ఏకనాథ్ షిండేను సీఎంగా ప్రతిపాదించింది నేనే!

గత వారం ఉద్దవ్ థాకరే నాయకత్వంలోని ఎంవిఎ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ షిండేను కొత్త ముఖ్యమంత్రిగా చేయాలని బిజెపి నాయకత్వానికి ప్రతిపాదించినట్లు తానే అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. కావాలనుకొంటే తానే ముఖ్యమంత్రిని అయ్యేవాడినని చెప్పారు.

అయితే తాను డిప్యూటీ సీఎం పదవిని చేపట్టేందుకు మానసికంగా సిద్ధపడలేదని స్పష్టం చేశారు. కానీ,  ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలిపారు.  ”నేను ప్రభుత్వంలో లేకుండా ఉండే ప్రభుత్వం నడవదని పార్టీ సీనియర్ నేతలు గట్టిగా పట్టుపట్టారు. వారి ఆదేశాలకు కట్టుబడే ఉప ముఖ్యమంత్రి పదవికి అంగీకరించాను” అని ఫడ్నివిస్ తెలిపారు.

ఏక్‌నాథ్ షిండే‌ను విజయవంతమైన ముఖ్యమంత్రిగా నడిపించాల్సిన బాధ్యత తనపైన ఉందని ఆయన చెప్పారు. రాజ్యాంగేతర అధికారంతో ప్రభుత్వాన్ని నడపడం సరికాదని, తాను ప్రభుత్వంలో భాగం కావాలని బీజేపీ నాయకత్వం విశ్వసిస్తోందని ఫడ్నవీస్ పేర్కొన్నారు.

2019 ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి విజయం సాధించిందని, అయితే ప్రజా తీర్పు దొంగిలించబడిందని ఆరోపించారు. కాబట్టి బిజెపి,   షిండే నేతృత్వంలోని శివసేన వర్గం అధికారం కోసం కాకుండా ఉమ్మడి సిద్ధాంతం కోసం కలిసి వచ్చాయని తెలిపారు.

“మన నాయకులు నరేంద్ర మోదీ జీ, అమిత్ షా, జేపీ నద్దాజీ, నా ఆమోదంతోనే (షిండేను సీఎం చేయాలనే నిర్ణయం తీసుకున్నాం)…. ఈ ప్రతిపాదనను నేను (బీజేపీ నాయకత్వానికి) తీసుకున్నానని చెబితే తప్పులేదు. షిండేను ముఖ్యమంత్రిని చేయడానికి వారు (నాయకత్వం) అంగీకరించారు” అని ఫడ్నవీస్ వివరించారు.

ఉద్ధవ్ థాకరే బలపరీక్షకు ముందు సీఎం పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత షిండే ముఖ్యమంత్రిగా,  ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా జూన్ 30న ప్రమాణ స్వీకారం చేశారు. షిండేను ముఖ్యమంత్రిగా ప్రకటించిన సందర్భంగా తాను ప్రభుత్వంలో చేరబోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

 

కానీ “బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నాకు ఫోన్ చేసి పార్టీ నిర్ణయించిందని (నన్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని) చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నాతో మాట్లాడారు” అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఏక్‌నాథ్ షిండే శివసేన సైద్ధాంతిక వారసత్వాన్ని “టార్చ్ బేరర్” అని, కుటుంబ వారసత్వం ఉద్ధవ్ ఠాక్రే వద్ద ఉందని ఫడ్నవీస్ చెప్పారు.

“బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతంపై దృఢంగా నిలబడిన శివసేన ఏకనాథ్ షిండేది. ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే కుమారుడు. అందువల్ల కుటుంబ వారసత్వం ఆయనకుమాత్రమే చెందుతుంది. అయితే అదే సమయంలో, ఏకనాథ్ షిండే సైద్ధాంతిక వారసత్వానికి శ్రీకారం చుట్టారు,” అని బిజెపి సీనియర్ నాయకుడు వివరించారు.
హిందుత్వ వ్యతిరేక శక్తులు (ఎన్‌సిపి, కాంగ్రెస్) బలపడి సేనను బలహీనం చేస్తున్నాయని సేన శాసనసభ్యులు తమకు ఫిర్యాదు చేయడంతో బిజెపి “సహాయం” చేయాలని నిర్ణయించుకుందని ఫడ్నవీస్ చెప్పారు. శివసేన శాసనసభ్యులు తమతో చర్చలు జరిపినప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఎలా ఎదుర్కోవాలి, ఏవిధంగా ప్రజలను ఓట్లు అడగాలి అనే రెండు ఆలోచనలతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

 
 హిందుత్వ సిద్ధాంతంపై నిలబడిన పార్టీ ఇప్పుడు ఆ శక్తులతో నిలుస్తోందని భరోసా ఇచ్చారు. “హిందుత్వానికి వ్యతిరేక శక్తులు మా భుజాలను ఉపయోగించి బలపడుతున్నాయి.  మా పార్టీ బలహీనపడుతోంది” అని వారు చెప్పడంతో తాము వారికి సహాయం చేయాలని, మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని మాజీ ముఖ్యమంత్రి వెల్లడించారు. 

అమిత్ షాకు ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సంఘటనలన్నింటిలో అమిత్ షా తమ వెనుక కొండంత అండగా నిలిచారని చెప్పారు. షిండే ప్రభుత్వం మిగిలిన రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసి, సంపూర్ణ ప్రజా మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.