నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్‌

నీతి ఆయోగ్  కొత్త సీఈఓగా  తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మాజీ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్‌  నియమితులయ్యారు. జూన్ 30న పదవీ విరమణ చేయనున్న అమితబ్ కాంత్ స్థానంలో అయ్యర్ బాధ్యతలు చేపడతారు. రెండేళ్లు లేదా, తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఆయన పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు.

అమితబ్ కాంత్‌కు వర్తింపజేసిన సర్వీస్ నిబంధనలే ఆయనకు కూడా వర్తిస్తాయని సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వుల్లో తెలిపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 1981 ఐఏఎస్ అధికారి అయిన అయ్యర్‌కు పారిశుద్ధ్య స్పెషలిస్ట్‌గా కూడా మంచిపేరుంది.

2009లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) నుంచి అయ్యర్ రిటైర్ అయ్యారు. 2016లో డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ (డీఓడీడబ్ల్యూఎస్) శాఖ కార్యదర్శిగా తిరిగి వచ్చారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌కు స్ఫూర్తిగా నిలిచారు.

2020లో డీఓ‌డీ‌డబ్ల్యూఎస్ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.  ఆ తర్వాత వరల్డ్ బ్యాంకుతో కలిసి పనిచేసేందుకు అమెరికా వెళ్లారు. యూపీలో మాయావతి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో కూడా అయ్యర్ పనిచేశారు.