రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము …. బిజెపి మాస్టర్ స్ట్రోక్!

రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని సునాయాసంగా ఎన్నికయ్యేటట్లు చేసుకోగల సంఖ్యాబలం గల బిజెపి తమ అభ్యర్థిగా అత్యంత వెనుకబడిన గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు వేసిన మాస్టర్ స్ట్రోక్ వ్యూహంగా స్పష్టం అవుతుంది.
 
ఇతర రాజకీయ పార్టీలు ఏవీ 2024 ఎన్నికల వ్యూహం గురించి ప్రాథమిక సమాలోచనలు కూడా ప్రారంభించని సమయంలో బిజెపి తన బలహీనతలు, బలాలను సమగ్రంగా అంచనా వేసుకుని, ప్రత్యర్థులకు అందనంత భారీ  లక్ష్యాలతో ముందు వెడుతున్నది. అందుకు జులై 2,3 తేదీలలో హైదరాబాద్ లో జరుగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల నుండి ఎన్నికల వ్యూహాలు అమలుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది.  
 
అన్ని సాధన సంపత్తులను ఉపయోగించుకొని గత కొద్ది కాలంగా గుజరాత్, మహారాష్ట్రల  నుండి అస్సాం వరకు ప్రతిపక్షాలను కోలుకోనీయకుండా బిజెపి వేస్తున్న ఎత్తుగడలు 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఒకేసారి అనేక స్థాయిలలో వ్యూహాల అమలు ప్రారంభించిందని వెల్లడి చేస్తుంది. దానితో రాజకీయ ప్రత్యర్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 
ఇప్పటికే పార్టీకి ఎన్నడూ ఓట్ వేయని 74,000 పోలింగ్ బూత్ లను దేశవ్యాప్తంగా గుర్తించింది. అదే విధంగా ఒక సారి కూడా గెలుపొందని 144 లోక్ సభ నియోజక వర్గాలను గుర్తించింది. వీటితో పాటు ఇప్పటి వరకు పార్టీ అధికారంలోకి రాష్ట్రాలను కూడా పరిగణలోకి తీసుకొంటూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. 
 
తద్వారా 2024 ఎన్నికలలో కేవలం తిరిగి అధికారంలోకి రావడమే కాకుండా, దేశ వ్యాప్తంగా అన్ని దిశలా తమ ప్రాబల్యం విస్తరించే విధంగా అడుగులు వేస్తున్నది. ఈ బృహత్తర  ప్రణాళికలలో కీలక ఘట్టం ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడంగా భావించవచ్చు.
గతంలో అగ్ర వర్ణాల పార్టీగా పేరొందిన బిజెపిని ఓబీసీలు, దళితులకు చేరుకునే విధంగా గత ఎనిమిదేళ్లుగా చేస్తున్న విస్తృత ప్రయత్నాల కారణంగా ఉత్తర  ప్రదేశ్ లో అనూహ్యంగా వరుసగా రెండో పర్యాయం బిజెపి అధికారంలోకి రాగలిగింది. బిజెపి ఇప్పుడు తన ప్రాబల్యాన్ని మరింతగా విస్తరింప చేసుకోవడం కోసం గిరిజనులు, మహిళల వైపు దృష్టి సారిస్తున్నది. ఆ దిశలో ద్రౌపది ముర్ము ఎంపికను కీలక ఘట్టంగా చెప్పవచ్చు. 
 
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉజ్వల, జనధన్ ఖాతాలు, భేటీ బచావో … వంటి సంక్షేమ పథకాల ద్వారా మహిళా ఓటర్లలో విశేషమైన ప్రభావం చూపగలుగుతున్నది. ముర్ము నామినేషన్‌తో బీజేపీ ఒక్క దెబ్బతో అనేక బాణాలు వదిలినట్లయింది. ఒడిశాలోని అత్యంత వెనుకబడిన సంతాల్ తెగకు చెందిన ఆమె హుందాగా మంత్రి పదవి, గవర్నర్ పదవి వంటి వాటిని నిర్వహించి, అందరి అభిమానాన్ని పొందగలిగింది.
ఇటీవలి ఎన్నికల్లో గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లలో గిరిజనుల ఓట్లను బీజేపీ చెప్పుకోదగినంతగా పొందలేక పోయింది. కొన్ని చోట్ల వ్యూహాత్మకంగా చేసిన పొరపాట్ల కారణంగా ప్రతికూలతలు ఎదుర్కోవలసి వచ్చింది.  త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలలో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన 138 సీట్లలో బీజేపీకి కేవలం 35 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే 100కు పైగా సీట్లలో బిజెపి ఓటమి చెందింది. 
ఉదాహరణకు, జార్ఖండ్‌లో, గత అసెంబ్లీ ఎన్నికలలో, 28  ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో బిజెపి రెండు మాత్రమే గెలుచుకుంది. అదే విధంగా,  గుజరాత్‌లో, 37లో 19,  మధ్యప్రదేశ్‌లో 47లో 16, రాజస్థాన్‌లోని 18లో తొమ్మిది మాత్రమే బిజెపి గెలిచిన స్థానాలు. 
 
ఈ స్థానాలలను అత్యధికంగా గెలుపొందడం ద్వారా ఆయా రాష్ట్రాలలో రాజకీయంగా సుస్థిరతను ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకనే, కొంతకాలంగా ఈ రాష్ట్రాలలో గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో పాటు ప్రధాని మోదీ, ఇతర నేతలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 

ఏప్రిల్‌లో, బిజెపి ఎస్టీ మోర్చా నిర్వహించిన గిరిజన ప్రముఖులతో పార్టీ జరిపిన సదస్సులో పాల్గొనడానికి గణనీయమైన గిరిజన జనాభా ఉన్న తూర్పు రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాను నడ్డా సందర్శించారు. మేలో దేశ రాజధానిలో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్టీ నేతల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఏప్రిల్‌లో, గుజరాత్‌లోని గిరిజన ప్రాంతమైన దాహోద్, పంచమహల్స్‌లో లోకోమోటివ్ తయారీ యూనిట్‌తో సహా రూ. 20,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.  కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత కొన్ని నెలలుగా మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలను తరచూ సందర్శిస్తున్నారు.

బిజెపి మాజీ అధ్యక్షుడు కుషాభౌ ఠాక్రే పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో స్థాపించిన మధ్యప్రదేశ్‌లోని సంస్థలో ఎస్సీ, ఎస్టీలను సమీకరించడంలో సహాయపడటానికి పార్టీ సీనియర్ నాయకుడు పి మురళీధర్ రావును నియమించారు. దేశంలోని గిరిజన-ఆధిపత్య ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ పరివార  సంస్థలు చాలా కాలంగా పని చేస్తున్నాయి.  
 
క్రైస్తవ మిషనరీలు జరుపుతున్న సామూహిక మత మార్పిడులను అడ్డుకోవడంతో పాటు, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను ఈ సంస్థలు నిర్వహిస్తున్నాయి. గిరిజనులను `హిందూ భావన’కు దూరం కావించే ప్రయత్నాలను తిప్పికొట్టడంలో విజయం సాధించారు. 
 
తాజాగా, ఆర్ఎస్ఎస్ పరివార్ సంస్థ, జన జాతి సురక్షా మంచి మధ్య  భారత రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలలో విస్తృతమైన కార్యక్రమాలను ప్రకటించింది  క్రైస్తవ మతం లేదా ఇస్లాం మతంలోకి మారిన గిరిజనులను రిజర్వేషన్లకు అర్హులైన ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే డిమాండ్ తో విస్తృతమైన ప్రచారం చేపట్టింది. 
 
యాదృశ్చికంగా ఈ ప్రాంతాలలో ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోవడం గమనార్హం.  ఎస్టీల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ ప్రయోజనాలు నిజమైన గిరిజనులకే అందాలనే డిమాండ్ తో  వచ్చే నెలలో గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు జార్ఖండ్‌లో మంచ్ పలు ర్యాలీలు జరపాలని నిర్ణయించింది. 
 
ఈ విధంగా గిరిజన ప్రాంతాలపై బిజెపితో పాటు ఆర్ఎస్ఎస్ పరివార సంస్థలు మూకుమ్మడిగా దృష్టి సారించడం యాదృచ్చికం కాదని చెప్పవచ్చు. దేశ రాజకీయ స్వరూపాన్నే మార్చివేసే బృహత్తర లక్ష్య సాధనలో భాగంగానే జరుగుతున్నది. ఈ ప్రణాళికలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ కు చేరుకోవడం కీలక పరిణామం కాగలదు.