‘ఈ తాలిబాన్ ఘటన’ ప్రతిచర్య కాదు, విశ్వాస వ్యవస్థ ఫలితం: ఆర్‌ఎస్‌ఎస్

సస్పెండ్ అయిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ “దేశంలో జరుగుతున్న వాటికి ఆమె ఒక్కరే బాధ్యత వహించాలని” సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించిన రోజుననే, “ఈ తాలిబాన్ సంఘటన” (ఉదయపూర్ సంఘటన) రెచ్చగొట్టడానికి ప్రతిస్పందన కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  (ఆర్‌ఎస్‌ఎస్) స్పష్టం చేసింది. ఇది ఓ మనస్తత్వం, విశ్వాస  వ్యవస్థ ఫలితం అని తేల్చి చెప్పింది.

“మీరు చూడండి, ఈ తాలిబాన్ సంఘటన ప్రతిచర్య కాదు. ఇది కొన్ని రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందన కాదు. ఇటువంటి సంఘటనలు ఎటువంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఎక్కడో హమాస్, ఇస్లామిక్ స్టేట్, తాలిబాన్ ఉన్నాయి… మన దేశంలో సిమి, పిఎఫ్ఐ ఉన్నాయి. ఇది రెచ్చగొట్టడం వల్ల వచ్చినది కాదు. అలా నమ్మే ఎవరైనా మరింత అధ్యయనం చేయాలి. ఈ తాలిబాన్ సంఘటన వెనుక ఉన్న మనస్తత్వం, విశ్వాస  వ్యవస్థను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం’ అని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.

సోషల్ మీడియాలో మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారనే ఆరోపణతో ఉదయపూర్‌లో ఇద్దరు ముస్లిం వ్యక్తులు హిందూ టైలర్‌ను జూన్ 28న నరికి చంపిన ఘటనపై అంబేకర్ ప్రస్తావించినట్లు ఆయన ప్రసంగం వెల్లడి చేస్తుంది. 


“భారతదేశం గురించి మన అవగాహన ఇతరులకు సహాయం చేయడానికి మన శక్తిని ఉపయోగించడం. అయితే, ఒక మంచి వ్యక్తి మరొక మంచి వ్యక్తికి సహాయం చేయడానికి, శాంతికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్న వారిని ఆపడానికి కూడా తగినంత బలంగా ఉండాలి. …సమస్యలను ఎదుర్కోవడానికి రాజ్యాంగపరమైన మార్గాలు ఉన్నాయి. ఎవరికైనా సమస్య ఉంటే రాజ్యాంగబద్ధమైన మార్గాలను ఉపయోగించాలి” అని అంబేకర్ సూచించారు.

“ది తాలిబాన్: వార్ అండ్ రిలిజియన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్”, “ది ఫర్గాటెన్ హిస్టరీ ఆఫ్ ఇండియా” అని అరుణ్ ఆనంద్ వ్రాసిన  అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించేందుకు ప్రభాత్ ప్రకాశన్ నిర్వహించిన కార్యక్రమంలో అంబేకర్ మాట్లాడారు.

తాలిబాన్లు మన పొరుగునే ఉన్నందున వారి తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. “మత ఛాందసవాదం పేరుతో విభజనను ఎదుర్కొన్న దేశం దానిని విస్మరించలేదు. అక్కడి నుంచి ఏవైనా ప్రమాదాలు భారత్‌కు వ్యాపిస్తున్నాయా లేదా అలాంటి అంశాలు దేశంలోకి ప్రవేశిస్తున్నాయా అనేది నిర్ధారించుకోవడం ముఖ్యం. దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు వాటితో ముడిపడి ఉన్నాయా? రాజకీయ లేదా స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి ఛాందసవాద భావజాలాన్ని సమర్థించే అంశాలు వాటితో ముడిపడి ఉన్నాయా? రాజద్రోహం అంటే ఏమిటి? ఇది నిర్ధారించబడాలి, ”అని అంబేకర్ తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడారని, అయితే వారందరి గురించి మాట్లాడటం లేదని చెప్పారు. “మనకు ఐఎన్ఎ గురించి చెప్పలేదు. స్వాతంత్య్రానంతరం ఏం జరిగినా ఆర్ఎస్ఎస్ వహించిన పాత్ర గురించి పూర్తిగా విస్మరిస్తున్నారు. జూలై 12, 1922 న, డాక్టర్ హెడ్గేవార్ ఒక సంవత్సరం తర్వాత జైలు నుండి విడుదలయ్యారు. ఆయనకు స్వాగతం పలికేందుకు నాగ్‌పూర్‌లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మోతీలాల్ నహ్రూ, సి రాజగోపాలాచారి వచ్చి కార్యక్రమంలో ప్రసంగించారు. దేశం ముందు ఈ సమాచారాన్ని తెలియచేయాలి” అని ఆయన పేర్కొన్నారు.

వి డి సావర్కర్, నేతాజీ సుభాష్ బోస్, గిరిజన నాయకుడు బిర్సా ముండా, అండమాన్- నికోబార్‌లో జైలు శిక్ష అనుభవించిన మణిపూర్ రాజు గురించి ప్రజలు తప్పక తెలుసుకోవాలని అంబేకర్ స్పష్టం చేశారు.
“1947కి ముందు కూడా భారతదేశం ఒక్కటేనని, మనల్ని ఒక దేశంగా ఏర్పాటు చేసింది బ్రిటిష్ వారు కాదని అప్పుడే ప్రజలు గ్రహిస్తారు. అందుకే చరిత్ర పుటలను పునరాలోచించడం ముఖ్యం. సోషలిజం, సెక్యులరిజం రాజ్యాంగంలోకి ఎలా ప్రవేశించాయి? కొత్త తరానికి దీనిపై అవగాహన కల్పించాలి’’ అని ఆయన సూచించారు.

విభజన ఎందుకు జరిగిందో కొత్త తరానికి తెలియాలని ఆయన స్పష్టం చేశారు. “కొంతమంది దీనిని చర్చించకూడదని కోరుకుంటున్నారు. ఇది మళ్లీ జరగకుండా చూసుకోవడం కోసం చర్చించడం ముఖ్యం. మన దేశంపై మళ్లీ దాడి జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం లేదా వేర్పాటువాదం, ఉగ్రవాదం గురించి మాట్లాడే అలాంటి శక్తులు తిరిగి పుంజుకోకుండా చూసుకోవాలి,” అని ఆయన హెచ్చరించారు.