చాలాకాలం అణచివేతకు గురయ్యాను… షిండే

తాను చాలా కాలం పాటు అణచివేతకు గురయ్యానని అంటూ ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోనే పాత శివసేనతో తనకు ఎదురైన న్యాయం కారణంగానే తిరుగుబాటుకు దారితీయవలసి వచ్చినదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. తన నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం మాట్లాడుతూ  “నేటి సంఘటనలు కేవలం ఒక్క రోజులో జరగలేదు” అని తెలిపారు.
గత నెలలో శివసేన ఎమ్మెల్యేల వర్గంతో షిండే తిరుగుబాటు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్  అఘాడి  ప్రభుత్వం పతనానికి దారితీసింది. జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, బిజెపికి చెందిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉపముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు.

“నేను ఎన్నికై ఇక్కడకు వచ్చిన తర్వాత నా పట్ల ఏ విధంగా వ్యవహరించారో ఇక్కడున్న చాలామంది సభ్యులకు తెలుసు. నేను చాలాకాలం అణచివేతకు గురయ్యాను. సునీల్ ప్రభు (ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే) కూడా అందు సాక్షి,” అని తెలిపారు.

 
 ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సేన వర్గం తన ఇంటిపై దాడి చేసిందని, రెబల్ ఎమ్మెల్యేలపై కించపరిచే పదజాలం ఉపయోగించారని, గౌహతిలో క్యాంప్ చేస్తున్న సమయంలో తమను జంతువులతో పోల్చారని షిండే ఆరోపించారు. “ఒక వైపు మీరు నన్ను కలవడానికి, చర్చలకు వ్యక్తులను పంపారు, కానీ మరోవైపు నన్ను దుర్భాషలాడారు.  నా ఇంటిపై రాళ్లు రువ్వారు. వారు మమ్మల్ని జంతువులతో పోల్చారు, మమ్మల్ని దుర్భాషలాడారు.  మమ్మల్ని సజీవ శవం అని పిలిచారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు,

మహా వికాస్ అఘాడి బ్యానర్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన, కాంగ్రెస్‌ల మధ్య “అసహజ” కూటమి కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపుతూ, “గత రెండున్నరేళ్లలో, మేము కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాము. సేనలో ఉండడం వల్ల దావూద్ ఇబ్రహీంతో మిత్రపక్షంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోలేకపోయాం. మేము వీర్ సావర్కర్‌ను ప్రశంసించలేకపోయాము, ఎందుకంటే మేము కాంగ్రెస్‌తో ఉన్నాము”. అని గుర్తు చేశారు.

తన వర్గాన్ని “ద్రోహులు” అని ముద్రించారని, అయితే తాము కాదని షిండే స్పష్టం చేశారు. “మేము శివసైనికులం, మేము శివసైనికులం. శివసైనికులుగానే కొనసాగుతాము” అని షిండే ప్రకటించారు. “మేము దివంగత బాలాసాహెబ్ , ఆనంద్ దిఘేల సైనికులం. అభివృద్ధి, హిందుత్వం మా ఎజెండాలో ఉన్నాయి” అని పేర్కొన్నారు. 

 
ఎంవీఏలో శివసైనికులు బాధపడ్డారని పేర్కొంటూ “కొందరు కేసులు ఎదుర్కొన్నారు.  కొందరు ఎఫ్‌ఐఆర్‌లను ఎదుర్కొంటున్నారు. వారు నా దగ్గరకు వచ్చి ఏడ్చేవారు… నేను వారికి పట్టణాభివృద్ధి నుండి నిధులు ఇచ్చేవాడిని” అని వివరించారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను ఉటంకిస్తూ, 2019 నవంబర్‌లో అధికారంలోకి వచ్చిన త్రైపాక్షిక మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శివసేనలో “ప్రమాదం” జరిగిందని సీనియర్ ఎన్‌సిపి నాయకుడు తనతో చెప్పారని షిండే వెల్లడించారు.

కాంగ్రెస్, ఎన్‌సిపి నాయకులు షిండే ఆధ్వర్యంలో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదని మహా వికాస్ అఘాడీ ఏర్పాటుకు ముందే ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ తనకు తెలియజేశారని ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటనను పేర్లు ప్రస్తావించకుండానే షిండే ఉదహరించారు. 


“కానీ ఎంవిఎ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మీ స్వంత పార్టీలో (శివసేన) ప్రమాదం జరిగిందని అజిత్ పవార్ నాతో చెప్పారు. మీరు ముఖ్యమంత్రి కావడాన్ని మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు,” అని ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి కావడాన్ని ప్రస్తావిస్తూ షిండే తెలిపారు. 
 
గతంలో బీజేపీ-శివసేన కూటమి అధికారంలో ఉన్నప్పుడు తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని షిండే పేర్కొన్నారు.‘‘త్వరలో నాకు మంచి పోస్టింగ్ వస్తుందని కేంద్ర మంత్రి (బీజేపీ నేత) నితిన్ గడ్కరీ నాకు చెప్పారు” అని వెల్లడించారు.
 
భావోద్వేగానికి గురైన షిండే 

అసెంబ్లీలో మాట్లాడుతూ షిండే భావోద్వేగానికి గురయ్యారు. ఉద్ధవ్‌ థాకరేపై తిరుగుబాటు ప్రకటించడంతో తన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని అంటూ గతంలో చనిపోయన తన ఇద్దరు కుమారులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. 
 
 తన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వచ్చేసరికి వారు నిద్రపోయేవారని, వారు బయటికి వెళ్లే సమయానికి తాను నిద్రపోయి ఉండేవాడినని, దీంతో వారితో గడిపేందుకు సమయం ఉండేది కాదని పేర్కొన్నారు. 
 
అలాగే తన కుమారుడు శ్రీకాంత్‌తో కూడా ఎక్కువ సమయం గడపలేకపోయానని తెలిపారు. తన ఇద్దరు పిల్లలు మరణించిన సమయంలో శివసేన సీనియర్‌ నేత ఆనంద్‌ ధిఘే తనను ఓదార్చారని చెప్పారు. అప్పుడు తాను ఎందుకోసం బతకాలని ప్రశ్నించుకున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. 
 
కానీ తన కుటుంబం కోసం తాను జీవించానని షిండే పేర్కొన్నారు. ఆనంద్‌ ధిఘే తన కన్నీళ్లు తుడిచారని, అలాగే ఇతరుల కన్నీళ్లు తుడవమని తనకు స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. తాను కోలుకోవడానికి, అసెంబ్లీలో శివసేన నేత స్థాయికి   ఎదిగేలా  చేశారని గుర్తు చేసుకున్నారు.