రైళ్లలో ఇటీవల తరచుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అన్ని కుట్రపూరిత విద్రోహ చర్యల కారణంగానే జరుగుతున్నాయని రైల్వే శాఖ బుధవారం ఆరోపించిందిపలు ఘటనల్లో అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందని దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. “రైల్వే ప్రయాణికులు అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని మేం కోరుతున్నాం. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాన్ని గమనిస్తే, వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ 139కు కాల్ చేసి సమాచారాన్ని అందించండి” అని పిలుపునిచ్చింది.
మే 19న మధ్యాహ్నం దాదాపు 3.45 గంటలకు బెంగాల్‌లోని హౌరా స్టేషన్లో ఆగి ఉన్న మిథిలా ఎక్స్‌ప్రెస్‌లోని ఒక బోగీలో మంటలు చెలరేగిన విషయాన్ని రైల్వేశాఖ గుర్తుచేసింది. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), ఫోరెన్సిక్ టీమ్స్ తనిఖీలు చేపట్టగా, ఆ బోగీలోని టాయిలెట్లో పెట్రోలుతో తడిపిన సగం కాలిన గుడ్డ ముక్క లభించిందని తెలిపింది. మొత్తం రైల్వే సిబ్బంది చురుగ్గా స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి పెద్ద ప్రమాదాన్ని నివారించారని రైల్వేశాఖ పేర్కొంది.
కొంతమంది అసాంఘిక శక్తులు ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించడానికి, రైల్వే వ్యవస్థలో భయాందోళనలు, గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రాథమిక పరిస్థితులు సూచిస్తున్నాయని రైల్వేశాఖ వెల్లడించింది. ఆర్పీఎఫ్, సంబంధిత దర్యాప్తు సంస్థలు ఈ విషయాలన్నింటిపై లోతైన దర్యాప్తు చేస్తున్నాయని తెలిపింది.
గత వారం రోజుల వ్యవధిలో రాజస్థాన్‌లోని అమరపుర స్టేషన్ సమీపంలో, మధ్యప్రదేశ్ పరిధిలోని కోట రైల్వే డివిజన్లో, బిహార్‌లోని ససారం రైల్వే స్టేషన్లో, బంగాల్లోని హౌరా స్టేషన్లో రైళ్లలో జరిగిన నాలుగు అగ్నిప్రమాద ఘటనలను తాజా ప్రకటనలో రైల్వేశాఖ ప్రస్తావించింది. ఈ సంఘటనలను తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, ప్రతి ఘటనలోనూ ఆర్పీఎఫ్ లోతైన దర్యాప్తును నిర్వహిస్తోందని తెలిపింది.
రాజస్థాన్‌లోని అమరపుర స్టేషన్ సమీపంలో రైలుబోగీలోని పరుపు, సామగ్రికి నిప్పు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయని పేర్కొంది. బంగాల్లోని హౌరా స్టేషనులో అగ్నిప్రమాదానికి గురైన రైలు బోగీలోని టాయిలెట్ నుంచి పెట్రోలులో తడిపిన వస్త్రాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పింది. మధ్యప్రదేశ్‌లోని కోట రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న రత్లాంలో జరిగిన మరొక ఘటనలో రాజధాని ఎక్స్‌ప్రెస్ వాష్‌రూమ్ ఏరియా నుంచి మంటలు వచ్చినట్లు గుర్తించామని రైల్వేశాఖ తెలియజేసింది.
బిహార్‌లోని ససారంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైల్వే బోగీలోకి మండుతున్న వస్తువును విసిరినట్లు సమాచారం వచ్చిందని పేర్కొంది. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా అనేది కోట రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది. మే 17న ఉదయం 5.15 గంటలకు ఈ జిల్లాలోని విక్రమ్‌గఢ్ ఆలోట్, లూని రిచా రైల్వే స్టేషన్ల మధ్య తిరువనంతపురం- హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కలకలం రేగింది. ఈ రైలులోని ఒక ఏసీ కోచ్(బి-1)లో ఉన్న బాత్రూమ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
బాత్రూమ్ నుంచి మంటలు, దట్టమైన పొగలు బయటకు రావడాన్ని రైలు గార్డ్ గమనించారు. ఈ మంటలు ఆ తర్వాత వేగంగా పక్కనే ఉన్న లగేజీ కమ్ గార్డ్ వ్యాన్ దాకా వ్యాపించాయి. మధ్యప్రదేశ్‌లో ఈ ప్రమాదం జరిగిన రెండు రోజులకే (మే 19న) బంగాల్లోని హౌరా స్టేషన్లోనూ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజుల వ్యవధిలో జరిగిన నాలుగు రైలు ప్రమాద కారణాల వివరాలతో రైల్వేశాఖ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

More Stories
భారత్- ఇటలీ మధ్య `ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’
ఇరాన్ లో వైఫల్యంతో ప్రశ్నార్ధకంగా చైనా ఆయుధ సామర్థ్యం
బ్రిక్స్ సదస్సు కోసం పుతిన్, జిన్‌పింగ్ భారత్ పర్యటన!