పార్టీపై పట్టు కోసం ఉద్ధవ్, షిండే ముమ్ముర ప్రయత్నాలు!

పార్టీ ఎమ్యెల్యేలలో మూడింట రెండు వంతుల మందికి పైగా తిరుగుబాటు శిబిరంలో చేరినట్లు స్పష్టం కావడంతో అధికారం చివరి ఘడియలలో పడినదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గ్రహించారు. తిరుగుబాటు ఎమ్యెల్యేలు కొందరిపై అనర్హత అస్త్రం ప్రయోగించి, వివాదాన్ని కోర్ట్ వరకు తీసుకెళ్లి, కొంతకాలం నెట్టుకొచ్చే ఎత్తుగడలు వేస్తున్నారు. 
 
అయితే పార్టీపై పట్టు కోసం ఇప్పుడు థాకరేతో పాటు తిరుగుబాటు నేత ఎకనాథ్ షిండే సహితం ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.   తమదే అసలైన శివసేన అంటూ ఎవరికి వారే ప్రకటనలు చేస్తున్నారు. తనను శాసనసభాపక్ష నేతగా నియమించాలంటూ 37 మంది శివసేన ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను డిప్యూటీ స్పీకర్, గవర్నర్​కు షిండే ఇప్పటికే పంపారు.
ఇక పార్టీని చీల్చేందుకు తిరుగుబాటు నాయకులు కుట్ర పన్నారని సీఎం ఉద్ధవ్​ ఆరోపించారు. పార్టీని విడిచిపోయే వారి కోసం తాము బాధపడనని, ఎవరు వెళ్లిపోయినా తమకు నష్టం లేదని చెప్పారు. కుళ్లిన పళ్లు, ఆకులు రాలిపోతేనే మంచిదని, వేళ్లూనుకున్న మహావృక్షం లాంటి శివసేను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
పార్టీ పేరు, గుర్తు కూడా తమకే దక్కేటట్లు చేసుకోవడం కోసం ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించే ప్రయత్నంలో షిండే ఉన్నారు. ఈ ప్రయత్నాలు గ్రహించిన ఉద్ధవ్ జిల్లా ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా వారి మద్దతు తనకే కొనసాగేటట్లు చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు.
తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఉద్ధవ్​తో ఎన్సీపీ అధినేత శరద్​పవార్​ గత రాత్రి సమావేశమయ్యారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం అజిత్​ పవార్, ఎన్సీపీ లీడర్​ జయంత్​ పాటిల్ ఉన్నారు. వారు రెండు గంటలకుపైగా ఆయన చర్చలు జరిపారు.
కాగా, శనివారం ముంబైలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్టు శివసేన ప్రకటించింది. ఈ సమావేశంలో ఉద్ధవ్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొంటారు. మరో శివసేన ఎమ్మెల్యే రెబెల్​ క్యాంపులోకి చేరారు. దీంతో ఏక్​నాథ్​షిండే క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య 50కి చేరినట్టుగా తెలుస్తోంది.  వీరిలో 40 మంది శివసేన ఎమ్మెల్యేలు కాగా, మిగతా పది మంది ఇండిపెండెంట్​ ఎమ్మెల్యేలు ఉన్నారు.
 
 ఇలా ఉండగా, 38 మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎకనాథ్ షిండే ముఖ్యమంత్రి థాకరేకు లేఖ వ్రాసారు. మహారాష్ట్ర హోంమంత్రి, డీజీపీకి కూడా ఆయన లేఖలు రాశారు. తమ కుటుంబాలకు ఏమైనా జరిగితే రాష్ట్ర సర్కారుదే బాధ్యతని ఆ లేఖలలో స్పష్టం చేశారు. భద్రత తొలగించడమంటే భయపెట్టడమేనని ధ్వజమెత్తారు. సర్కారు తీరుతో తమ బంధువులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.
 
అయితే అటువంటి ఉత్తర్వులను ముఖ్యమంత్రి గాని, తాను గాని జారీచేయలేదని హోమ్ మంత్రి దిలీప్ పటేల్ స్పష్టం చేశారు. 
12 మంది రెబెల్​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ డిప్యూటీ స్పీకర్​కు లేఖ రాసిన శివసేన.. తాజాగా మరో నలుగురిపై వేటు వేయాలని కోరింది. దీంతో వీరందరికి నోటీసులు ఇచ్చేందుకు డిప్యూటీ స్పీకర్ ​నరహిరి జిర్వాల్​ సిద్ధమయ్యారు.
అయితే శరద్​ పవార్​ పార్టీకి చెందిన డిప్యూటీ స్పీకర్​ నరహరి జిర్వాల్​ను తొలగించాలని షిండే క్యాంపులోని ఇద్దరు ఇండిపెండెంట్​ ఎమ్మెల్యేలు మహేశ్ బాల్డీ, వినోద్​ అగర్వాల్​ డిమాండ్​ చేశారు. అరుణాచల్​ ప్రదేశ్​ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం డిప్యూటీ స్పీకర్​కు రెబెల్​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం లేదని అన్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్​కు వ్యతిరేకంగా వారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అనర్హత నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రెబెల్​ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు.
ఇక రెబెల్​ లీడర్లకు వ్యతిరేకంగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. షిండేతో పాటు పలువురు రెబెల్​ ఎమ్మెల్యేల ఆఫీసులపై శివసేన కార్యకర్తలు దాడులకు దిగారు. వారి ఫ్లెక్సీలపై నల్ల ఇంకు జల్లడంతో పాటు వాటిని ధ్వంసం చేశారు.
 షిండేకి కంచుకోట అయిన థానే నగరంలో హింసాకాండ చెలరేగే అవకాశాలున్నాయని నిషేధాజ్ఞలు జారీ చేశారు.ఈ నిషేధాజ్ఞలు జూన్ 30వతేదీ వరకు ఉత్తర్వులు అమలులో ఉంటాయి.కర్రలు, ఆయుధాలు పట్టుకోవడం, దిష్టిబొమ్మలను దహనం చేయడం నిషేధించారు.మరోవైపు శివసేన కార్యకర్తల ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర అంతటా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.