హైదరాబాద్​లో పవన్ ​కళ్యాణ్​ సభకు అనుమతి నిరాకరణ

హైదరాబాద్​లో పవన్ ​కళ్యాణ్​ సభకు అనుమతి నిరాకరణ
తెలంగాణ రాష్ట్ర రాజధాని ఐటీ హబ్ గచ్చిబౌలిలో జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి భద్రతా కారణాల దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. జూన్ 2వ తేదీన గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవగా, చివరి నిమిషంలో  అయితే భద్రతా కారణాలను చూపుతూ సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.  

జనసేన విజ్ఞప్తిని పరిశీలించిన శేరిలింగంపల్లి జోన్ డీసీపీ శ్రీనివాస్ సభకు అనుమతి ఇవ్వడం కుదరదంటూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వ్యాఖ్యలపై నమోదైన కేసులు, వాటి కారణంగా తెలంగాణలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు, అలాగే కొందరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని దర్యాప్తులో తేలిందని పెక్రోన్నారు. 

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, వ్యతిరేక ఆందోళనలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.  అదే విధంగా ఈ సమావేశం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సమయంలో జరగనుండటంతో, భారీ స్థాయిలో నిరసనలు, ప్రదర్శనలు, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని డిసిపి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సమావేశం నిర్వహిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని వెల్లడించారు.

మరోవైపు, సమావేశానికి వచ్చే సుమారు 2 వేల మంది కోసం సరిపడా పార్కింగ్ సదుపాయం లేదని వేదిక యాజమాన్యం ధృవీకరించిందని తెలిపారు.  అయితే ఇది సభ కాదని, కేవలం సమావేశం నిర్వహించుకుంటున్నామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్‌ రెడ్డి తెలిపారు. సమావేశమే అయినందున పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుందని, అనుమతి ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. సరైన కారణాలు చెప్పకుండా పోలీసులు అనుమతి నిరాకరించారని, అందుకే అనుమతి కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.