యశ్వంత్ సిన్హా పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా శనివారం జరిపిన హైదరాబాద్ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ ను ఇరకాటంలో పడవేసింది. అంతర్గత కలహాలు మరోమారు బహిర్గతమయ్యాయి. 
 
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించిన ఆయన అభ్యర్థిత్వాన్ని మొదటగా ఆమోదించిన పార్టీలలో కాంగ్రెస్ ముఖ్యమైనది. కాంగ్రెస్ సూచన మేరకే ఆయన టిఎంసి సభ్యత్వానికి రాజీనామా చేశారు.  అయితే ఆయనకు మద్దతు ఇచ్చే విషయమై తమ వైఖరిని టిఆర్ఎస్ చివరివరకు స్పష్టం చేయలేదు. నామినేషన్ కు ముందు రోజు సాయంత్రమే మద్దతు ఇస్తున్నట్లు  ప్రకటించి, నామినేషన్ కార్యక్రమాలమో కేటీఆర్ పాల్గొన్నారు.
 
మొదటి నుండి  టిఆర్ఎస్ – కాంగ్రెస్ ఒకటే అని, వచ్చే ఎన్నికలలో కలసి పోటీ చేయబోతున్నారని అంటూ చెబుతున్న బిజెపి నేతలకు రాహుల్ గాంధీతో కలసి కేటీఆర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో మరో రాష్ట్రం చేతికి ఇచ్చినట్లయింది. దానితో ఆత్మరక్షణలో పడిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చారు. 
 
 టిఆర్ఎస్ ఆహ్వానంపై, ఆ పార్టీ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న దృష్ట్యా పార్టీ నేతలు ఎవ్వరు సిన్హా కార్యక్రమాలలో పాల్గొనరాదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, విమానాశ్రయంలో కేసీఆర్, ఇతర  టిఆర్ఎస్ నాయకులతో కలసి మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
 
దీంతో వీహెచ్‌ వ్యవహారంపై రేవంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. పార్టీ నిర్ణయం కాదని వ్యక్తిగతంగా మాట్లాడితే గోడకేసి కొడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పిల్లలాట కాదని, పార్టీ వ్యవహారమని అంటూ  కేసీఆర్‌ ఇంటికి వచ్చిన వాళ్లను మనం వెళ్లి ఎందుకు కలవాలని ప్రశ్నించారు. మన ఇంటికి వచ్చినప్పుడు మనం కలవాలని సూచించారు.
 
రేవంత్ వాఖ్యలఫై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడినెట్  జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.   సిన్హాకు కాంగ్రెస్‌ అధిష్టానం మద్దతు తెలిపిందని, రాహుల్‌కు లేని అభ్యంతరం పీసీసీ చీఫ్‌కు ఎందుకని ప్రశ్నించారు. సిన్హా నామినేషన్‌ రోజు రాహుల్‌ పక్కన కేటీఆర్‌ కూడా ఉన్నారని గుర్తు చేస్తూ “రేవంత్‌కు మేం నౌకర్లమా?” అని ప్రశ్నించారు. 
 
అంత కోపం ఉన్న వ్యక్తి పీసీసీకి ఏం పనికొస్తాడని ప్రశ్నించారు. బండకేసి కొట్టడానికి నువ్వు ఎవరూ? ఎవర్ని బండకేసి కొడతాడో చెప్పాలి? అంటూ నిలదీశారు.  పిసిసి చీఫ్ పదవి నుంచి రేవంత్ ను తొలగించాల్సిందిగా హైకమాండ్‌కు లేఖ రాస్తానని ప్రకటించారు.  రేవంత్ రెడ్డి లేకపోయినా పార్టీని నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
 వీహెచ్ వయసు ఎక్కడ..? నీ వయసు ఎక్కడ అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పైగా, సిన్హా పర్యటనకు దూరంగా ఉండడం పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.  యశ్వంత్ సిన్హాను సిఎల్‌పికి ఆహ్వానించాల్సి ఉండాల్సిందనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క అధిష్టానంతో మాట్లాడాల్సి ఉందని, కానీ  భట్టి ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.