుష్ప్రవర్తనకు పాల్పడిన లేదా అసమర్ధ న్యాయమూర్తుల తొలగింపులో జరుగుతున్న విఫల యత్నాలను పరిశీలిస్తే ‘అభిశంసన ప్రక్రియ’ ఎంత కఠినతరమైనదో తెలుస్తుంది.

Reference:

Home


https://blog.ipleaders.in/

(వ్యాసకర్త – సామాజిక, హక్కుల కార్యకర్త మరియ ‘లీగల్ రైట్స్ ప్రొటెక్షన్’ ఫోరమ్ అధ్యక్షులు.
email id – contact.lrpf@gmail.com)