టీఆర్‌ఎస్‌ కు కారుచవుకగా ప్రభుత్వ స్థలాలు.. హైకోర్టు నోటీసులు

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్‌ జిల్లాలోని బంజారాహిల్స్‌లో రూ.వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కారుచౌకగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయస్థానం కేసీఆర్‌కు ఈ నోటీసులిచ్చింది.

టీఆర్‌ఎ్‌సకు గజం రూ.100కే ప్రభుత్వ స్థలాలను కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఆల్‌ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్‌ కాన్ఫెడరేషన్‌ తెలంగాణ అధ్యక్షుడు కె.మహేశ్వర్‌రాజ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ  టీఆర్‌ఎస్‌ పార్టీకి అన్ని జిల్లా కేంద్రాల్లో చదరపు గజం రూ.100 చొప్పున ఎకరం భూమిని కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  2018లో జీవో జారీ చేశారని తెలిపారు.

బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12, ఎన్‌బీటీనగర్‌ సర్వే నంబరు 403/పీ (షేక్‌పేట్‌ రెవెన్యూ గ్రామం, హైదరాబాద్‌ జిల్లా)లో 4,935 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ ఈ ఏడాది మే 11న జీవో 47ను జారీ చేశారని న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు.

రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల కోసం కేటాయించడం అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో చదరపు గజం విలువ రూ.2 లక్షలకు పైగా ఉందని, అధికారులు ప్రభుత్వ భూములకు ఇంకా ఎక్కువ ధర వచ్చేలా చూడాలి తప్ప.. అధికార పార్టీకి తలొగ్గి పనిచేయరాదని తెలిపారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ.. అధికారులపై ఒత్తిడి తెచ్చి జీవోలు జారీ చేయించుకుందని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలు, ప్రజల ఆస్తులకు ట్రస్టీలుగా ఉన్న వ్యక్తులు మోసపూరితంగా వ్యవహరించరాదని పేర్కొన్నారు. అధికారుల చర్యల వల్ల ప్రజాధనానికి భారీగా గండి పడిందని పేర్కొన్నారు.  సహజ వనరులు, ప్రభుత్వ ఆస్తులను ఇతరులకు కేటాయించేటప్పుడు పారదర్శక విధానాన్ని పాటించాలని తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేలా భూములను వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుందని చెప్పారు.

అధికారంలో ఉన్న వ్యక్తుల ప్రభావానికి లొంగిపోయి కారుచౌకగా భూములను కేటాయించడం అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ప్లీనరీలో తమ పార్టీకి రూ.891 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారని, ఇందులో రూ.361 కోట్ల నగదు వివిధ బ్యాంకుల్లో ఉన్నట్లు వెల్లడించారని గుర్తు చేశారు.

దేశంలోని సంపన్న రాజకీయ పార్టీల్లో టీఆర్‌ఎస్‌ కూడా ఒకటని పేర్కొంటూ రూ.వందల కోట్ల డిపాజిట్లు ఉన్న పార్టీకి ప్రభుత్వం అతి తక్కువ ధరకు స్థలాలు కేటాయించడంలో అర్థం లేదని చెప్పారు. 2005లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో ఎకరం భూమి కేటాయించిందని గుర్తుచేశారు. తాజాగా కేటాయించిన స్థలం టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కిలోమీటరు దూరంలోపే ఉందని తెలిపారు. అక్రమంగా జారీ చేసిన ఈ జీవోలను కొట్టేయాలని కోరారు.

వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివా్‌సరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ, హైదరాబాద్‌ కలెక్టర్లకు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.