హైకోర్టు అనర్హత వేటుపై మాట మార్చి సుప్రీంను ఆశ్రయించిన దానం 

హైకోర్టు అనర్హత వేటుపై మాట మార్చి సుప్రీంను ఆశ్రయించిన దానం 

బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించి అనర్హత వేటుకు గురైన దానం నాగేందర్  హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా, ఉప ఎన్నికకు సిద్ధమేనని ప్రకటించిన మరుసటి రోజే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత ధర్మాసనంలో శనివారం ఆయన పిటిషన్ వేశారు.

అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని, సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచన లేదని, ఉప ఎన్నికకు సిద్ధమేనని పేర్కొన్న ఆయన శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటును ఆయన సవాల్ చేశారు. ఖైరతాబాద్‌ నుంచితన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు దానం. 

ఇదే కేసులో ఇప్పటికే బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేవియట్ దాఖలు చేశారు. బిఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన దానం నాగేందర్‌పై హైకోర్టు శుక్రవారం అనర్హత వేటు వేసింది. 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హత అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. 

ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్‌లను కొట్టివేస్తూ స్పీకర్ వెలువరించిన తీర్పులను రద్దు చేస్తూ హైకోర్టు 91 పేజీల తీర్పు వెలువరించింది. స్పీకర్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ బిఆర్ఎస్, బిజెపిలు దాఖలు చేసిన పిటిషన్‌లను అనుమతించింది. బిఆర్ఎస్ సభ్యుడిగా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినందున దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. 

సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం ద్వారా బీఆర్‌ఎస్‌ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. దానం నాగేందర్‌ 2024 ఏప్రిల్‌ 23న కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేసిన తేదీ నుంచే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని 2(1)(ఏ)తోపాటు ఆర్టికల్‌ 191(2) ప్రకారం ఎమ్మెల్యే పదవికి అనర్హుడని ప్రకటించింది.