బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హెచ్ఐసిసిలో ప్రారంభమయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశాలను ప్రారంభించారు. 
 
సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు హాజరయ్యారు.రెండ్రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న సమావేశాలు జరుపుకుంటున్నారు. 
 
ఈసమావేశాల్లోనే 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను పార్టీ హైకమాండ్ సిద్ధం చేయనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా చర్చలు జరగనున్నాయి. తెలంగాణలో బిజెపి పాగా వేయడానికి ప్రధాన మంత్రి మోదీ రోడ్‌మ్యాప్‌ ఇవ్వనున్నారు. 
 
శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న ప్రధానికి బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్,  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, విజయశాంతి, ఈటల రాజేందర్, వివేక్ వెంకట స్వామి ప్రభూతులు ఘన స్వాగతం పలికారు. 
 
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్​ కు చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్​ చేశారు. “డైనమిక్​ సిటీ హైదరాబాద్​ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చాను. ఈ భేటీలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తాం” అని ఆయన వెల్లడించారు. ఈ ట్వీట్​ కు గవర్నర్​ తమిళిసై, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​, బీజేపీ ముఖ్య నేతలు స్వాగతం పలుకుతున్న రెండు ఫొటోలను జతచేశారు. కాగా ప్రధాని మోదీ ట్వీట్‌కు  మంత్రి తలసాని వెంటనే స్పందించారు.హైదరాబాద్‌ను డైనమిక్‌ సిటీగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.
 
అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో హెచ్ఐసీసీ నోవాటెల్ కు మోదీ  వెళ్లారు. ఈ నేపథ్యంలో నోవాటెల్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 10 గంటల వరకు, ఆదివారం రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో  మోదీ ప్రసంగించనున్నారు.
అజెండా ఖరారు 
 
కాగా, శనివారం ఉదయం బిజెపి పదాధికారుల నడ్డా అధ్యక్షతన సమావేశమై కార్యవర్గ సమావేశం అజెండాను ఖరారు చేశారు. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ విధానాలపై కార్యవర్గ సమావేశాల్లో చర్చ జరుగనుంది. 2024లో దేశంలో మళ్ళీ అధికారంలోకి రావటం, దక్షిణాదిన బలం పెంచుకోవటం తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చ జరుగనుంది. 
 
అలాగే కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆంధ్ర, తమిళనాడులో పార్టీ బలపడేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలనే దానిపై చర్చించనున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా తీసుకోవాల్సిన కార్యాచరణను రూపొందించనున్నారు. కేరళలో కార్యకర్తలకు మనోధైర్యం కల్పించటం, ఉత్తరాది‌న రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచించనున్నారు.
ఉత్తరాదిన ఎంపీల సంఖ్య తగ్గితే, దక్షిణాదిన పెంచుకునే వ్యూహాన్ని ఖరారు చేస్తారు. ఇక ఆర్థిక అంశాల విషయానికి వస్తే దేశ ప్రజలు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగనుంది. విదేశాంగ విధానంలో ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకనుగుణంగా అవలంబించాల్సిన విధానంపై నేతలు చర్చించనున్నారు. ఇతర దేశాలతో సంబంధాలపై ప్రభుత్వానికి సూచించాల్సిన అంశాలపై కూడా చర్చ జరుగనుంది.