నాలుగు క్లస్టర్స్‌గా తెలంగాణ ఎంపీ సీట్లకు కేంద్ర మంత్రుల బాధ్యతలు

హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ఆ పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ప్రకటించిన బీజేపీ జాతీయ నాయకత్వం.. ఇందుకోసం నేరుగా రంగంలోకి దిగుతోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం నేరుగా కేంద్రమే వ్యూహరచన చేస్తున్నది. ఆ మేరకు రాష్ట్ర నాయకత్వాన్ని సమాయత్తం చేస్తున్నది. 
 
ఒక వైపు పార్టీలో కొత్తగా చేరికలు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ, మరోవైపు నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని పటిష్ట పరచుకోవడం పట్ల దృష్టి సారిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలలో సహితం అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం కోసం ఇప్పటి నుండే కార్యాచరణ అమలు చేయనున్నారు. 
 
ఈ కార్యాచరణ అమలులో నేరుగా కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు భాగస్వాములు కానున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను 14 నియోజకవర్గాలను బీజేపీ జాతీయ నాయకత్వం నాలు గు క్లస్టర్లు (ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌)గా  గుర్తించింది. 
 
ఆయా నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులను ఇన్‌చార్జులుగా నియమించింది. వీరు ఆయా నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు. ఒక్కో క్లస్టర్‌లో మూడు, నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటాయి. ప్రతి నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌గా ఒక కేంద్ర మంత్రిని నియమించారు.
ఈనెల 8 నుంచే కేంద్ర మంత్రులు క్లస్టర్లలో పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. 8న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత మిగతా కేంద్రమంత్రులు వరసగా రాష్ట్రంలో తమకు కేటాయించిన క్లస్టర్లలోని ఎంపీ స్థానాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు
 
 ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, భువనగిరి ఇన్‌చార్జ్‌గా ప్రహ్లాద్ జోషి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ ఇన్‌చార్జ్‌గా మహేంద్రనాథ్ పాండే, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి బీఎల్ వర్మను నియమించారు. 
 
వీరితో పాటు ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక కేంద్రమంత్రిని నియమించారు. ఆదిలాబాద్, పెద్దపల్లికి పురుషోత్తం రూపాల, జహీరాబాద్‌కు నిర్మలా సీతారామన్, మెదక్‌కు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, చేవెళ్ల, మల్కాజ్ గిరికి ప్రహ్లాద్ జోషిలను నియమించారు. 
 
 భువనగిరికి దేవీసింగ్ చౌహాన్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్‌కు మహేంద్రనాథ్ పాండే, నల్లగొండకు కైలాశ్ చౌదరి, వరంగల్‌కు ఇంద్రజిత్ సింగ్,  హైదరాబాద్‌కు జ్యోతిరాధిత్య సింధియా, మహబూబాబాద్, ఖమ్మం‌కు బీఎల్ వర్మను నియమించారు. తెలంగాణ నుంచి పార్లమెంట్ ప్రవాసీ కన్వీనర్‌గా ప్రేమేందర్ రెడ్డి, కోకన్వీనర్లుగా ఉమారాణి, జయశ్రీని నియమించారు.
 
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా  ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టాలి? సీనియర్‌ నాయకులకు ఏ బాధ్యతలు కేటాయించాలి? టీఆర్‌ఎస్‌ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు మరింత సమర్థంగా ఎలా తిప్పికొట్టాలి? రాష్ట్రంలో కేంద్ర మంత్రులు ఏం చేయాలి?తదితర అంశాలను జాతీయ నాయకత్వమే నిర్దేశించబోతోందని చెబుతున్నారు.