ఆదివాసీల ధైర్యానికి, శౌర్యానిక అల్లూరి ప్రతీక

మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు ఆదివాసీల ధైర్యానిక, శౌర్యానిక ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ  కొనియాడారు. ఆయన గిరిజనుల సంస్కృతికి ప్రతిబింబమని, భిన్నత్వంలో ఏకత్వానికి ఆయన నిదర్శనమని తెలిపారు.  అల్లూరి 125 జయంతి వేడుకల సందర్బంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు కార్యక్రమంలో మోదీ  పాల్గొని 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అల్లూరి వారసులను సత్కరించారు.

అనంతరం ఆయన తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి “మన్యం వీరుడు, తెలుగు యుగపురుషుడు, తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా అంటూ స్వాతంత్య్ర సంగ్రామంలో యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం” అంటూ కొనియాడారు. 

జననం నుండి దేశం కోసం అల్లూరి సాగించిన జీవన యాత్ర స్ఫూర్తిదాయకమని, ఇక్కడ ఉన్న గిరిజనుల హక్కులు, వారి సుఖ దు:ఖాలను గుర్తించిన ఏకైక మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజునని ప్రధాని పేర్కొన్నారు. అల్లూరి నినాదమైన ‘మనదే రాజ్యం’ వందేమాతర నినాదానికి తీసుపోదని స్పష్టం చేశారు. 

మన్యం వీరుడిగా ఆంగ్లేయులపై పోరాడిన సమయంలో అతి పిన్న వయస్సు అని, అతి చిన్న వయస్సులోనే ప్రాణాలు విడిచారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. రంప ఆందోళనల్లో నేటికి 100 ఏళ్లు అని చెబుతూ ఆ ఆందోళనల్లో పాల్గని ప్రాణాలు కోల్పోయిన వారంతా స్ఫూర్తి ప్రదాతలని మోదీ చెలిపారు.

అదేవిధంగా నవ అధ్యాయంలో అడుగుపెట్టబోతున్న సమయంలో యువకులు దేశానికి సేవ చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు.  కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. దేశ అభివృద్ధిలో దోహదపడాలని యువకులకు ప్రధాని పిలుపునిచ్చారు.

 ఆంధ్ర రాష్ట్ర ఎంతో మంది మహనీయులకు పురుడు గడ్డని పేర్కొంటూ పింగళి వెంకయ్య జాతీయ జెండా తయారు చేశారని, కందుకూరి వీరేశలింగం, పొట్టి శ్రీరాములు, కన్నెగంటి హనుమంతరావు .. ఇక్కడే జన్మించారని గుర్తు చేశారు. ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ అమృతోత్సవ్‌లో భాగంగా ఎవరైతే దేశం కోసం బలిదానం చేశారో వారిని స్మరించుకోవాలనిసూచించారు. 

స్వతంత్ర సంగ్రామంలో ఆదివాసీల బలిదానం ఎవరూ గుర్తించలేదని చెబుతూ ఈ త్యాగాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలని మోదీ కోరారు.  లంబసింగిలో అల్లూరి మొమొరియల్‌, ఆదివాసీల సంస్కృతి సంబంధించి మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. ఇక్కడ అటవీ సంపదన గిరిజనులకే దక్కాలని తాము పలు చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ‘ లోకల్‌ ఫర్‌ ఓకల్‌’ నినాదంతో అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెబుతూ  మొగల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పోలీస్ స్టేషన్ ను అభివృద్ధి చేస్తామని ప్రధాని తెలిపారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో భాగంగా మన్యం జిల్లాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. విశాఖలో ట్రైబల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్కిల్ ఇండియా స్కీమ్ ద్వారా ఆదివాసీలకు శిక్షణ అందిస్తామని ప్రధాని తెలిపారు.

అల్లూరి ఒక మహా అగ్ని కణం.. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచరణ్, మంత్రి రోజా, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు