ఎమర్జెన్సీని చిత్తు చేసిన జాగురత భారతీయ సమాజం

* భారత ప్రజాస్వామ్యంలో చీకటి కాలం 1975-77

 
సరిగా 47 సంవత్సరాల క్రితం 1975లో ఇదే రోజున అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారత దేశంలో యాథావసర పరిస్థితిని ప్రకటించారు. 21 నెలల పాటు అమలులో ఉన్న ఈ పరిస్థితి కేవలం మన దేశంకే కాకుండా ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రకే ఓ చికీటి అధ్యాయంగా మిగిలి పోయింది. 
 
ఎందుకంటే,  ప్రపంచంలో స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న ప్రజల సంఖ్య అకస్మాత్తుగా సగానికి పడిపోయింది. ప్రపంచంలోనే ఓ పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ లో ప్రజలకు ప్రాథమిక హక్కులు అమలులో  లేకుండా పోవడం,  ప్రతిపక్ష నేతలే కాకుండా స్వేచ్ఛగా అభిప్రాయలు వ్యక్తం  చేసే వారంతా  జైళ్లలో గడపవలసి వచ్చింది.
 
ప్రాథమిక హక్కులు అమలులో లేకపోవడంతో ప్రభుత్వం ఎవ్వరినైనా కాల్చివేసినా ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని ప్రఖ్యాత పాత్రికేయుడు కులదీప్ నాయర్ అరెస్ట్ కేసులో ఢిల్లీ హైకోర్టు లో ప్రభుత్వ అదనపు సొలిసిట్ జనరల్ వాదించారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా నెలకొందో అర్థం చేసుకోవచ్చు. 
 
భారతదేశంలో మొదటిసారిగా పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. చట్టసభలకు జరుగవలసిన ఎన్నికలను వాయిదా వేశారు. జైళ్లన్నీ నిరాయుధులైన, ప్రభుత్వ అభిప్రాయాలను వ్యతిరేకించే వారితో నింపివేసారు. చివరకు కేంద్రంలో సీనియర్ మంత్రులు సహితం ఏమీ మాట్లాడలేక తమ ఇళ్లకే పరిమితం కావలసి వచ్చింది. 
 
దేశ చరిత్రలో మొదటిసారిగా `రాజ్యాంగాతీత శక్తులు’ ప్రభుత్వ వ్యవహారాలలో పెత్తనం చేయడం చూసాము. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ లోక్ సభకు ఎన్నిక కావడాన్ని కొట్టివేయడంతో, కేవలం ఆమె పదవిని కాపాడుకోవడం కోసం అత్యవసర పరిస్థితి విధించడం అందరికి తెలిసిందే. అయితే అందుకు ఏవేవి కారణాలు చెప్పి, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. 
 
అయితే, అత్యవసర పరిస్థితి భారత పౌర సమాజంలో నెలకొన్న చైతన్యాన్ని, వారి సంఘటిత శక్తిని మొత్తం ప్రపంచానికి వెల్లడించింది. 1971లో  బాంగ్లాదేశ్ యుద్ధంలో అనూహ్యమైన విజయం సాధించినప్పటి నుండి దేశంలో తిరుగులేని నాయకురాలిగా ఇందిరాగాంధీ వెలుగొందుతూ వచ్చారు. ఆమెను రాజకీయంగా ఎదిరించే సత్తా ప్రతిపక్షాలలో పెద్దగా కనిపించడం లేదు.
 
ప్రజలకు ఆశాదీపంగా విద్యార్థుల ఉద్యమం 
 
అటువంటి సమయంలో మొదట గుజరాత్ లో ఓ ఇంజనీరింగ్ కాలేజీ మెస్ లో అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం క్రమంగా బీహార్ కు వ్యాపించడం, దశాబ్దాలుగా `రాజకీయ సన్యాసం’ చేపట్టిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ విద్యార్థులకు మద్దతుగా మాట్లాడిన, అవినీతికి మాత్రమే కాకుండా మొత్తం వ్యవస్థలో `సమగ్రమైన మార్పు’ కోసం `సంపూర్ణ విప్లవం’ కోసం విద్యార్థులు, యువకులు ఉద్యమించాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యమాలలో ఎబివిపి నిర్ణయాత్మక పాత్ర వహించింది. 
 
