ప్రధాని సహా దిగ్గజాల సమక్షంలో పేరిణి శివతాండవం

కరీంనగర్ జిల్లాకు చెందిన పేరిణి నృత్య కళాకారుడు, కళారత్న, మాస్టార్ జరుకుల రతన్ కుమార్ కు అరుదైన అవకాశం లభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతోపాటు అతిరథుల సమక్షంలో పేరిణి శివతాండవం చేశారు. 
 
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం హెచ్ఐసీసీ లో జరిగిన కార్యక్రమంలో రతన్ కుమార్ పేరిణి శివతాండవం పేరుతో అద్బుతమైన ప్రదర్శన ఇచ్చారు.  తెలంగాణకు మాత్రమే సొంతమైన ఈ పేరిణి శివతాండవం కాకతీయ రాజుల కళా స్రుష్టికి నిదర్శనం. నాడు కాకతీయులు యుద్దానికి వెళ్లే సైనికులను ప్రేరేపించడం కోసం నాటి కాకతీయ నాట్యాచార్యులు జయప సేనాని ఈ యుద్ద కళను స్రుష్టించారు. అంతరించి పోతున్న ఈ కళను నటరాజ రామక్రిష్ణ పున: ప్రతిష్ట చేశారు.
 
 ఆయన వద్ద శిష్యరికం చేసిన రతన్ కుమార్ అద్బుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. రతన్ కుమార్ శివతాండవం పూర్తయిన వెంటనే ప్రధాని మోదీసహా అక్కడున్న వాళ్లంతా చప్పట్లతో అభినందనలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా మాస్టార్ రతన్ కుమార్ మాట్లాడుతూ ప్రధానిసహా దిగ్గజాల సమక్షంలో పేరిణి శివతాండవం చేయడం తనకు మర్చిపోలేని అనుభూతిగా మిగిలిందని చెప్పారు.  బంజారా సామాజికవర్గానికి చెందిన రతన్ కుమార్ గతంలోనూ పలువురు ప్రముఖుల వద్ద పేరిణి న్రుత్య రూపకాన్ని ప్రదర్శించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో 101 ఆలయాల్లో న్రుత్య యజ్ఝం చేశారు. అమెరికాసహా అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.
బీజేపీ దిగ్గజాలకు నేడు యాదమ్మ చేతి వంటకాలు

 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు బీజేపీ దిగ్గజాలు ఈరోజు తెలంగాణ వంటకాల రుచి చూడబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి గుడాటిపల్లెకి చెందిన యాదమ్మ చేతితో చేసిన వంటకాలను ఆయా ప్రముఖులంతా టేస్ట్ చేయబోతున్నారు.
 
భోజనంతో పాటు స్నాక్స్ సైతం తెలంగాణ స్టైల్ లోనే తయారు చేస్తున్నారు. స్వీట్స్ సైతం తెలంగాణ తినుబండారాలనే వడ్డిస్తుండటం విశేషం. దాదాపు 50 రకాల వంటకాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు రోజైన ఆదివారం మధ్యాహ్నం అతిరథ మహారథుల కోసం సిద్ధం చేస్తున్నారు. అవన్నీ స్వయంగా యాదమ్మ చేతితోనే చేస్తుండటం గమనార్హం.
 
ఇక కూరల విషయానికొస్తే చిక్కుడుకాయ, టమోటా, ఆలు కూర్మ, వంకాయ మసాల, దొండకాయ పచ్చికొబ్బరి తురుము ఫ్రై, బెండకాయ కాజు పల్లీల ఫ్రై, తోటకూర టమోటా ఫ్రై, బీరకాయ మిల్ మేకర్ చూర ఫ్రై, మెంతికూర పెసరపప్పు ఫ్రై, గంగవాయిలకూర మామిడికాయ పప్పు, సాంబారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, బగార, పులిహోర, పుదీన రైస్, వైట్ రైస్, పెరుగన్నం, గోంగూరు పచ్చిడి, దోసకాయ ఆవ చట్నీ, టమోటా చట్నీ, సొరకాయ చట్నీ చేస్తున్నారు.
 స్వీట్స్ విషయానికొస్తే బెల్లం పరమాన్నం, సేమియా పాయసం, భక్షాలు, బూరెలు, అరిసెలు సిద్ధం చేస్తున్నారు. పెసరపప్పు గారెలు, సకినాలు, మక్క గుడాలు, సర్వపిండి, టమోటా చట్నీ, పల్లీ చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ, మిర్చి వంటి పిండి వంటలు చేస్తున్నారు.