బ్రిటిషర్లకు వణుకు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి 

* 125వ జయంతి నివాళులు 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రేమాభి మానాలను చూరగొన్న విప్లవ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు. తన సహచరులైన గాం గంటయ్య దొర, గాం మల్లయ్య దొర, పడాలు, అగ్గిరాజు తదితరులతో కలిసి బ్రిటిష్‌ సామ్రాజ్యవాదంపై యుద్ధం చేశాడు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన గెరిల్లా పోరాటం చేసి, వారికి వణుకు పుట్టించిన రామరాజు 125వ జయంతి సంవత్సరం ఇది, 
 
 మన 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంవత్సరం సందర్భంగా జరుపుకొంటున్న ఆజాది కా అమ్రిత్ మహోత్సవాళ్లలో భాగంగా గుర్తింపుకు నోచుకోని అమరవీరుల జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అల్లూరి 125వ జయంతి ఉత్సవంను పెద్ద ఎత్తున జరుపుతున్నది.
సందర్భంగా కేంద్రం 75 ప్రదేశాలలో విశేష ఉత్సవాలు జరుపుతూ ఉండగా, మొదటిసారిగా భీమవరంలో మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొనే 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 
 
‘ప్రజలకు, ముఖ్యంగా యువతకు అల్లూరి సీతారామరాజు మహోన్నత జీవితం గురించి కేంద్ర ప్రభుత్వం బోధపరచాలని కోరుకుంటున్నది’ అని కేంద్ర పర్యాటక, సాంస్కతిక శాఖామంత్రి కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఏర్పాటు చేయడంతో పాటు అల్లూరి పుట్టిన, విద్యనభ్యసించిన స్థలాన్ని, ఆయన పోరాటం చేసిన ప్రాంతాన్ని అభివద్ధి చేస్తున్నారు. 
1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు అల్లూరి జన్మించారు. అమ్మమ్మ గారింట్లో జన్మించిన ఆయనకు తల్లి నాన్నగారైన శ్రీరామరాజు పేరు పెట్టారు. 11 ఏళ్ళ వయస్సులోనే 1906లో తండ్రి మరణించారు. 
 అల్లూరి విద్యాభ్యాసం చాలా ఊళ్లలో సాగింది.15 ఏళ్ల వయసులోనే ఆయనకు బ్రిటిష్‌ పాలకులపై ద్వేషభావం విపరీతంగా ఉండేది. 18వ ఏట రుషీకేష్‌, బద్రీనాథ్‌, గంగోత్రి, కాశీ, ప్రయాగ వంటి వివిధ ప్రాంతాలను సందర్శించారు.
 
కొంతకాలం తరువాత అల్లూరి కుటుంబం తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న బంధువుల ఊరికి వచ్చి స్థిరపడింది. అప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్‌ వారి ఆగడాల గురించి ఆయన తెలుసుకున్నారు. గిరిజనుల బాధలు విని చలించిపోయారు. పేరిచర్ల సూర్యనారాయణరాజుతో కలిసి తూర్పు కనుమల్లో పర్యటించారు. లంబసింగి ఘాట్‌ రోడ్డు నిర్మాణం పనులకు వెళ్లే గిరిజనులు పడుతున్న బాధలను తెలుసుకున్నారు. 
 
వారికి ఆరు అణాల కూలికి బదులుగా రెండు అణాలే ఇచ్చేవారు. అప్పటి తహసీల్దార్‌ బాస్టియన్‌పై బ్రిటిష్‌ ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. కానీ బ్రిటిష్‌ అధికారులు తిరిగి అల్లూరిపైనే కేసు పెట్టారు. ఆయన మన్యంలో ఉంటే ప్రమాదమని భావించిన బ్రిటీష్‌ పాలకులు నర్సీపట్నం తీసుకువెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఆ తరువాత అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టలో 50 ఎకరాల భూమి, కొన్ని పశువులను కేటాయించి, ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లో ఉంచారు. 
 
