ప్రధాని పర్యటనలో బ్లాక్ బెలూన్లు… ఎస్పీజీ సీరియస్

ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో పోలీసుల భద్రత లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. గన్నవరం నుంచి భీమవరంకు హెలికాప్టర్‌లో బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే విమానాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసరపల్లి గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డజన్ల కొద్ది నల్ల బెలూన్లు వదిలి నిరసన తెలిపారు. 

ఈ బెలూన్లు హెలికాప్టర్‌ కు దూరంగా గాల్లో ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఒకవేళ హెలికాప్టర్‌ కు తగిలితే ఎలా..? ఏమైనా ప్రమాదం జరిగి ఉంటె..? మోదీ పర్యటిస్తున్న సమయంలో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన భద్రత పోలీసులు ఏమైపోయారు..? వారి భద్రత ఏది..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ప్రధాని పర్యటనలో బ్లాక్ బెలూన్లు ఎగరడంపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సీరియస్ అయ్యింది. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని ఎస్పీజీ అంటోంది. బెలూన్ల తరహాలోనే డ్రోన్లను ఎగరేస్తే పరిస్థితేంటని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్పీజీ నివేదిక కోరినట్లు సమాచారం.

 ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ అధికారుల నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని పోలీస్‌ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. భవనంపైకి ఏ విధంగా వెళ్లారన్నదానిపై  స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. బెలూన్‌లను ఎగరవేసిన సంఘట స్థలానికి వెళ్లి  పోలీసులు విచారణ ప్రారంభించారు. 

 రాష్ట్రంలో ప్రధాని పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్‌, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. విమానాశ్రయానికి సమీపంలోనే ఇలాంటి ఘటన జరుగడం పట్ల రాష్ట్ర పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణను ప్రారంభించారు.

గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ బిల్డింగ్ మీద నుంచి కాంగ్రెస్ నేతలు బెలూన్లు వదిలారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో కొందరు యువకులు నల్ల బెలూన్లు వదిలారు. సోమవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ, ఎమ్మార్పీఎస్ నేతలు ఎయిర్ పోర్టు సమీపంలో నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 

కాగా ప్రధాని మోదీ పర్యటనలో కాంగ్రెస్‌ నిరసనలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. హెలికాప్టర్ సమీపంలో బెలూన్లు ఎగురవేయడం వెనక కుట్ర ఉందని, ప్రధాని మోదీపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ఘనటపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

 విమానాశ్రయానికి  నాలుగు కిలోమీటర్ల దూరంలో కాంగ్రెస్  శ్రేణులు మూడు బెలూన్లను ఎగురవేశారని గన్నవరం డీఎస్పీ విజయపాల్  తెలిపారు. మూడు బెలూన్లు ఎగురవేస్తే భద్రతా లోపం అంటారా? అని ప్రశ్నించారు. ఎక్కడో విజయవాడలో బెలూన్లు ఎగురవేశారని చెబుతూ  కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేశామనిఎం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ కోసం వెతుకుతున్నామని డీఎస్పీ విజయపాల్ వివరించారు.