ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్‌

 ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము(64) రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్‌ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ, కేబినెట్‌ మంత్రులు సహా మద్దతు పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ నామినేషన్‌ పత్రాలను అందజేశారామె.  కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాగస్వామి పక్షాలతోపాటు బీజేడీ, వైయస్సార్సీపీ నాయకుల సమక్షంలో ద్రౌపతి ముర్ము నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ముర్ము పేరుని మొదటిగా ప్రధాని మోదీ  ప్రతిపాదించారు. ఆ తర్వాత రెండవ వ్యక్తిగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బలపరిచారు. ద్వితీయ స్థాయి ప్రతిపాదకుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మూడవ స్థాయి బలపరిచినవారిలో హిమాచల్‌ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఇక నాలుగవ స్థాయి ప్రతిపాదకుల్లో గుజరాత్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

 కాగా ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు కాకపోయిన వైయస్సార్ కాంగ్రెస్, బీజూ జనతా దళ్(బీజేడీ) లీడర్లు ముర్ము నామినేషన్‌కు మద్ధతు ప్రకటించారు. ఇక తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే నేత ఓ పన్నీర్ సెల్వం, ఎం.తంబి దొరై, జేడీ-యూ రాజీవ్ రంజన్ సింగ్ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

అంతకుముందు ఆమె పార్లమెంట్‌ ఆవరణలో ఉన్న గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు.  ద్రౌపది వెంట.. బీజేపీతో పాటు మద్ధతు ప్రకటించిన పార్టీల ప్రతినిధులు సైతం ఉ‍న్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల మద్దతును కోరారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌లతో ముర్ము ఫోన్ చేసి మాట్లాడారు.  త‌న అభ్య‌ర్ధిత్వానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ముర్ము ఆ ముగ్గురు నేత‌ల్నికోరారు.

నామినేషన్ కార్యక్రమం తర్వాత ఆమె రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. జూలై 1 నుంచి రాష్ట్రాల టూర్ కు వెళ్లనున్నారు. రోజుకు రెండు రాష్ట్రాల్లో పర్యటించేలా బీజేపీ ముఖ్య నేతలు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు . జూలై 18 న రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్  జరగనుంది. ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 27న నామినేషన్ వేయనున్నారు.

ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి బీజూ జనతాదళ్ (బీజేడీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతు పలికాయి. దీంతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా సునాయాసంగా ఎన్నిక కానున్నారు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఓట్లు 10,86,431 కాగా, ఎన్డీయేకి 5,32,351 ఓట్లు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కు 45,550 ఓట్లు, బీజేడీకి 31,686 ఓట్లు, అన్నాడీఎంకేకు 14,940 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ ముర్ముకే పడనున్నాయి. చిన్న వయసులోనే (64) రాష్ట్రపతిగా ఎన్నికైన మహిళగా ముర్ము చరిత్ర సృష్టించనున్నారు. అంతేకాదు, రాష్ట్రపతి స్థానాన్ని అలంకరించే తొలి గిరిజన మహిళ కూడా ఆమే అవుతారు.