1922 జూన్‌లో పోలవరం డిప్యూటీ కలెక్టర్‌ ఫజులుల్లా ఖాన్‌ సహకారంతో తిరిగి మన్యానికి వచ్చారు. ఖాన్‌కు ఇచ్చిన మాటకు కట్టుబడి కొన్ని రోజులు విప్లవానికి దూరంగా ఉన్నారు. అయితే అదే ఏడాది జూలై 27న ఖాన్‌ హఠాన్మరణం చెందడంతో సీతారామరాజు సాయుధ పోరాటానికి సన్నద్ధమయ్యారు. 
 
సాయుధ పోరాటమే శరణ్యం 
 
1922 ఆగస్టు 15న కృష్ణాదేవిపేటకు అల్లూరి సీతారామరాజు చేరుకున్నారు. సమీపంలోని నడింపాలెం గ్రామానికి వెళ్లి గిరిజన పెద్దలు గాం గంటందొర, మల్లుదొరను కలిశారు. నాలుగు రోజుల తర్వాత మరోసారి అక్కడికి వెళ్లి మంప సమీపంలోని ఉర్లకొండపై ఉన్న గుహల్లో అనుయాయులతో రహస్య సమావేశాలు నిర్వహించారు. బ్రిటిషు వారిని తరిమికొట్టేందుకు సాయిధ పోరాటమే శరణ్యమని పిలుపునిచ్చారు.
 
 1922 ఆగస్టు 22న గంటం దొర, మల్లుదొర, ఎండుపడాల్‌, గోకిని ఎర్రే్‌సతోపాటు మరో 300 మంది గిరిజన విప్లవకారులతో కలిసి చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసులను తాళ్లతో బంధించి 11 తుపాకులు, 1390 తుపాకీ గుళ్లు, 14 బాయ్‌నెట్లు, ఐదు కత్తులు ఎత్తుకెళ్లారు. ఆ వివరాలను స్టేషన్‌ డైరీలో రాసి ఇంగ్లి్‌షలో సంతకం చేశారు. 
 
పోలీసు స్టేషన్‌ నుంచి బయటకొస్తుండగా ఇద్దరు పోలీసులు ఎదురయ్యారు. వారి వద్ద ఉన్న తుపాకులను లాక్కున్నారు. ఆ మరుసటిరోజు కృష్ణాదేవిపేట పోలీస్‌ స్టేషన్‌పై దాడిచేశారు. ఏడు తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలు విజయవంతం కావడంతో పోలీసు స్టేషన్‌లపై దాడుల పరంపరను కొనసాగించారు. 
 
ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడ బంధీగా ఉన్న రంప పితూరీదారుడు మొట్టడం వీరయ్యదొరను విడిపించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో మూడు పోలీసు స్టేషన్లపై దాడులు చేసి బ్రిటిష్‌ ప్రభుత్వానికి వణుకు పుట్టించింది.
 
పోలీస్‌ స్టేషన్లపై అల్లూరి సేన వరుసగా దాడులు చేయడంతో బ్రిటిష్‌ ప్రభుత్వంలో అలజడి చెలరేగింది. అల్లూరి విప్లవాన్ని అణిచి వేయడానికి సాయుధ బలగాలతో రంగంలోకి దిగింది. బ్రిటిష్‌ పోలీసు ఉన్నతాధికారులు నర్సీపట్నంలో మకాం పెట్టి వ్యూహరచన జరిపారు. బలగాలతో మన్యంలో ప్రవేశించి విప్లవకారుల కోసం నలువైపులా వేట ప్రారంభించారు. 
 
అల్లూరి విప్లవ సేనకు, బ్రిటిష్‌ బలగాలకు మధ్య దాడులు, ప్రతి దాడులతో విశాఖ ఏజెన్సీ అట్టుడికింది. 1922 సెప్టెంబరు 24న ఏజెన్సీలోని దామనాపల్లి ఘాట్‌లో బ్రిటిష్‌ సాయుధ బలగాలపై అల్లూరి సేన మెరుపుదాడి చేసింది. ప్రపంచ యుద్ధాల్లో ఆరితేరిన స్కాట్‌ కవర్ట్‌, హైటర్‌ అనే ఇద్దరు ఉన్నత స్థాయి పోలీసు అధికారులను కాల్చి చంపింది. అల్లూరి సీతారామరాజు సాహసాలకు సాక్షిగా వీరిద్దరి సమాధులు నేటికీ నర్సీపట్నంలో ఉన్నాయి. 
 
1922 అక్టోబరు 15న అడ్డతీగల పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేస్తామంటూ అల్లూరి సేన ఆంగ్లేయులకు మిరపకాయి టపా పంపింది. చెప్పినట్టుగానే అడ్డతీగల పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడ నుంచి రంపచోడవరం వెళ్లి 19వ తేదీన పోలీస్‌ స్టేషన్‌పై దాడులు నిర్వహించారు. అయితే బ్రిటిష్‌ వారు అప్రమత్తం కావడంతో ఈ రెండు పోలీస్‌ స్టేషన్లలో ఆయుధాలు లభించలేదు.  
 
1923 ఏప్రిల్‌ 17న ప్రధాన అనుచరుడు గాం మల్లుదొరతో కలిసి తూర్పుగోదావరి జిల్లా దేముడు అన్నవరం పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. అనంతరం దైవదర్శనం చేసుకున్నారు. బ్రిటిష్‌ సేనలకు కొరకరాని కొయ్యగా మారిన అల్లూరిని చంపేందుకు కలెక్టర్‌ రూథర్‌ఫర్డ్‌ రంగంలోకి దిగారు. అన్నవరంలో సీతారామరాజును చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలిరావడంతో రూథర్‌ఫర్డ్‌ సేనకు ఆయన్ను బంధించలేకపోయింది. 
 
దీంతో అల్లూరిని బంధించి ఇచ్చినా లేక ఆచూకీ తెలిపినా రూ.10 వేలు నజరానా ఇస్తామని ప్రకటించింది. 1924 మే 1 నుంచి 6వ తేదీ వరకు రాజవొమ్మంగి మండలం కొండపల్లి వద్ద బ్రిటిషు సేనలకు, అల్లూరి అనుచర గణానికి భీకర పోరాటం జరిగింది. అల్లూరిని గ్రామస్థులు అక్కడ నుంచి తప్పించారు. 
 
అక్కడ నుంచి మంప చేరుకున్న అల్లూరి మే 7వ తేదీన బ్రిటిషు సేనలు చుట్టుముట్టాయి. రాజేంద్రపాలెం తీసుకువచ్చి అక్కడ చింతచెట్టుకు కట్టి అల్లూరిని కాల్చి చంపారు. అనంతరం అల్లూరి భౌతికకాయాన్ని కృష్ణాదేవిపేటకు తీసుకువచ్చారు. ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించేందుకు జాప్యం చేశారు. 1924 మే 12న అధికారికంగా ప్రకటించారు.  అల్లూరి తన 27వ ఏటనే అస్తమించారు. 
 
1922 ఆగస్టులో ప్రారంభమైన మన్యం విప్లవం సీతారామరాజు, ఇతర మహావీరుల మరణంతో 1924 జూలై మొదటి వారంలో ముగిసింది. 1800 మందితో మన్యం ఉద్యమం సాగినట్టు చరిత్రకారులు వెల్లడించారు. వీరిలో 93 మంది ముఠాదారులు, 276 మంది అల్లూరి అభిమానులు ఉన్నారని, మిగిలినవారు పోరాట స్ఫూర్తితో అల్లూరి వెంట నడిచినట్టు చెబుతున్నారు.