డబల్ ఇంజిన్ ప్రభుత్వంకు బాటలు వేస్తున్న తెలంగాణ ప్రజలు

దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో కూడా బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ప్రజలు బాటలు వేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. పార్టీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా  సికింద్రాబాద్‌లో జరిగిన `విజయ సంకల్ప’ బహిరంగ సభలో భారీ సంఖ్యలో, అత్యుత్సాహంతో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. 

2019 ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్దతు పలికారని,  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరిందని చెబుతూ ప్రతి ఎన్నికలలో ప్రజల మద్దతు పెరుగుతున్నదని, దానితో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్లు స్పష్టం అవుతున్నదని తెలిపారు. తెలంగాణ నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ లక్ష్యమన్న ప్రధాని.. రాష్ట్రభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు.

ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడాన్ని మనం చూశామని గుర్తు చేశారు.  రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందని చెబుతూ దేశంలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన   ఐదు మెగా టెక్స్‌టైల్ పార్క్లలలో ఒకదానిని తెలంగాణలో నిర్మిస్తామని వెల్లడించారు. దీని వల్లన వేలాదిమంది యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

కరోనా సమయంలో తెలంగాణ ప్రజల కోసం చాలా పనిచేశామని, తెలంగాణ నుండి ఒక టీకా మొత్తం ప్రపంచంకు చేరి ఎందరో ప్రాణాలను కాపాడినదని చెబుతూ ఆ సమయంలో ప్రజలకు ఉచిత రేషన్‌, ఉచిత టీకాలు అందించామని వివరించారు. 

హైదరాబాద్‌లో సైన్స్‌ సిటీ ఏర్పాటుకు ఎంతో ప్రయత్నిస్తున్నామని,  బయోమెడికల్‌ సైన్సెస్‌ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయని పేర్కొంటూ నూతన విద్యావిధానం ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తెలుగులోనే టెక్నాలజీ, మెడికల్‌ చదువుకొనే అవకాశం వస్తుందని తెలిపారు. 

హైదరాబాద్‌లో రూ.1500 కోట్లతో ఫైఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌లు నిర్మిస్తున్నామని,రూ.350 కోట్లతో హైదరాబాద్‌కు మరో రీజనల్ రింగ్‌ రోడ్డు మంజూరు చేశామని మోదీ గుర్తు చేశారు. 

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించామని, తెలంగాణ నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేశామని అంటూ  గత ఆరేళ్లో లక్ష కోట్ల రూపాయల విలువచేసే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసిందని ప్రధాని వెల్లడించారు. రైతులకు అండగా నిలిచేందుకు మద్దతు ధర పెంచామని తెలిపారు. 

పల్లెలను నేషనల్ హైవేలతో కలుపుతూ 2700 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో రోడ్లు వేశామని అంటూ  తెలంగాణలో ఇప్పుడు 5000 కిలోమీటర్ల పొడవైన హైవే నెట్ వర్క్ వచ్చిందంటే కారణం.. కేంద్ర ప్రభుత్వమే అని మోదీ చెప్పారు. 

అంటూ రాష్ట్రంలో జాతీయ రహదారులకు భారీగా నిధులు కేటాయించామని, తెలంగాణలో కొత్త రైల్వే లైన్లను నిర్మించామని వివరించారు.  జన్ ధన్ ద్వారా  దేశవ్యాప్తంగా 45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిస్తే, అందులో కోటికిపైగా జన్ ధన్ అకౌంట్లు తెలంగాణవేనని ప్రధాని వెల్లడించారు. 

తమ పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రోత్సాహం ఇస్తున్నామని, మహిళా సాధికారత దిశగా ముందడుగు వేస్తున్నామని చెబుతూ దేశంలో ప్రతి వారికి కేంద్ర ప్రభుత్వ పధకాలు అందుతున్నాయని చెప్పారు.  బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తోందని అంటూ  సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకోవడంతో పాటు  దశాబ్దాలుగా అణచివేతకు గురైనవారిని భాగస్వామ్యుల్ని చేస్తున్నామని వివరించారు. 

తెలంగాణ ప్రజలు కష్టపడి పనిచేస్తారని చెబుతూ ‘‘రాష్ట్ర ప్రజలకు చాలా ప్రతిభ ఉంది. తెలంగాణ దాని చరిత్ర,  సంస్కృతికి కూడా ప్రసిద్ధి చెందింది, దాని కళ, వాస్తుశిల్పం మనందరికీ గర్వకారణం,” అని కొనియాడారు.

టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుగుపోయి ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. బీజేపీ విజయ సీఎం కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దుబ్బాక గెలుపుతో కేసీఆర్‌కు మతిపోయిందని ఎద్దేవా చేశారు. హుజుర్‌నగర్‌ గెలుపుతో కేసీఆర్ అయోమయంలో పడ్డారని అంటూ తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని జేపీ నడ్డా విమర్శించారు.