సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు భారత్, జపాన్, చైనా వైపు శ్రీలంక

దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నుండి  గట్టెక్కేందుకు భారత్, జపాన్, చైనా దేశాల సహకారం కోరాలని నిర్ణయించినట్లు శ్రీలంక ప్రధాన మంత్రి విక్రమసింగే తెలిపారు. అందులో భాగంగా శ్రీలంక సంక్షోభానికి పరిష్కార మార్గం దిశగా భారత్, జపాన్, చైనా దేశాలతో డోనర్ కాన్ఫరెన్స్ నిర్వహించి చర్చించనున్నట్లు చెప్పారు.
అమెరికా  నుంచి కూడా సాయం కోరాలని నిర్ణయించినట్లు శ్రీలంక ప్రధాని   పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. భారత్ నుంచి ఉన్నత స్థాయి అధికారులు గురువారం శ్రీలంకకు రానున్నారని, భారత్ నుంచి అదనంగా అందే సాయం గురించి చర్చించడానికి వాళ్లు వస్తున్నారని ఆయన చెప్పారు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న శ్రీలంకకు ఇప్పటికే భారత్ 3 బిలియన్ డాలర్ల సాయం చేసింది.
 ప్రస్తుతం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. తిండి గింజలు కూడా దొరకక బతుకు బరువై తట్టుకోలేని పరిస్థితుల్లో జనం రోడ్డున పడుతున్నారు. 2019లో ఈస్టర్‌ దాడులు, తరవాత కరోనా మహమ్మారి ప్రభావం, పర్యాటక రంగం కుదేలవడం, నిరుద్యోగం విపరీతంగా పెరగడం, తీవ్ర ఆహార కొరత, ఏక కుటుంబ పాలన, పాలకుల అనాలోచిత ధోరణి, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం, సులభతర విదేశీ రుణాలపై విపరీతంగా ఆధారపడటం ఇలా చాలా కారణాలు శ్రీలంకను కోలుకోలేని ఆహార, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి.
శ్రీలంక దేశ జీడీపీని గమనిస్తే పది శాతానికి మించి పర్యాటక రంగం వాటానే ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఏటా పర్యాటక రంగం నుంచి 360 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరితే, కరోనా కారణంగా ఇది 60 కోట్ల డాలర్లకు పడిపోయింది. పర్యాటక రంగంపై ఆధారపడిన దాదాపు 30 లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.
 అప్పటికే 2019లో ఈస్టర్‌ పండుగ నాడు మూడు చర్చిల్లో, హోటళ్లలో జరిగిన కాల్పులు, పేలుళ్ల కారణంగా చాలా మంది మరణించారు. ఈ కారణంగా పర్యాటకం కొంత ప్రభావానికి గురైంది. తర్వాత కరోనా ఈ రంగాన్ని మరింత అంధకారంలోకి నెట్టింది.
చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎరువులు నాణ్యతగా లేకపోవడం వల్ల వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే సరిపడిన డాలర్లు (విదేశీ మారక ద్రవ్యం) లేకపోవడం, ఫలితంగా 100 శాతం సేంద్రీయ వ్యవసాయానికి అడుగులు వేయడం, అది సత్ఫలితాలను ఇవ్వకపోగా తీవ్ర తిండి గింజల కరువుకు దారి తీసింది.
రష్యా ఉక్రెయిన్‌ సంక్షోభ పరిస్థితుల కారణంగా పెట్రో ధరలు పెరగడం, ప్రధానంగా సముద్ర మార్గంపైనే ఆధారపడిన శ్రీలంక ఎగుమతులు, దిగుమతులపైన తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. చివరికి విదేశీ సంస్థలు, ప్రపంచ దేశాలకు అప్పుకట్టలేని స్థితిలో శ్రీలంక ఇబ్బంది పడుతోంది. అప్పులు కట్టలేము అని బహిరంగంగా ప్రకటించింది కూడా.
ప్రస్తుతం ఆహార సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులతోపాటు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. కాగితం, సిరా కొరతతో కనీసం విద్యార్థులకు పరీక్షల నిర్వహణ కూడా వాయిదా వేశారు. డీజిల్‌ విక్రయాల నిలిపివేత, రోజుకు 15 గంటల కరెంటు కోత ఇలా చాలా సమస్యలను శ్రీలంక ఎదుర్కుంటోంది.