ఆయన పిలుపు విద్యుత్ తరంగం వలే దేశ వ్యాప్తంగా యువతను కదిలించడం ప్రారంభమైంది. రాజకీయ పక్షాల ప్రమేయం లేకుండా దేశ వ్యాప్తంగా విద్యార్థి, యువజన ఉద్యమాలు ఉద్భవించడం ప్రారంభమైనది. ఇంతలో అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చినా పదవికి రాజీనామా చేయకుండా ఇందిరాగాంధీ తాత్సారం చేస్తుండడంతో ఢిల్లీలో జరిగిన భారీ బహిరంగసభలో ఆమె వెంటనే రాజీనామా చేయాలనీ జెపి డిమాండ్ చేశారు. 
 
అందుకోసం దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడం కోసం మొరార్జీ దేశాయ్ అధ్యక్షునిగా, నానాజీ దేశముఖ్ కార్యదర్శిగా లోక్ సంఘర్ష సమితి ఏర్పాటును ప్రకటించారు. అంతలో ప్రజలలో ఉవ్వెత్తున నిరసనలు చెలరేగే ప్రమాదం పసిగట్టిన ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అత్యవసర పరిస్థితి సమయంలో రాజకీయ నాయకులు అరెస్ట్ చేస్తే జైళ్లకు వెళ్లడం తప్పా, ప్రజలను సమీకరించి నిరసన ఉద్యమాలకు ప్రయత్నం చేసినవారు చాలా తక్కువ. 
 
కేవలం జార్జ్ ఫెర్నాండెస్, నానాజీ దేశముఖ్ వంటి వారు మాత్రమే తమదైన పద్దతిలో ఉపక్రమించారు.  ఆర్ ఎస్ ఎస్ వంటి సంస్థలను నిషేధించడంతో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున నిరసన ఉద్యమంలో చేరారు. మొత్తం మీద లక్ష మందికి పైగా జైల్లకు వెళ్లారు. మొత్తం  ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఓ శాంతియుత ఉద్యమంలో ఇంత మంది జైళ్లకు వెళ్ళ లేదు. 
 
విదేశాలలో సహితం సుబ్రమణియన్ స్వామి వంటి వారు అత్యవసర పరిస్థితి పేరుతో భారత్ లో జరుగుతున్న అరాచక పరిస్థితుల గురించి విశేషంగా  ప్రచారం చేస్తుండడంతో అంతర్జాతీయంగా వత్తిడి పెరిగి, ఆమె  మార్చి 21, 1977న అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకో వలసి వచ్చింది.
ఎన్నికలంటే భయపడ్డ ప్రతిపక్షాలు 
ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ, ఆమె పార్టీ ఘోరంగా ఓటమి చెందింది. రాజకీయ పార్టీల బలాబలాలతో సంబంధం లేకుండా పౌర ఉద్యమాల ద్వారా సాధారణ ప్రజలు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా నిలబడడంతోనే ఈ అనూహ్య ఫలితాలు సాధ్యమైంది. అందుకనే, ఆ తర్వాత మరో వేయేళ్ళ  వరకు భారత్ లో అత్యవసర  పరిస్థితి విధించే సాహసం ఎవ్వరు చేయలేరని స్వయంగా ఇందిరాగాంధీ పేర్కొనడం గమనార్హం.
వాస్తవానికి ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలలో పోటీ చేయడానికి చాలామంది ప్రతిపక్ష నాయకులు భయపడ్డారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు వంటి అంశాలు `నిరక్షరాస్యులైన’  ప్రజలకు ఏమి అర్థం అవుతాయి అనుకోని, ఎన్నికలను బహిష్కరిద్దామని సూచించారు. 
 
కానీ వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ మొరార్జీ దేశాయి, జయప్రకాష్ నారాయణ్ వంటి నాయకుల నైతిక స్థైర్యం, సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లిన వేలాదిమంది యువకుల త్యాగాల ఫలితంగా 1977 ఎన్నికలలో ఇందిరాగాంధీ ఓటమి చెందింది. మొదటిసారిగా నిషేధంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
 
మొరార్జీ దేశాయి నాయకత్వంలో ఏర్పడిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం భవిష్యత్లో తేలికగా దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం లేకుండా 44వ రాజ్యాంగ సవరణను తీసుకు వచ్చింది. అయితే ప్రజలు నిత్యం జాగురకతతో వ్యవహరింపని పక్షంలో మరోసారి ఎమర్జెన్సీ విధింపక పోయినా ప్రభుత్వాలు నిరంకుశ విధానాలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని అనేకసార్లు స్పష్టమైనది. 
 
