రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు స్పష్టం చేశారు. తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని తేల్చి చెప్పారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో శుక్రవారం జరిపిన కీలక భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల పొత్తుల అంశంపై తుది నిర్ణయాన్ని అధిష్టానమే చూసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని 937 మండలాల్లో బీజేపీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
వచ్చే శాసనసభ సమావేశాలు పూర్తి అయిన వెంటనే రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో మరొకసారి ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణలోనే సంస్థాగతంగా బీజేపీ మరింత బలంగా ఉందన్న రామచందర్‌రావు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడమే ప్రధాన అజెండాగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై అందరూ కలిసికట్టుగా రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాలని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తమకు దిశానిర్దేశం చేశారని రామచందర్‌రావు వెల్లడించారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను తయారు చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశించిందని చెబుతూ ప్రతి 3 నెలలకొకసారి జాతీయ అధ్యక్షుడు తెలంగాణను సందర్శించి పార్టీ పరిస్థితులను సమీక్షిస్తారని వెల్లడించారు.
ఇదే సమయంలో బీజేపీలో అంతర్గత విషయాలపై వస్తున్న ప్రచారాలను రామచందర్‌రావు ఖండించారు. బీజేపీలో కొత్త, పాత నేతల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు లేవని తేల్చిచెప్పారు. నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చని కానీ విభేదాలు మాత్రం లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి పలువురు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ సరైన సమయం కోసం వారు వేచి చూస్తున్నారని చెప్పారు.
డీలిమిటేషన్ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభిస్తుందని వ్యాఖ్యానించిన రామచందర్‌రావు ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు కూడా దీనికి మద్దతు తెలిపే అవకాశం ఉందని తెలిపారు. కాగా, ఈ భేటీలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జ్ లు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ వంటి నేతలు కూడా పాల్గొన్నారు.
More Stories
కాంగ్రెస్ అవినీతిపై కెటిఆర్ మాట్లాడారే?
అత్యవసర సేవలకు వన్ నేషన్ వన్ నెంబర్ `112′
52 కాలేజీలు హైడ్రా కమిషనర్ సంతకాల ఫోర్జరీ!