కాంగ్రెస్ నుంచి గత ఏడాది నిష్క్రమించి, సొంత కుంపటి పెట్టుకున్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ (80) బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఓ శస్త్రచికిత్స కోసం లండన్లో ఉన్న ఆయన వచ్చే వారం భారత్ కు తిరిగి రానున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఆయన తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నట్లు చెబుతున్నారు.
సర్జరీ అనంతరం కోలుకుంటున్న అమరీందర్ కు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ దాదాపు ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. మూడు పర్యాయాలు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే గత ఏడాది ఎన్నికల ముందు ఆ పదవి నుండి పార్టీ అధిష్ఠానం తప్పించడంతో ఆయన ఆ తర్వాత పార్టీని విడిచి, సొంత పార్టీ పెట్టుకున్నారు.
ఆయన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికలలో బిజెపితో కలసి, ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసింది. అయితే ఆయన తనకు బలమైన సొంత నియోజకవర్గం పాటియాలా నుండి ఓటమి చెందడమే కాకుండా, ఆయన పార్టీ అభ్యర్థులు అందరు ఓటమి చెందారు. బిజెపి సహితం కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
పంజాబ్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జక్కర్ తో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే బీజేపీలో చేరారు. అయితే అమరిందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ ఇప్పటికీకాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు.
More Stories
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా
వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో స్మృతి మంధాన