తెలంగాణాలో బిజెపి బలోపేతంపై మూడు కమిటీలు 

జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జరిగిన బహిరంగ సభకు అనూహ్య స్పందన లభించడంతో తెలంగాణాలో బిజెపి అధికారంలోకి రాబోతున్నదనే వాతావరణం ఏర్పర్చడంలో కొంతమేరకు విజయం సాధించినట్లు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా భావిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాదిన పార్టీ పటిష్టంగా ఉన్న దృష్ట్యా,  ఇక దక్షిణాదిపై దృష్టి సారించడంపై ప్రధానంగా ఈ సమావేశాలలో చర్చించారు. 

దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారం అందుకోవాలని నడ్డా సూచించారు. ఆ తర్వాత తమిళనాడు, కేరళ, ఏపీలోను పార్టీ బలోపేతంపై ముమ్మర కసరత్తు చేయాలని కోరారు.  రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ పక్కాగా గెలుస్తుందనే వాతావరణాన్ని ఇప్పటి నుంచే కల్పించాలని, ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రూట్ మ్యాప్ ను  సిద్ధం చేయాలని రాష్ట్ర పార్టీ నాయకులను కోరారు.

తెలంగాణలో పార్టీ కార్యక్రమాల వేగం పెంచి, అసెంబ్లీ ఎన్నికల దాకా పార్టీ మొత్తం ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర పార్టీ నాయకులను బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. రాష్ట్రంలో పార్టీపరంగా రాజకీయ కార్యకలా పాలను మరింత విస్తృతం చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలు, హామీలను నిలుపుకోకపోవడం, అవినీతి, నియంత, అప్రజాస్వామిక పాలనను ఎండగట్టాలని చెప్పింది.

ఈ అంశాలన్నీ ప్రజల్లో నిరంతరం చర్చనీయాంశంగా ఉండేలా చూడాలని సూచించింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలు రూపొందించుకోవాలని, లోక్‌సభ ఎన్నికలకు ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశమున్నందున మొదట అసెంబ్లీ స్థానాల పరిధిలో విస్తృత కార్యాచరణ చేపట్టాలని ఆదేశించింది. రాష్ట్రంలో సంస్థాగత బలోపేతం, పోలింగ్‌ బూత్‌ల పటిష్టం, ఇతర పార్టీల నుంచి బలమైన నేతల చేరికల ద్వారా పార్టీ బలాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకుని ఎన్నికల్లో విజయాన్ని ఖాయం చేసుకోవాలని సూచించారు.

వెంటనే రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై బీజేపీ దృష్టి సారిస్తున్నది. ​ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే మూడు కీలక కమిటీలను నియమించింది. ఈటల రాజేందర్​ కన్వీనర్​గా ‘చేరికలపై సమన్వయ కమిటీ’ని, జితేందర్​రెడ్డి కన్వీనర్​గా ‘ఫైనాన్స్​ కమిటీ’ని, ధర్మపురి అర్వింద్​ కన్వీనర్​గా ‘ప్రజా సమస్యలు, టీఆర్​ఎస్​ వైఫల్యాలపై అధ్యయన కమిటీ’ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సోమవారం ఏర్పాటు చేశారు. 

జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామికి ‘చేరికలపై సమన్వయ కమిటీ’తోపాటు ‘ప్రజా సమస్యలు, టీఆర్​ఎస్​ వైఫల్యాలపై అధ్యయన కమిటీ’లో చోటు దక్కింది. చేరికల కమిటీలో జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ, కొత్తగా పార్టీలో చేరిన మాజీ ఎంపీ కె  విశ్వేశ్వర రెడ్డి, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా కె లక్ష్మణ్, మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్ కూడా ఉన్నారు. 

మరో  జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్​రావును కూడా చేరికలు, ఫైనాన్స్​ కమిటీల్లోకి తీసుకున్నారు. కాగా, ఇప్పటి వరకు బీజేపీ చేరికల కమిటీకి చైర్మన్​గా ఉన్న పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆ పదవి నుంచి తప్పుకున్నారు.