ప్రజలకు బాసటగా నిలిచిన నైతిక నాయకత్వం 
 
 నాడు ప్రధానంగా అధికార రాజకీయాల పట్ల మక్కువలేని నైతిక నాయకత్వం ప్రజలకు బాసటగా నిల్చి, మన ప్రజాస్వామ్య పరిరక్షణకు  బాసటగా నిలబడింది. లోక్ సంఘర్షణ సమితి అధ్యక్షుడిగా 78 ఏళ్ళ వయస్సులో జైలులో ఉన్న మొరార్జీ దేశాయి వద్దకు మధ్యవర్తులను పంపి పెరోల్ పై విడుదల చేస్తామని, అత్యవసర పరిస్థితులు క్రమశిక్షణ పెరిగిందని అంటూ కొన్ని మంచి మాటలు చెబితే విడుదల చేస్తామని ఇందిరాగాంధీ రాయబారం పంపారు.’
 
 కానీ బయటకు వస్తే తిరిగి ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తా గాని ప్రభుత్వానికి `లొంగిపోయే’ ప్రసక్తి లేదని మొరార్జీ స్పష్టం చేశారు. కానీ నేడు ఏ పార్టీ సీట్ ఇస్తే ఆ పార్టీలో చేరుతామని అంటూ తిరుగుతున్నారు. సైద్ధాంతిక రాజకీయాలకు కాలం చెల్లి, అధికారం చేపట్టడమే పరమావధిగా మారింది. అటువంటి ధోరణులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు కాగలవు. 
 
 మరో వంక స్వామి చిన్మయానంద, జిడ్డు కృష్ణమూర్తి వంటి వారు అత్యవసర పరిస్థితి విధించి పెద్ద తప్పు చేసావని, వెంటనే ఉపసంహరించుకోమని ప్రధాని ఇందిరా గాంధీకి హితవు చెప్పారు. ఇందిరాగాంధీ కంచికి వెళ్లి 90 సంవత్సరాల వయస్సులో ఉన్న `నడిచే దేవుడు’ గా పేరొందిన స్వామి చంద్రశేఖర సరస్వతి కాళ్లపై పడి ఆశీర్వాదం కోరితే ఇందిరాగాంధీ ముఖం చూడడానికి కూడా ఆయన ఇష్టత చూపలేదు. ఆ విధంగా అత్యవసర పరిస్థితి పట్ల తన విముఖతను చాటారు. 
 
ప్రాథమిక హక్కుల అంశంపై రాజీలేని ధోరణిని ప్రదర్శించడం ద్వారా జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని సైతం పొందలేక పోయారు. దానితో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రాజీనామా చేశారు గాని ఉన్నత పదవి కోసం ఆయన పాకులాడలేదు
భారతదేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటం తప్ప మౌలిక అంశాలపై ఉద్యమించే పరిస్థితులలో లేవని సహితం ఈ సందర్భంగా స్పష్టమైనది. అప్పటి నుండి దేశంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా పౌర సమాజ ఉద్యమాలే విశేష ఫలితాలు ఇస్తున్నాయి. 
 
దేశంలో ఉగ్రవాదం వాటిని పెను సవాళ్ళను ఎదుర్కోవడంలో సహితం సాధారణ ప్రజలే ముందున్నారని గమనించాలి. మొత్తం ప్రపంచ చరిత్రలో సైనికుల జోక్యం లేకుండా, సాధారణ ప్రజలు ఉగ్రవాదాన్ని అణచివేయడం పంజాబ్ లో 1990వ దశకంలో మాత్రమే సాధ్యమైంది. అందుకు ప్రధాన కారణం సాధారణ గ్రామీణ ప్రజలు ఉగ్రవాదాన్ని నిరసించారు. ఉగ్రవాదులు సహాయ నిరాకరణ చేశారు. 
 
చివరకు కాశ్మీర్ లోయలో సహితం దాదాపు అదే సమయంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జొరబడుతూ ఉంటె, వారికి వ్యతిరేకంగా పోరాటం చేసింది స్థానిక తీవ్రవాదులు,  యువత కావడం గమనార్హం. అయితే ప్రభుత్వం అందరిని ఒకే గాటిన కట్టేసి, స్థానికులు చేదోడుగా ఉండకపోవడంతో ఉగ్రవాదం ఆ తర్వాతి కాలంలో దేశంలో విశృంఖలంగా వ్యాపించింది.