24న ద్రౌపది ముర్ము నామినేషన్

ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ద్రౌపది ముర్ము జూన్ 24న (శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అభ్యర్థిత్వం కోసం ఆమె పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ  జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రతిపాదించనున్నట్లు సమాచారం. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి  ఎన్డీయే కూటమిలోని అన్ని మిత్ర పక్షాలను, మిత్రపక్ష పార్టీల ముఖ్యమంత్రులను ఆహ్వానించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొంటామంటూ మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ సీఎం నేఫ్యూ రియో ఇప్పటికే నిర్ధారించారని తెలుస్తున్నది.  బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరవుతారని భావిస్తున్నారు. 
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం పట్ల బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత పదవికి గిరిజన మహిళను ఎంపిక చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఆమె  ఎంపిక గురించి ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం తనకు తెలిపారని వెల్లడించారు.  ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తామని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అధికారికంగా బుధవారం ప్రకటించారు.
ద్రౌపది ముర్ము ఎంపికను బిజూ జనతాదళ్‌(బీజేడీ), జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీలు స్వాగతించాయి. ‘ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై నాతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించినప్పుడు నేను చాలా సంతోషించాను. ఒడిశా ప్రజలకు ఇది నిజంగా గర్వకారణం’ అని బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ట్వీట్‌ చేశారు.
తమ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల జార్ఖండ్‌ అధికార పార్టీ జేఎంఎం సంతోషం వ్యక్తం చేసింది. దేశ అత్యున్నత పదవికి గిరిజన మహిళను ఎంపిక చేయడాన్ని స్వాగతిస్తున్నామని జేఎంఎం అధికార ప్రతినిధి మనోజ్‌ పాండే తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఆయన ఆకాంక్షించారు.
ద్రౌపది ఎన్నిక ఇక లాంఛనమే 
 
ఇలా ఉండగా, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం లాంఛనమే  అని స్పష్టం అవుతున్నది.  ఎన్‌డిఎ  ఓట్ల శాతం 50శాతం దాటడమే ఆమె విజయానికి బాటలు వేస్తోంది. తద్వారా భారతదేశానికి గిరిజన మహిళ మొదటిసారి రాష్ట్రపతి కానున్నారు.
 
 ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపదికి సొంతరాష్ట్రం ఒడిశాకు చెందిన అధికార బిజూ జనతాదళ్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మొత్తం ఓట్లలో(10,86,431) 52 శాతం ఆమెకే (5,67,000) లభించనున్నాయి. బిజెపితో పాటు మిత్రపక్షాలకు చెందిన ఎంపిలు, ఎంఎల్‌ఎల ఓట్ల శాతం (3,08,000) కూడా ఇందులో కలిసివస్తుంది. 
 
నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజెడి ఓట్లు 32,000. అంటే మొత్తం ఎలక్టోరల్ ఓట్ల శాతంలో ఆ పార్టీవి 2.9శాతం. ఒడిశాలో అధికార బిజెడికి 114 మంది శాసనసభ్యులున్నారు. బిజెపికి 22 మంది ఉన్నారు. అదే విధంగా ఇరు పార్టీలకు చెరో 12మంది లోక్‌సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యులున్నారు.
 
 మరో రెండు ప్రాంతీయ పార్టీలు వైఎస్‌ఆర్‌సిపి, ఎఐఎడిఎంకె కూడా ఎన్‌డిఎ అభ్యర్థివైపే మొగ్గు చూపుతున్నాయి. ఝార్ఖండ్ లో కాంగ్రెస్ తో కలసి ప్రభుత్వం నిర్వహిస్తున్న జేఎంఎం కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించడం గమనార్హం.  ఇటీవలి రాజ్యసభ ఎన్నికల తర్వాత ఎగువసభ అయిన రాజ్యసభలో బిజెపి సభ్యుల సంఖ్య 92కు చేరింది. ఇక లోక్‌సభలో బిజెపికి సొంతంగా 301 మంది సభ్యుల బలం ఉంది.