ప్రధాని మోదీ రాక.. టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలపై కిషన్‌ రెడ్డి ఆగ్రహం

బిజేపీ కార్యవర్గ సమావేశాలకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఆటంకాలు కలిగిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఉదయం పార్టీ నేతలతో కలసి పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి పరిశీలిస్టు టీఆర్ఎస్  ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రధాని మోదీ సభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు.
 దురదృష్టవశాత్తు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు అనేక అవరోధాలు సృష్టిస్తోందని విచారం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సీఎం కేసీఆర్‌ పెద్ద ఎత్తున ప్రజాధనం ఉపయోగించి ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇలా వారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అయితే, తాము ప్రజల సహకారంతో ఈ సమావేశాలను విజయవంతం చేస్తామని, దేశాన్ని, రాష్ట్రాలను శక్తివంతంగా తీర్చిదిద్దుతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశఆరు.  బీజేపీ కార్యాకర్తలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజల ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం చేస్తామని భరోసా వ్యక్తం చేశారు.
ఎనిమిదేళ్ళుగా మోదీ చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఈ సందర్భంగా  వివరిస్తామని తెలిపారు. కార్యవర్గ సమావేశాలు ప్రజల‌ కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.  తెలంగాణ ప్రజలందరూ నరేంద్ర మోదీ పర్యటన కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారని,  బీజేపీ సమావేశాలు విజయవంతంకావాలని ఆకాంక్షిస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు.
తెలంగాణకు ఒకేసారి 18 మంది సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలంతా రావడం అరుదైన దృశ్యం అని చెప్పారు.  ఈ కార్యక‍్రమాన్ని బీజేపీ ఒక పండుగ వాతావరణంలో నిర్వహించబోతోందని పేర్కొన్నారు.

తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా 

కాగా, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ సభ ఉండబోతోందని బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు  డా,కె లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణపై ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షాలు ప్రత్యేక దృష్టి సారించారన్నారని చెబుతూ మరో ఏడాదిలో తెలంగాణలో రామ రాజ్యం రావటం ఖాయమని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని అంటూ హార్డింగ్స్, ఫ్లెక్సీల విషయంలో టీఆర్ఎస్ ది చిల్లర రాజకీయమని ఆయన మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి పోటీ చేయనున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌కు బీ పార్టీగా టీఆర్ఎస్, ఎంఐఎంలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కుటుంబ పార్టీలు కనుమరుగవటం‌ ఖాయమని స్పష్టం చేశారు.

పుత్ర వాత్సల్యం వలన శివసేనకు పట్టిన గతే టీఆర్ఎస్‌కు పడుతుందని హెచ్చరించారు. ఆదివాసీ రాష్ట్రపతి అవుతుంటే టీఆర్ఎస్ నాయకత్వం ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. ఆదివాసీని రాష్ట్రపతిని చేస్తోన్న ఘనత 70 ఏళ్ళల్లో బీజేపీకి దక్కుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ముస్తాబైంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్రానికి చేరుకొని తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లారు. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, శనివారం ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు రానున్నారు.

శనివారం, ఆదివారం కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. . ఆదివారం సాయంత్ర పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరవుతారు. బీజేపీ అగ్ర నేతలు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్యవర్గ సమావేశాలకు వస్తున్నందున రాష్ట్ర బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.