ప్రజల కోరుకున్న తెలంగాణ కోసం మరో పోరాటం

నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని పేర్కొంటూ ప్రజల కోరుకున్న తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు పిలుపిచ్చాయి. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారని స్పష్టం చేస్తూ  తెలంగాణపై ప్రత్యేక డిక్లరేషన్‌ను ఈ సందర్భంగా బీజేపీ విడుదల చేసింది.

తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఇప్పుడు ఆ దిశగానే  పవనాలు వీస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల  ఫలితాలే అందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు

తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని పేర్కొంటూ. దేశంలో నెం1గా ఎదిగే సామర్థ్యం తెలంగాణకు ఉందని ఆయన చెప్పారు. దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో తెలంగాణ ఉందని తెలుపుతూ  తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎందరో త్యాగాలు చేశారని, అయితే  రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కష్టాలు పెరిగాయని  టీఆర్‌ఎస్‌  అవినీతి పాలన కొనసాగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రూ.40వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా రూ.1.30 లక్షల కోట్లకు పెంచిందని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో ఇంత భారీ స్థాయికి జల ప్రాజెక్టు వ్యయాన్ని పెంచడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్టులను కూడా కేసీఆర్ సర్కారు విస్మరించిందని విమర్శించారు.

గత 8 ఏళ్లలో కేంద్రం  ఇచ్చిన నిధులనూ దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు దక్కుతాయనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను  టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేర్చడంపై కేసీఆర్ దృష్టిపెట్టలేదని విమర్శించారు. వీటన్నింటిని చూస్తుంటే.. ఒక్క కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్లు కనిపిస్తోందని గోయల్ ఎద్దేవా చేశారు. 

టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో

టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో వుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎంఐఎం చెప్పిందే సీఎం కేసీఆర్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని అంటూ ప్రగతిభవన్‌లోకి మంత్రులకు సైతం ప్రవేశం లేదని తెలిపారు. కానీ ఎంఐఎం నేతలు మాత్రం సీఎం దగ్గరకు నేరుగా వెళ్తారని చెప్పారు. కేసీఆర్ నెలలో 20 రోజులు ఫాం హౌస్‌లోనే ఉంటారని,  ఇక పాలన ఎలా చేస్తారని ప్రశ్నించారు. 

ఐదేళ్లు కేబినెట్‌లో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. బిజెపి పై అక్కసుతోనే బీజేపీ ఫ్లెక్సీలను కావాలని తొలగించారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. బీజేపీ ఫ్లెక్సీలకు భారీగా జరిమానాలు వేశారని, టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై నామమాత్రపు ఫైన్లు వేశారని చెప్పారు. ఇంత చౌకబారు రాజకీయాలు తాము ఎన్నడూ చూడలేదని కిషన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ఓవైసీ, కేసీఆర్ ఇద్దరూ తెలంగాణను దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు.

తెలంగాణలో అద్భుతమైన మార్పు రాబోతుందని, రాష్ట్రంలో బీజేపీ ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం, మోదీపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అంటూ  తాము కేసీఆర్ కుటుంబానికి జవాబుదారీ కాదని ఎద్దేవా చేశారు. 

తెలంగాణ ప్రజలను టీఆర్ఎస్ మోసం చేస్తోందని జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. నీళ్ల పేరుతో తెలంగాణను దోపిడీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ సమావేశాలతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, బీజేపీ బలపడడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. 

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీగా బీజేపీని నమ్ముతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు.  ప్రజలకు మరింత నమ్మకం కలిగిస్తే బీజేపీని ఆదరిస్తారని భరోసా వ్యక్తం చేశారు. 

బీజేపీ మద్దతు వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అయ్యారు. ఎన్నికల హామీలను అమలు చేయటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటాలు మరింత ఉధృతం చేయాలని నిర్ణయించామని చెబుతూ ప్రజాస్వామ్య తెలంగాణ కోసం బీజేపీ కృషి చేస్తోందని, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.