పతనం అంచున థాకరే ప్రభుత్వం…. వేచి చూస్తున్న బిజెపి 

తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండేకు శివసేనతో మెజారిటీ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు స్పష్టం కావడంతో   మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో  అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి సంకీర్ణం గురువారం పతనం అంచుకు చేరుకొంది. 

కూటమి ప్రభుత్వంను కాపాడుకోవడం కోసం చివరి ఎత్తుగడగా తిరుగుబాటు నేత ఎకనాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపినా,   సైద్ధాంతికంగా ఈ కూటమిని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంటూ షిండే తన విముఖతను స్పష్టం చేశారు. 

బలపరీక్ష ద్వారానే ఉద్దవ్‌ ప్రభుత్వ భవిష్యత్తు తేలుతుందని అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరో ప్రయత్నంకు సంకేతం ఇచ్చారు. బుధవారం రాత్రి వరకు మొత్తం 32 మంది సేన ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత అస్సాంలోని గౌహతిలోని షిండే శిబిరంలో ఉండగా, గురువారం మరో ఐదుగురు చేరడంతో వారి సంఖ్య 37కు చేరుకొంది.  ఉన్నారు. పార్టీలో చీలిక గ్రూప్ ను ఏర్పాటు చేసి,  ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నివారించడానికి షిండేకు 55 మంది సేన ఎమ్మెల్యేలలో 37 మంది మద్దతు అవసరం.

వారు కాక మరో ఐదుగురు స్వతంత్రులు కూడా ఉన్నారు. అయితే తాజాగా తనకు 50 మంది మద్దతు ఉన్నట్లు షిండే ప్రకటించారు. వారిలో 40 మంది శివసేన ఎమ్యెల్యేలే. మరింతమంది వచ్చి తమతో చేరుతున్నట్లు చెప్పారు.

గత నెలలో సేన ఎమ్మెల్యే రమేష్ లత్కే మరణం కారణంగా ప్రస్తుతం 287 మంది ఉన్న 288 మంది సభలో,  థాకరే ప్రభుత్వం నిలబడడానికి కనీసం 144 మంది ఎమ్మెల్యేలు అవసరం. తిరుగుబాటుకు ముందు, సభలో కూటమి బలం 152 — సేన 55, ఎన్సీపీ 53, కాంగ్రెస్ 44. బీజేపీ బలం 106 కాగా ఇతరులు 29 మంది ఉన్నారు.

వేగంగా మారుతున్న పరిస్థితులను ఆసక్తిగా గమనిస్తున్న బిజెపి తిరిగి అధికారంలోకి  కోసం గతంలో వలె తొందరపడకుండా వ్యవహరిస్తున్నది.  ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఓడించడానికి షిండే  అవసరమైన సంఖ్యలను సమకూర్చుకొని వరకు వేచి చూడాలని నిర్ణయించుకొంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఢిల్లీకి వెళ్లి పార్టీ అగనాయకులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.

తన కుటుంబం, వస్తువులతో సహా ముఖ్యమంత్రి అధికారిక నివాసం వర్షని ఖాళీ చేసి బుధవారం రాత్రి సొంత ఇంటికి చేరుకున్న  ఉద్ధవ్, గురువారం పార్టీ ఎమ్మెల్యేల వర్చువల్ సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి కుమారుడు ఆదిత్య ఠాక్రే సహా 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. మాతోశ్రీ నుండి ఉద్ధవ్,ఆదిత్య సమా వేశానికి హాజరయ్యారు.

కాగా, కొత్తగా నియమితులైన శివసేన శాసనసభా పక్ష నేత అజయ్ చౌదరి తాత్కాలిక స్పీకర్ నరహరి జిర్వాల్‌ను కలిశారు, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు షిండే వర్గంలో చేరిన షిండేతో సహా 12 మంది ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

షిండే ట్విటర్ పోస్ట్‌ల ద్వారా ప్రతిస్పందిస్తూ విప్ ను ఉల్లంఘించిన 12 మని ఎమ్యెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరడం ద్వారా తమను భయపెట్టలేరని స్పష్టం చేశారు. “మీరు ఎవరిని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు? మాకు కూడా చట్టం తెలుసు.  ఈ విప్ కేవలం శాసనసభకు మాత్రమే వర్తిస్తుంది.  బయట జరిగే సమావేశాలకు కాదు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు వెలువరించింది” అంటూ గుర్తు చేశారు.