2024 ఎన్నికల ముందు బిజెపి హర్ ఘర్ తిరంగా యాత్ర!

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, పార్టీ ప్రభుత్వాలు ప్రారంభించిన సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు బిజెపి తన ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తుంది.  తన జాతీయవాద విధానాలకుకు ఊతమిచ్చేలా తిరంగా యాత్రను ప్రారంభించింది.

హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో 30 కోట్ల మంది లబ్ధిదారులకు- సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చేరువయ్యేందుకు మరిన్ని మార్గాలను అన్వేషించాలని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇవే ఆధారంగా భావిస్తున్నది. 2019 ఎన్నికలలో, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 22 కోట్ల మంది లబ్ధిదారుల కుటుంబాలు తమకు ప్రధానమైన ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించింది .

బీజేపీ ఉపాధ్యక్షురాలు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే శనివారం మీడియాతో మాట్లాడుతూ లాభర్తీలను ఒకే గ్రూపుగా తీసుకోకుండా, ప్రతి సంక్షేమ పథకానికి, జిల్లా వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి పార్టీ వ్యూహాలపై ఈ సమావేశాలలో చర్చిస్తామని తెలిపారు. 

“వారు స్థిరంగా ఉండాలని మేము కోరుకోము… మేము వారిని ఏ స్థాయిలకు తీసుకెళ్లగలమో చూస్తాము,” అంటూ ఆమె ఆఫీస్ బేరర్ల సమావేశం తర్వాత చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ దృష్టి పెట్టనున్న మరో ప్రచారం తిరంగ యాత్ర. వచ్చే లోక్‌సభ ఎన్నికలలోపు హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని బీజేపీ 20 కోట్ల మంది ప్రజలకు చేరుస్తుందని రాజే చెప్పారు.

సమావేశంలో జరిగిన చర్చల గురించి మీడియాకు వివరించిన రాజే, బలోపేతం చేసే బూత్‌లు బీజేపీ ప్రధాన దృష్టిగా ఉంటాయని, సంస్థను బలోపేతం చేసే కార్యక్రమాలను మరింత మంది ప్రజలకు చేరువ చేసేందుకు మార్పులు చేయవచ్చని పేర్కొన్నారు. “బూత్‌లతో కనెక్ట్ అవ్వండి, బూత్-స్థాయి కార్యకర్తలు చాలా ముఖ్యం” అనే సందేశం పార్టీ శ్రేణులకు ఇవ్వనున్నట్లు ఆమె వివరించారు.

ప్రతి బూత్‌లో కనీసం 200 మంది క్రియాశీల పార్టీ కార్యకర్తలు ఉంటారు. వారు వాట్సాప్ గ్రూపులు సృష్టిస్తారు. పన్నా ప్రముఖులు- ఓటర్ల జాబితాల ప్రతి పేజీకి ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ ఎన్నికల యంత్రాంగంలో పార్టీకి పునాదిగా కొనసాగుతారు.  ప్రతి 15 రోజులకు ఒకసారి వారి కార్యకలాపాలపై సమీక్ష సమావేశం ఉంటుంది.

ఉదయ్‌పూర్ హత్యానంతరం దేశంలోని రాజకీయ పరిణామాలను ఈ సమావేశాలలో చర్చిస్తారా అనే ప్రశ్నలకు రాజే, “రాజకీయ తీర్మానం వచ్చినప్పుడల్లా, దేశంలోని ప్రతి ముఖ్యమైన అంశంపై పార్టీ చర్చిస్తుంది. సమావేశంలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు” అని స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభంలో, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా నరేంద్ర మోదీ  ప్రభుత్వ పేదల అనుకూల విధానాలను ప్రశంసించారని, అవే పార్టీ ఇటీవలి ఎన్నికల విజయాలకు కారణమని చెప్పారని వసుంధర రాజే తెలిపారు.

కాగా, కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం హాజరయింది. బీజేపీ ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు  సమావేశాలకు హాజరయ్యారు. మొత్తం 348 మంది ప్రతినిధులు హాజరయ్యారు.  మోదీ, జేపీ నడ్డా, పియూష్ గోయల్ మాత్రమే వేదికను అలంకరించారు. మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు వందేమాతరం గీతంతో సమావేశాలను ప్రారంభించారు. వేదికపై శ్యామ ప్రసాద్ ముఖర్జీ, భరతమాత, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ల ఫొటోలను ఏర్పాటు చేశారు.