రామగుండంలో అతిపెద్ద నీటిపై తేలియాడే సౌర విద్యుత్‌ ప్లాంట్‌

రామగుండం(ఎన్టీపీసీ)లో ఏర్పాటు చేసిన భారతదేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్‌) సౌర విద్యుత్‌ ప్లాంట్‌ పూర్తి సామర్థ్యంతో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటికే 80 మెగావాట్ల మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నారు. తాజాగా మిగిలిన 20 మెగావాట్ల పనులను కూడా పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభించారు.

ఇక్కడి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి నీటిని సరఫరా చేసే జలాశయం (500 ఎకరాల విస్తీర్ణం)పై రూ.423 కోట్ల వ్యయంతో ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. బీహెచ్‌ఈఎల్‌ ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. సాధారణంగా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా భూమి అవసరం అవుతుంది. ఫ్లోటింగ్‌ ప్లాంట్ల ఏర్పాటుతో పెద్ద మొత్తంలో భూసేకరణ ఖర్చు తగ్గుతుంది.

ఫ్లోటింగ్‌ ప్లాంట్‌ అంటే ఫోటో వోల్టాయిక్‌ సోలార్‌ ప్యానెల్స్‌ (సౌర ఫలకాలు) మాత్రమే కాదు.. ఇన్వర్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, హెచ్‌టీ బ్రేకర్లు, స్కాడా వంటి పరికరాలతో ఏర్పాటైన మొత్తం సౌర విద్యుదుత్పత్తి వ్యవస్థ అంతా నీటిపైనే తేలియాడుతూ ఉంటుంది. హైడెన్సిటీ పాలిథిలీన్‌ మెటీరియల్‌తో తయారైన ఫ్లోటర్స్‌పై సోలార్‌ ప్యానెల్స్‌ను బిగించారు.

ఒక్కొక్కటి 2.5 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 40 బ్లాకులుగా (తేలియాడే వేదికలు) విభజించి దీన్ని నిర్మించారు. ప్రతి తేలియాడే వేదిక (ఫెర్రో సిమెంట్‌ ఫ్లోటింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌)పై 11,200 సోలార్‌ ప్యానెల్స్‌తో పాటు ఒక ఇన్వర్టర్, ట్రాన్స్‌ఫార్మర్, హెచ్‌టీ బ్రేకర్‌ ఉంటాయి. మొత్తం వ్యవస్థ నీటిపై తేలియాడుతూ ఒకేచోట ఉండేలా రిజర్వాయర్‌ అడుగున ఉన్న కాంక్రీట్‌ బ్లాకులకు లంగరు వేశారు.

ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను 33 కేవీ అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ ద్వారా దగ్గర్లోని స్విచ్‌యార్డ్‌కు సరఫరా చేస్తారు. భారీ భూసేకరణ ఖర్చు తగ్గడంతో పాటు ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ అన్ని రకాలుగా పర్యావరణ అనుకూలతను కలిగి ఉంటుంది.

జలాశయంపై సౌర విద్యుత్‌ వ్యవస్థకు సంబం ధిం చిన బ్లాకులు తేలియాడుతూ ఉండడంతో జలాశ యంలో నీటి ఆవిరి నష్టాలు తగ్గుతాయి. అంటే ఇది జల సంరక్షణకు దోహదపడుతుందన్న మాట. ఏటా 32.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీటి ఆవిరి నష్టాలను నివారించవచ్చని ఎన్టీపీసీ అంచనా వేసింది.

సోలార్‌ ప్యానెల్స్‌ కింద నీళ్లు ఉండడంతో వాటి పరిసరాల్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయి. దీంతో వాటి పని సామర్థ్యంతో పాటు ఉత్పాదకత పెరుగుతుంది.  థర్మల్‌ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుండడంతో ఏటా 1.65 లక్ష టన్నుల బొగ్గు వినియోగాన్ని, 2.1 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించవచ్చు.

రామగుండంలో 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ అందుబాటులోకి రావడంతో దక్షిణాదిలో తమ ఫ్లోటింగ్‌ ప్లాంట్‌ల సామర్థ్యం 217 మెగావాట్లకు పెరిగిందని ఎన్టీపీసీ ప్రాంతీయ డైరెక్టర్ (దక్షిణ) నరేష్‌ ఆనంద్‌ వెల్లడించారు. కాయంకులం (కేరళ)లో 92 మెగావాట్లు, సింహాద్రి (ఏపీ)లో 25 మెగావాట్ల ఫ్లోటింగ్‌ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు.