అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన సీఎం ఉద్దవ్‌ ఠాక్రే

ముఖ్యమంత్రి పదవిపై తనకు మోజు లేదన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘వర్షా’ను ఖాళీ చేసి ఆయన సొంత గృహమైన ‘మాతోశ్రీ’కి చేరుకున్నారు.
మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి నుంచి శివసేన బయటకు రావాల్సిందేనని ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు తేల్చిచెప్పిన తర్వాత ఈ పరిణామం జరిగింది.
 అంతకముందు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై తొలిసారి ఫేస్‌బుక్‌ లైవ్‌ నిర్వహించిన ఉద్ధవ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సొంత పార్టీ నేతలే తనను ముఖ్యమంత్రిగా వద్దనుకుంటే.. ఆ విషయం తనతో చెప్పాలని సూచించారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అనంతరమే ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సొంతింటికి వెళ్లిపోయారు.
బుధవారం తెల్లారేసరికల్లా సూరత్ నుంచి గౌహతి చేరుకున్న రెబెల్ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేనే తమ నాయకుడని ప్రకటించారు. తమదే అసలైన శివసేన అంటూ తీర్మానం చేసి, గవర్నర్ కు లేఖను పంపారు. 
 
సాయంత్రం కల్లా వీరికి తోడుగా మరో నలుగురు సేన ఎమ్మెల్యేలు గౌహతి క్యాంపులో చేరారు. మరోవైపు సంక్షోభం సమసి పోవాలంటే రెబెల్ నేత ఎకనాథ్  షిండేను సీఎం చేయాలని థాక్రేకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ సూచించినట్లు సాయంత్రం వార్తలు వచ్చాయి.  ఈ నాటకీయ పరిణామాల మధ్య బుధవారం రాత్రి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటిబాట పట్టారు. 
 
అధికారిక బంగ్లా ‘వర్షా’ను ఖాళీ చేసి సొంత నివాసం ‘మతోశ్రీ’కి వెళ్లిపోయారు. దీంతో ఠాక్రే రాజీనామా చేస్తారని, లేకపోతే అసెంబ్లీని రద్దు చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. తిరుగుబాటు నేపథ్యంలో శివసేన శాసనసభా పక్ష నేతగా షిండేను తొలగించినట్లు ఆ పార్టీ మంగళవారం ప్రకటించగా.. తాజాగా బుధవారం తమదే అసలైన శివసేన అని రెబెల్ ఎమ్మెల్యేలు గవర్నర్ కు తెలిపారు. 
 
పార్టీ చీఫ్ విప్ సునీల్ ప్రభును తొలగించి, ఆ పదవిలో కొత్తగా ఎమ్మెల్యే భరత్ గోగవాలేను నియమించినట్లు కూడా లేఖలో పేర్కొన్నారు. శివసేనకు చెందిన 34 మంది ఎమ్మెల్యేలు ఆ లేఖపై సంతకాలు చేశారు.
 
 ‘‘శివసేన, శివసైనికుల మనుగడ కోసం ఫ్రంట్ నుంచి బయటకు రావడం అత్యవసరం. రెండున్నరేండ్లలో సంకీర్ణ కూటమిలోని మిత్రపక్షాలే లాభపడ్డాయి. అందుకే ఇప్పుడు మహారాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది” అని ఏక్ నాథ్ షిండే ట్వీట్ చేశారు. సిద్ధాంతపరంగా పూర్తి వ్యతిరేకంగా ఉన్న ఎన్సీపీ, కాంగ్రెస్ తో జట్టుకట్టడాన్ని తప్పుపట్టారు.
 
సంక్షోభం నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్, బీజేపీ వేర్వేరుగా శాసనసభా పక్ష సమావేశాలు నిర్వహించాయి. తమ ఎమ్మెల్యే లంతా కలిసికట్టుగా ఉన్నారని ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రకటించాయి. బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమయ్యా రు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. 
 
రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 37 మంది మద్దతు అవసరం కాగా, ఆ లోటు రెబెల్ ఎమ్మెల్యేలతో తీరే అవకాశంపై చర్చించినట్లు తెలిసింది.