అల్లూరి సాగించింది జాతీయ ఉద్యమమే 

కేవలం స్థానికమైన పరిమితమైన సమస్యలపై జరిగిన తిరుగుబాట్లను పితూరీ అంటారని, అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగినది జాతీయోద్యమమే కాని పితూరీ కాదని జాగృతి సంపాదకులు డా౹౹గోపరాజు నారాయణరావు స్పష్టం చేశారు.
 
భాగ్యనగరంలోని జాగృతి భవనంలో నవయుగ భారతి, జాగృతి వార పత్రికల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన విప్లవాగ్ని అల్లూరి రామరాజు 125వ జయంత్యుత్సవం కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొంటూ మైదాన ప్రాంత ఉద్యమానికి, గిరిజనుల సమస్యలపరిష్కార ఉద్యమానికీ అనుసంధానం చేయటమే అల్లూరి సాగించిన స్వాతంత్ర్యోద్యమంలోని విశిష్టతయని తెలిపారు.
ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అల్లూరి శతజయంతి సందర్భంగా విప్లవాగ్ని అల్లూరి గ్రంథరచనకై మన్యం లోని వివిధ గ్రామాలను సందర్శించి, చిటికెల భాస్కర నాయుడు, చిటికెల దాలినాయడు తదితరుల నుండి సమాచారం సేకరించిన అనుభవాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.  
చేంబోలు శ్రీ రామశాస్త్రి అధ్యక్షత వహిస్తూ చరిత్ర అవగాహన పట్ల దృష్టి నిలుపని కారణాన ఎంతగానో చరిత్ర వక్రీకరింపబడినదని ఆవేదన వ్యక్తం చేశారు.  వాస్తవమైన చరిత్ర బోధించడం లేదని పేర్కొంటూ విద్యావంతులు ఈ అంశంపై దృష్టి సారించాలని సూచించారు.
నవభారతి ప్రచురణల సంపాదకులు, ప్రముఖ రచయిత డా౹౹ వడ్డి విజయసారథి కరుణశ్రీ ఉదయశ్రీ నుండి అల్లూరి సీతారామరాజు గురించిన పద్యాలను పాడి వినిపించారు. కేశవస్మారక విద్యాసంస్థల కార్యదర్శి డా౹౹ అన్నదానం వేంకట సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆకుపచ్చ సూర్యోదయం’ గ్రంథ రచయిత డా౹౹గోపరాజు నారాయణరావుకు ఈ సందర్భంగా  చిరు సత్కారం జరిపారు.