కుటుంభం పాలనపై హైదరాబాద్ నుండే బీజేపీ పోరు!

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా శనివారం నుంచి రెండు రోజుల పాటు జరుగను న్నాయి.  సమావేశాలకు ఒక్క రోజు ముందుగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు జాతీయ నాయకులు హైదరాబాద్ కు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చేరుకొని హల్ చల్ చేస్తున్నారు.
 దక్షిణాదిలో బీజేపీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ పై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ముసాయిదా తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. కర్నాటక తర్వాత తెలంగాణలోనే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉందని, ఆ దిశగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాన్ని కూడా ఎజెండాలో చే ర్చనున్నారు.
తెలంగాణతో పాటు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుటుంబ పాలన సాగుతున్నదని. కుటుంబ పాలన వల్ల అవినీతి పెరిగిపోతున్నదని, దాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని ముసాయిదా తీర్మానంలో చేర్చారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లోని ఏజెండా. ముసాయిదా తీర్మానాలపై గత రాత్రి 10 గంటల నుంచి అర్ధరా త్రి వరకు నోవాటెల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశమై చర్చించారు.
ఇందులో తరుణ్​చుగ్​, శివప్రకాశ్​, పురందేశ్వరి సహా మొత్తం 10 మంది పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వాటిని అధిగమించడం, జాతీయ అంతర్జాతీయ సంబంధాలు, త్వరలో జరగనున్న గుజరాత్​, హిమాచల్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించడం,  ఆ తర్వాత జరుగబోయే కర్నాటక, తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం ఎలా ముందుకు పోవడం, ప్రధాని నరేంద్ర మోదీ  ఎనిమిదేండ్ల పాలనలో సాధించిన ప్రగతి, బీజేపీ పాలనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడం వంటి అంశాలపైనా జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో చర్చించారు.
ఈ చర్చించిన అంశాలను శనివారం ఉదయం జరుగుతున్న జాతీయ ​ ఆఫీస్​ బేరర్ల సమావేశం ముందు ఉంచారు.  అవసరమైన మేరకు మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు. కార్యవర్గ సమావేశాల్లో మొదట జేపీ నడ్డా అధ్యక్ష ఉపన్యాసం చేస్తారు. మరుసటి రోజు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ  ప్రసంగంతో సమావేశాలు ముగుస్తాయి.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు శనివారం హైదరాబాద్ కు వస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం12.45 గంటలకు బయలుదేరనున్న ప్రధాని మధ్యాహ్నం 2. 55 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 3.20 గంటలకు హెచ్ఐసీసీ నోవాటెల్​కు వస్తారు. సాయంత్రం 4 గంటలకు నోవాటెల్ లో జరుగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో  పాల్గొంటారు.  రాత్రి 9 గంటల వరకు కొనసాగునున్న ఈ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అక్కడే బస చేస్తారు.
పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు గురువారమే హైదరాబాద్ చేరుకొని తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటున్నారు. వీరంతా శనివారం సాయంత్రం 4 గంటలకు నోవాటెల్ కు చేరుకొని జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4. 30 గంటల వరకు రెండో రోజు జాతీయ కార్యవర్గ సమావేశాలు  జరుగుతాయి. ఇందులోనూ ప్రధానిమోదీ పాల్గొంటారు. సాయంత్రం పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ రోజు రాత్రి రాజ్ భవన్  లో బస చేస్తారు.
ఆదివారం విజయ సంకల్ప సభ పేరుతో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ప్రధాని మోదీ సభకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి శుక్రవారం పరేడ్ గ్రౌండ్ కు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. సభలో మొత్తం నాలుగు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు.
ఒక వేదికపై మోడీ, నడ్డా, అమిత్ షా, రాజ్‌‌నాథ్ సింగ్, గడ్కరీ, కిషన్ రెడ్డి, సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ ఉంటారు. రెండో వేదికపై పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు కూర్చుంటారు. మూడో వేదికపై పార్టీ జాతీయ నేతలు ఉంటారు. నాలుగో వేదికపై సాంస్కృతిక బృందాల కళా ప్రదర్శనలు ఉంటాయి.