నుపుర్ శర్మపై `సుప్రీం’ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం!

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నుపుర్  శ‌ర్మ దేశ ప్ర‌జ‌లకు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని  సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెపై సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన ప్రతికూల వ్యాఖ్యలను ఉపసంహరించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సమక్షంలో ఓ పిటీషన్ దాఖలైంది. 
 
ఆమె ఓ టీవీ చర్చా కార్యక్రమంలోమ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై  చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తంకావడంతోపాటు ఆమెపై పలు చోట్ల కేసులు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ కేసులన్నిటినీ ఒకే చోట విచారించేలా ఆదేశించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఆమెకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ, దానిని తోసిపుచ్చింది. 
 
దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు ఆమె ఒక్క‌రే వ్య‌క్తిగ‌తంగా బాధ్యురాల‌ని, యావ‌త్ దేశానికి ఆమె క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొనడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  ఆమె చేసిన వ్యాఖ్యలను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలా ధర్మాసనం తీవ్రంగా విరుచుకుపడింది.
ఆమె యథేచ్ఛగా మాట్లాడటం వల్ల యావత్తు దేశం అగ్ని జ్వాలల్లో చిక్కుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో జరుగుతున్నదానికి ఆమె మాత్రమే బాధ్యురాలని మండిపడింది. చౌకబారు ప్రచారం కోసం లేదా రాజకీయ ఎజెండాతో లేదా ఏదో క్రూరమైన కార్యకలాపాల కోసం ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఉందని పేర్కొంది. ఆమె యావత్తు దేశానికి క్షమాపణ చెప్పాలని పేర్కొంది.
 
ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన అజయ్ గౌతమ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ సమక్షంలో ఓ లెటర్ పిటిషన్ దాఖలు చేశారు. నూపుర్ శర్మ పిటిషన్‌పై న్యాయమైన, నిష్పాక్షికమైన విచారణ జరగడం కోసం, ఆమెపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ధర్మాసనానికి తగిన ఆదేశాలను జారీ చేయాలని అందులో కోరారు. 
 
ఈ పిటిషన్‌ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని ఆయన కోరారు. నూపుర్ శర్మపై చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయమైనవని ప్రకటించాలని కోరారు. ఆమెపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులన్నిటినీ ఢిల్లీకి బదిలీ చేయాలని ఆదేశించాలని కూడా విజ్ఞప్తి చేశారు.